Share News

కూలిన కాపురాలు..!

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:59 PM

గుంతకల్లు మండలం నల్లదాసరిపల్లికి చెందిన ఆవుల లక్ష్మన్న(52), క్రిష్ణవేణి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. రెండో కూతురు లలితను కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం దౌల్తాపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌కు ఇచ్చి 2021లో వివాహం చేశారు.

కూలిన కాపురాలు..!
హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

ఒక హత్య.. ఒక ఆత్మహత్య

ఒకే రోజు.. ఒకే ప్రాంతంలో..

భార్య, అత్తింటివారి వేధింపులతో యువకుడి బలవన్మరణం

భార్యను కాపురానికి పంపలేదని మామను నరికేసిన అల్లుడు

కాపురాలను నిలబెట్టలేకపోయిన పెద్ద మనుషుల పంచాయితీలు

బతుకులు, భవిత మీద అవగాహన లేనితనం హత్యలకు, ఆత్మహత్యలకు దారితీస్తోంది. చిన్న చిన్న గొడవలు చినికి చినికి గాలివానగా మారి.. కాపురాలను కూల్చేస్తున్నాయి. గుంతకల్లు మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకున్న ఓ హత్య, ఓ ఆత్మహత్య.. బంధువుల మధ్య బంధాలు ఏ స్థాయిలో పతనమైపోతున్నాయో చెబుతున్నాయి.

పాతికేళ్లు కూడా నిండని యువకుడికి పెళ్లి జరిగి ఏడాదిన్నర అయింది. ముద్దులొలికే కొడుకు పుట్టాడు. అప్పటిదాకా వారిద్దరి మధ్య ఏవైనా గొడవలు ఉన్నా.. వారసుడు పుట్టిన ఆనందంలో సర్దుకుపోవాల్సింది. కానీ, ఎక్కువయ్యాయి. అనారోగ్యంతో బిడ్డ ప్రాణం పోయింది. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. జీవితంపై విరక్తిచెంది.. ఆ యువకుడు ఉరి వేసుకున్నాడు.

పల్లెటూరి తండ్రి..! బిడ్డను మురిపెంగా పెంచుకున్నాడు. ఉన్నంతలో ఘనంగా వివాహం జరిపించి.. అత్తారింటికి పంపించాడు. మద్యానికి బానిసైన అల్లుడు.. అదనపు కట్నం కోసం వేధించాడు. ఆమె విసిగిపోయింది. ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. పండంటి కూతురుకు జన్మనిచ్చింది. కానీ భర్త తీరు మారకపోవడంతో ఇక్కడే ఉండిపోయింది. ‘నువ్వు రాకపోతే రాకపోతివి.. నా బిడ్డను నాకు ఇచ్చెయ్‌’ అన్నాడు అతను. ఇదేం పద్ధతి అని మామ మందలించాడు. అవమానంగా భావించిన అల్లుడు.. దారికాచి మామను నరికేశాడు..!

వివాహాలు ఇద్దరు మనుషులను, రెండు మనసులను ఏకం చేయడమే కాదు.. రెండు కుటుంబాల మధ్య వారధి నిర్మించాలి. రెండు ఊళ్ల మధ్య బంధాన్ని, బంధుత్వాన్ని పెంచాలి. ‘మా ఊరి అల్లుడు, మా ఊరి ఆడబిడ్డ..’ అని.. సంతోషంగా చెప్పుకునేలా ఉండాలి. పెద్దలు సర్దిచెప్పినా, మందలించినా మాట వినేది ఎవరు..?

