Share News

వైద్యం అందక రెండు రోజుల్లో ఇద్దరు మృతి

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:42 AM

వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఐదేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన మరువక ముందే అదే గ్రామానికి చెందిన మంగళి అంజి (35) సకాలంలో వైద్యం అందక మృతిచెందిన సంఘటన గజ్జెహళ్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

వైద్యం అందక రెండు రోజుల్లో ఇద్దరు మృతి

గజ్జెహళ్లి ఆసుపత్రి ఎదుట గ్రామస్తుల నిరసన

అత్యవసర స్థితిలో ఆసుపత్రికి వస్తే అందని వైద్యం

డ్యూటీ డాక్టర్‌తో వాగ్వాదం

చర్యలు తీసుకోవాలంటూ బైఠాయింపు

ఆసుపత్రి ఎదుట నిరసన తెలుపుతున్న గ్రామస్థులు

హొళగుంద, మార్చి 7: వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఐదేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన మరువక ముందే అదే గ్రామానికి చెందిన మంగళి అంజి (35) సకాలంలో వైద్యం అందక మృతిచెందిన సంఘటన గజ్జెహళ్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. అంజి తన ఇంటి వద్ద స్పృహ తప్పి కింద పడటంతో కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు, వైద్య సిబ్బంది ఒక్కరూ అందుబాటులో లేకపోవడంతో ఆదోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో మృతుడి బంధువులు, గ్రామస్తులు గ్రామ పీహెచ్‌సీ ఎదుట నిరసన తెలిపారు. ఆలస్యంగా విధులకు హాజరైన డ్యూటీ డాక్టర్‌ రాధమ్మతో వాగ్వాదానికి దిగారు. రెండు రోజుల్లో గ్రామానికి చెందిన ఇద్దరు చనిపోయారని, ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వస్తే డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు ఎవ్వరూ అందుబాటులో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం కోసం గ్రామం నుండి పది కిలోమీటర్ల దూరంలోని పెద్దహరి వాణం లేదా ఆదోనికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. డాక్టర్లు స్థానికంగా ఉండకుండా, ఆదోనిలో ఉంటున్నారని, ఆసుపత్రికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో వస్తున్నారని, మూడు గంటలకు ఇళ్లకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై ఆదోని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో సత్యవతిని వివరణ కోరగా, డాక్టర్లు, డ్యూటీ సమయపాలన పాటించాలని, ఆసుపత్రి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్ల గురించి జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Mar 08 , 2024 | 12:42 AM