ఉన్నత విద్యామండలిలో గోల్‌మాల్!
ABN , Publish Date - Nov 13 , 2024 | 04:42 AM
ఉన్నత విద్యామండలిలో నిధుల గోల్‌మాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో మండలి కార్యదర్శిగా నియమితులైన నజీర్ అహ్మద్‌ను కూటమి ప్రభుత్వం నెల క్రితం తొలగించింది.

రెండున్నరేళ్ల క్యాష్‌బుక్‌లు మాయం
ఏటా రూ.60కోట్ల నగదు లావాదేవీలు
క్యాష్‌బుక్‌లు లేవన్న మాజీ కార్యదర్శి
ఖాతాల బాధ్యత అప్పగింతలో చిక్కులు
మండలి ఉద్యోగులకు ఆగిపోయిన జీతాలు
వైసీపీ ప్రభుత్వంలోనే క్యాష్‌బుక్‌లకు స్వస్తి
జేఎన్‌టీయూ-ఏ అధికారిణి చేతివాటం?
కంప్యూటరైజ్డ్‌కు బదులు మాన్యువల్ బిల్లులు
హోదాతో కాకుండా అధికారి పేరుతో నగదు డ్రా
అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యామండలిలో నిధుల గోల్‌మాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో మండలి కార్యదర్శిగా నియమితులైన నజీర్ అహ్మద్‌ను కూటమి ప్రభుత్వం నెల క్రితం తొలగించింది. మండలి జాయింట్ డైరెక్టర్ కృష్ణమూర్తికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. అయితే ఆర్థిక ఖాతాల అప్పగింతలో చిక్కులు చోటు చేసుకున్నాయి. క్యాష్‌బుక్‌లు లేకుండా ఖాతాలు అప్పగిస్తామని నజీర్ ఆహ్మద్ చెబుతుంటే ఇన్‌చార్జ్ కార్యదర్శి అంగీకరించడం లేదు. దీంతో ఈ నెల 13వ తేదీ వచ్చినా మండలి ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఇన్‌చార్జ్ చైర్మన్ నుంచి సాధారణ ఉద్యోగుల వరకు అందరికీ జీతాలు నిలిచిపోయాయి. క్యాష్‌బుక్‌లు మాయం కావడంతో మొత్తం నిధుల్లో ఎంతమేర దారిమళ్లాయోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో ఉన్నత విద్యామండలిలో నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. రకరకాల ప్రాజెక్టులను తెరపైకి తీసుకొచ్చి రూ.కోట్లలో బిల్లులు చెల్లించారు. చివర్లోనూ హడావిడిగా ఎడెక్స్ అనే కంపెనీతో రూ.50 కోట్ల ఒప్పందం చేసుకున్నారు. గత ప్రభుత్వంలో మండలి చైర్మన్‌గా ఉన్న కె.హేమచంద్రారెడ్డి... జేఎన్‌టీయూ-అనంతపురం నుంచి ఓ మహిళా అధికారిని తీసుకొచ్చి ఆర్థిక ఖాతాలు ఆమె చేతిలో పెట్టారు. అప్పటినుంచి క్యాష్‌బుక్‌లు రాసే సంస్కృతికి మంగళం పాడారు. నిబంధనల ప్రకారం మండలికి ఎంత ఆదాయం వచ్చింది? ఎంత ఖర్చు చేశారు? ఎంత నిల్వ ఉంది? అనే లెక్కలు క్యాష్‌బుక్‌లో రాయాలి. ప్రతి ఖర్చు అనంతరం ఎంత బ్యాలెన్స్ ఉందో పేర్కొనాలి. గత రెండున్నరేళ్లుగా మండలిలో క్యాష్‌బుక్‌లు లేకుండానే రూ.కోట్లు ఖర్చు చేశారు.
దేనికీ లెక్కల్లేవు
మండలిలో ప్రధానంగా మూడు రకాల ఖాతాలు ఉంటాయి. ఈఏపీసెట్, ఈసెట్, ఎడ్‌సెట్ లాంటి సెట్ల నిర్వహణ, మండలి ఖర్చుల నిర్వహణ, కాలేజీల నుంచి వచ్చే ఫీజుల నిర్వహణకు వేర్వేరుగా ఖాతాలు నిర్వహిస్తారు. ప్రతి సెట్‌కు ఒక ప్రత్యేక ఖాతా ఉంటుంది. ఇలా దాదాపు 50 రకాల బ్యాంకు ఖాతాలు ఉంటాయి. గతంలో ప్రతి ఖాతాకు క్యాష్‌బుక్‌లు నిర్వహించేవారు. రెండున్నరేళ్లుగా క్యాష్‌బుక్‌లు లేకపోవడంతో ఫీజుల ద్వారా వచ్చింది ఎంత? ఖర్చు చేసింది ఎంత? అనేదానిపై స్పష్టమైన లెక్కలు లేవు. ఉన్నత విద్యామండలిలో ఏటా సుమారు రూ.60 కోట్ల నగదు లావాదేవీలు జరుగుతాయి. గత రెండున్నరేళ్లుగా వీటికి లెక్కలు లేకపోవడంతో దాదాపు రూ.150 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నత విద్యామండలిలో ఎక్కువమంది అనంతపురానికి చెందిన అధికారులు పనిచేశారు. అప్పటి చైర్మన్ హేమచంద్రారెడ్డి జేఎన్‌టీయూ-అనంతపురం ప్రొఫెసర్ కావడమే దీనికి కారణం. అయితే అక్కడినుంచి ఉన్నత విద్యామండలికి డెప్యుటేషన్‌పై వచ్చిన మహిళా అధికారి కంప్యూటరైజ్డ్ బిల్లుల విధానం కాదని మాన్యువల్ బిల్లులు రాశారు. ఆ బిల్లు పుస్తకాలు కూడా అనంతపురంలో తయారుచేసి ఇక్కడికి తీసుకొచ్చారు. మండలి నిర్వహణ ఖర్చుల పేరుతో ఎడాపెడా బిల్లులు రాసి నగదు విత్‌డ్రా చేశారు. పైగా మండలి కార్యదర్శి హోదాతో నగదు డ్రా కావాల్సి ఉంటే, అందుకు బదులుగా ఆ సీట్లో కూర్చున్న అధికారి పేరుతో తీసుకున్నారు. ఇప్పుడు క్యాష్‌బుక్‌లు లేకుండానే లెక్కలు అప్పగిస్తామని మాజీ కార్యదర్శి అంటున్నారు. క్యాష్‌బుక్‌లు లేకుండా బాధ్యతలు తీసుకుంటే, అందులో నిధుల దుర్వినియోగం జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని కొత్త కార్యదర్శి ప్రశ్నిస్తున్నారు.