- గుంతకల్లు టౌన

దారికాచి.. హత్య

గుంతకల్లు మండలం నల్లదాసరిపల్లికి చెందిన ఆవుల లక్ష్మన్న(52), క్రిష్ణవేణి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. రెండో కూతురు లలితను కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం దౌల్తాపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌కు ఇచ్చి 2021లో వివాహం చేశారు. తాగుడుకు బానిస అయిన చంద్రశేఖర్‌, పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని భార్యను వేధించేవాడు. ఈ కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. లలిత గర్భం దాల్చడంతో ఆరు నెలల కింద పుట్టింటికి పిలుచుకువచ్చారు. మూడు నెలల క్రితం లలితకు కూతురు పుట్టింది. ఇప్పటికీ నల్లదాసరిపల్లిలోనే ఉంటోంది. అల్లుడి ప్రవర్తన నచ్చక.. ఆమెను పుట్టింటివారు కాపురానికి పంపలేదు. దీంతో చంద్రశేఖర్‌ పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. కాపురానికి రానిపక్షంలో మూడు నెలల పాపను తానే పెంచుకుంటానని అన్నాడు. ‘పాలుతాగే పసిబిడ్డను ఎలా తీసుకెళతావు..? బుద్ధి లేదా..?’ అని అల్లుడిని లక్ష్మన్న మందలించాడు. ఇలా పంచాయితీలో అవమానం జరిగిందని మామ మీద చంద్రశేఖర్‌ కక్ష పెంచుకున్నాడు. చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో లక్ష్మన్న గురువారం పనిమీద గుంతకల్లుకు వెళ్లాడు. సాయంత్రం 6-30 గంటలకు బైకు మీద స్వగ్రామానికి తిరుగుపయనమయ్యాడు. ఆ దారిలో.. తిమ్మపురం సమీపంలోని నక్కా ఓబులేసు పొలం వద్ద చంద్రశేఖర్‌, అతడి అన్న రాజశేఖర్‌, అన్న స్నేహితుడు సతీష్‌ మాటు వేశారు. లక్ష్మన్న రాగానే కత్తులతో విచక్షణా రహితంగా నరికేసి, పారిపోయారు.

ఏమీ ఎరగనట్లు..

చీకటి పడినా లక్ష్మన్న ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన చేశారు. స్పందించకపోవడంతో అనుమానంతో గుంతకల్లు రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. సెల్‌ఫోన లొకేషన తిమ్మాపురం వద్ద చూపించడంతో రూరల్‌ ఎస్‌ఐ కె.సురేష్‌ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అప్పటికే లక్ష్మన్న మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. హత్య చేసిన చంద్రశేఖర్‌ ఏమీ ఎరగనట్లు అక్కడికి వచ్చాడు. లక్ష్మన్న వైసీపీ వర్గీయుడు కావడంతో టీడీపీవారే హత్య చేసి ఉంటారని పోలీసులను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాడు. పోలీసులు అనంతపురం నుంచి క్లూస్‌ టీంను, జాగిలాలను రప్పించారు. జాగిలాలు అక్కడే ఉన్న చంద్రశేఖర్‌ వద్దకు వెళ్లి అగిపోవడంతో వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో మరో ఇద్దరితో కలిసి తన మామను తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

జీవితంపై విరక్తి

గుంతకల్లు పట్టణంలోని బీరప్ప సర్కిల్‌లో ఉంటున్న వడ్డె రోహిత కుమార్‌(24) గురువారం రాత్రి ఉరివేసుకున్నాడు. భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులే దీనికి కారణమని రోహిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. రోహిత కుమార్‌ గుంతకల్లులోని ఓ బైక్‌ షోరూంలో మెకానిక్‌గా పనిచేసేవాడు. ఇతనికి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన లక్ష్మిదేవితో గత ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. వీరికి కుమారుడు పుట్టాడు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లిపోయిన లక్ష్మిదేవి.. తన భర్త రోహితకుమార్‌, అతని కుటుంబసభ్యులపై ఎమ్మిగనూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 498-ఏ సెక్షన కింద కేసు నమోదైంది. ఆ తరువాత పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించింది. కాపురానికి వచ్చేందుకు తన పేరిట 10 సెంట్లు, తన కుమారుడి పేరిట 10 సెంట్ల స్థలం రాయించుకుంది. నెలల వయసున్న వీరి కుమారుడు ఆనారోగ్యంతో మృతిచెందడంతో లక్ష్మిదేవి తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో పది రోజుల క్రితం రోహిత కుమార్‌ టూటౌన పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేశాడు. రెండు కుటుంబాలవారిని సీఐ గణేష్‌ కుమార్‌ పిలిపించి మాట్లాడారు. తాను కోర్టులో చూసుకుంటానని చెప్పి లక్ష్మిదేవి వెళ్లిపోయింది. ఆ తరువాత తన భర్త రోహితకుమార్‌, అతని కుటుంబ సభ్యులతోపాటు సీఐ గణేష్‌ కుమార్‌కు లాయర్‌ ద్వారా నోటీసులు పంపించింది. రోహిత కుమార్‌కు ఫోన చేసి వేధించేది. దీంతో మనోవేదనకు లోనైన రోహిత కుమార్‌.. గురువారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ కోడలు లక్ష్మిదేవి, ఆమె కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రోహిత కుటుంబం గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట శుక్రవారం బైఠాయించింది. పోలీసులు వారికి నచ్చజెప్పారు. మృతుడి తండ్రి వడ్డె కిష్టప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Updated Date - Jul 06 , 2024 | 12:00 AM