Share News

విజిలెన్స్‌కు అపరిమిత అధికారాలా?

ABN , Publish Date - Mar 16 , 2024 | 02:47 AM

రాష్ట్రంలోని ఏ కార్యాలయాన్నైనా, సంస్థనైనా సందర్శించేందుకు, తనిఖీ చేసి రికార్డులు జప్తు చేసేందుకు వీలుగా విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖలోని గజిటెడ్‌ అధికారులను అధీకృత అధికారులుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ శాఖ ఐజీ రఘురామిరెడ్డి రాసిన లేఖ పై పూర్తి వివరాలు సమర్పించాలని ఏపీ సర్కార్‌ను హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.

విజిలెన్స్‌కు అపరిమిత అధికారాలా?

సర్కారుకు హైకోర్టు సూటి ప్రశ్న

అధికారులకు విస్తృత అధికారాల కల్పన ఎలా సాధ్యం?

చట్టాలకు లోబడి ఆయా శాఖలు పనిచేస్తున్నాయి

వాటిపై అధికారాలు కావాలని విజిలెన్స్‌ ఐజీ ఎలా కోరతారు?

చట్టబద్ధంగా కల్పించాల్సిన అధికారాలను కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా దఖలుపర్చలేరు

ఐజీ రఘురామిరెడ్డి లేఖపై వివరాలు సమర్పించండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.. విచారణ 19కి వాయిదా

అమరావతి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఏ కార్యాలయాన్నైనా, సంస్థనైనా సందర్శించేందుకు, తనిఖీ చేసి రికార్డులు జప్తు చేసేందుకు వీలుగా విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖలోని గజిటెడ్‌ అధికారులను అధీకృత అధికారులుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ శాఖ ఐజీ రఘురామిరెడ్డి రాసిన లేఖ పై పూర్తి వివరాలు సమర్పించాలని ఏపీ సర్కార్‌ను హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఆయా చట్టాలకు లోబడి సంబంధిత శాఖలు పనిచేస్తున్నాయని, అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖలను, ఆయా చట్టాలను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ పరిధిలోకి తీసుకురావాలని ఐజీ ఎలా కోరతారని ప్రశ్నించింది. చట్టబద్ధంగా కల్పించాల్సిన అధికారాలను కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా దఖలుపర్చలేరని వ్యాఖ్యానించింది. ఐజీ అభ్యర్ధన మేరకు విస్తృత అధికారాలు కల్పించడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. ఐజీ అభ్యర్ధన కేవలం ప్రతిపాదన దశలోనే ఉందని గుర్తు చేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలోని ఏ కార్యాలయాన్నైనా, సంస్థనైనా సందర్శించేందుకు, తనిఖీ చేసి రికార్డులు జప్తు చేసేందుకు, వారెంట్‌ లేకుండా అరెస్ట్‌ చేసేందుకు వీలుగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖలో పనిచేసే గెజిటెడ్‌ అధికారులను అధీకృత అధికారులుగా నియమించి, అపరిమిత అధికారాలు కల్పించాలని కోరుతూ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ రఘురామిరెడ్డి రాసిన లేఖను సవాల్‌ చేస్తూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

లేఖకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి తీసుకున్న చర్యలను చట్ట, రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు. లేఖకు ఆధారంగా చర్యలు చేపట్టకుండా ముఖ్యమంత్రితో సహా సంబంధిత అధికారులు ఎలాంటి ఉత్తర్వులు, నోటీసులు, సర్క్యులర్లు, ఆర్డినెన్స్‌ తదితరాలు జారీ చేయకుండా నిషేధం విధించాలని కోరారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ... రాష్ట్ర ప్రభుత్వంలోని 13 శాఖలు, చట్టాల పై అపరిమిత అధికారాలు కల్పించాలని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీ లేఖ రాశారన్నారు. సోదాలు చేస్తాను అధికారాలు కల్పించండి అని దిగువస్థాయి అధికారి ప్రభుత్వాన్ని కోరడానికి వీల్లేదన్నారు. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు, శాఖలో జరిగే ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపి ఆయా శాఖలకు నివేదిక మాత్రమే సమర్పించగలదన్నారు. అంతిమ నిర్ణయాధికారం ఆయా శాఖాధిపతులదేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖలు, ఆయా చట్టాలను విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పరిధిలోకి తీసుకురావాలని, క్వాషీ జ్యుడీషియల్‌ అధికారాలు కల్పించాలని విజిలెన్స్‌ ఐజీ తన లేఖలో కోరారన్నారు. ఇదే జరిగితే ప్రైవేటు వ్యాపారసంస్థలలో కూడా సోదాలు నిర్వహించి, జప్తు చేసే అధికారం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఉంటుందన్నారు. ఇలా చేయడం చట్టవిరుద్ధమన్నారు. టీడీపీ నాయకులు, మద్దతుదారులను తప్పుడు కేసులలో ఇరికించాలనే ఉద్దేశంతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అక్రమంగా అధికారాలు కట్టబెట్టబోతున్నారన్నారు. ఆ ప్రక్రియ సాగుతోందని, ఎప్పుడైనా ఉత్తర్వులు రావచ్చునని అన్నారు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.... విస్తృత అధికారాలు కల్పించాలని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీ లేఖ మాత్రమే రాశారన్నారు. ఈ వ్యవహారం పై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని న్యాయశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించిందన్నారు. మొత్తం 13శాఖలకు సంబంధించిన శాఖాధిపతుల సమ్మతి తీసుకోవాల్సి ఉందన్నారు. ఐజీ ప్రతిపాదనలో వ్యాపారసంస్థలకు నష్టం అని భావిస్తే వారే కోర్టును ఆశ్రయించాలన్నారు. వారి తరపున రాజకీయపార్టీ పిటిషన్‌ వేయడమేంటని ప్రశ్నించారు. ఇరువైపుల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ వ్యవహారం పై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

Updated Date - Mar 16 , 2024 | 02:47 AM