ద్విచక్ర వాహనదారులుహెల్మెట్ ధరించాల్సిందే
ABN , Publish Date - Jun 27 , 2024 | 02:18 AM
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది.

చట్టనిబంధనలు కఠినంగా అమలు చేయండి
ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలి
నిబంధనలు ఉల్లంఘించేవారిని ఉపేక్షించవద్దు
కేంద్ర మోటార్ వాహన సవరణ చట్టం
ఏ మేరకు అమలు చేస్తున్నారు?: హైకోర్టు ప్రశ్న
కౌంటర్ దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం
అమరావతి, జూన్ 26(ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. రోడ్డు ప్రమాదాల కారణంగా రాష్ట్రంలో ఏటా వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో చట్టనిబంధనలు కఠినంగా అమలుచేయాలని ప్రభుత్వం, పోలీసులను ఆదేశించింది. రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్ ధరించకపోవడం వల్ల సంభవించే దుష్ప్రభావాలు, చట్టనిబంధనల గురించి అధికారులతో కలసి ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది. మోటార్ వెహికిల్ చట్టనిబంధనల గురించి విస్తృత సర్క్యులేషన్ ఉన్న ప్రాంతీయ, జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని పేర్కొంది. రోడ్లపై విధులు, వాహన తనిఖీలు నిర్వహించే పోలీసు అధికారులు తప్పనిసరిగా బాడీ కెమెరాలు ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. చట్టనిబంధనలు ఉల్లంఘించేవారిని ఎంతమాత్రం ఉపేక్షించవద్దని, విస్తృత ప్రజా ప్రయోజనం ఇమిడి ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీరియ్‌సగా తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. కేంద్ర మోటార్ వెహికిల్ సవరణ చట్టం అమలుకు ఏం చర్యలు తీసుకున్నారు? వాహనాలు తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘించినవారికి చలాన్‌ల విధింపు, తదితర వివరాలను కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పిల్ దాఖలు చేసిన పార్టీ ఇన్ పర్సన్ న్యాయవాది తాండవ యేగేశ్‌ను అభినందించింది. కేంద్ర మోటార్ వాహన సవరణ చట్టం నిబంధనలు అమలు చేయకపోవడంతో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు ఉల్లంఘించినవారికి జరిమానా విధించడంలేదని పేర్కొంటూ యోగేశ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రోడ్లపై విధులు నిర్వర్తించే పోలీస్, ఇతర అధికారులు తప్పనిసరిగా బాడీ కెమెరాలు ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిల్ బుధవారం విచారణకు రాగా యోగేశ్ వాదనలు వినిపించారు. గణాంకాల ప్రకారం.. 2022లో జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదాల్లో 3,703 మరణాలు సంభవించాయని, ఇందులో 3,042 మంది హెల్మెట్ ధరించకపోవడంతో సంభవించినవేనని వివరించారు. నిబంధనల ప్రకారం వాహనదారులు, వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... విజయవాడలో వాహనదారులు హెల్మెట్ ధరించకుండా తిరగడాన్ని తామూ గమనించామని, విస్తృత ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని చట్టనిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయడింది.