అనుమతు లేని లెనిన్ చిల్డ్రన్ హోమ్ సీజ్
ABN , Publish Date - Aug 21 , 2024 | 12:39 AM
మండల కేంద్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న లెనిన్ చిల్డ్రన్ హోమ్‌ని ప్రత్యేక మండల కమిటీ అధికారులు సీజ్ చేశారు.
ప్రత్యేక మండల కమిటీ పరిశీలన
ఎటువంటి అనుమతులు లేకపోవడంతో మూసివేత
25 మంది విద్యార్థినీ, విద్యార్థులను
ఆశ్రమాలు, పోస్టు మెట్రిక్ హాస్టళ్లకు తరలింపు
ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి వెల్లడి
చింతపల్లి, ఆగస్టు 20: మండల కేంద్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న లెనిన్ చిల్డ్రన్ హోమ్‌ని ప్రత్యేక మండల కమిటీ అధికారులు సీజ్ చేశారు. మంగళవారం కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.సూర్యలక్ష్మి పర్యవేక్షణలో ప్రత్యేక మండల కమిటీ అధికారులు తహసీల్దార్ టి.రామకృష్ణ, ఏవో రవీంద్ర, ఎంఈవో పనసల ప్రసాద్, ఏటీడబ్ల్యూవో జయ నాగలక్ష్మి, ఏసీడీపీవో రామలక్ష్మి బాలసదనం, సెయింట్ ఆన్స్, బీసీ వెల్ఫేర్ వసతి గృహాలు, లెనిన్ చిల్డ్రన్ హోమ్‌లను తనిఖీ చేశారు. లెనిన్ చిల్డ్రన్‌హోమ్‌కు ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్టు ప్రత్యేక కమిటీ అధికారులు గుర్తించి సీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ లెనిన్ చిల్డ్రన్ హోమ్ నిర్వహణకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. హోమ్ నిర్వాహకులు సునీతను రికార్డుల కోసం ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నారన్నారు. హోమ్‌లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు చదువుతున్న 25 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఉన్నారన్నారు. విద్యార్థుల అడ్మిషన్ రిజిస్ట్రర్, హాజరు పుస్తకం, మెనూ, ఇతర రికార్డులు లేవన్నారు. విద్యార్థులకు సరైన వసతి లేదన్నారు. బాలికలు, బాలురు ఒకే భవనంలో నివాసం ఉంటున్నారన్నారు. ఈ హోమ్‌లో ఉంటున్న విద్యార్థులను ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు, పోస్టు మెట్రిక్ వసతి గృహాలకు తరలించామన్నారు. రెండో తరగతిలోపు విద్యార్థులను సెయింట్ ఆన్స్ వసతి గృహానికి తరలించామన్నారు. లెనిన్ హోమ్ సీజన్ చేసినట్టు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం పంపించామన్నారు. అనాథ ఆశ్రమాలు నిర్వహించేందుకు కచ్చితంగా ప్రభుత్వ అనుమతి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ అరుణ్ కిరణ్, ఎంఈవో-2 గెమ్మెలి బోడం నాయుడు పాల్గొన్నారు.