Share News

AP News: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వింత పోస్టింగులు.. జగన్‌ మార్క్‌ ట్రాన్స్‌ఫర్లు

ABN , Publish Date - Mar 09 , 2024 | 02:43 AM

రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీ వ్యవహారం రచ్చకెక్కుతోంది. తనకు భజన చేసేవారి బదిలీల విషయంలో కరుణ కురిపిస్తున్న సీఎం జగన్‌.. తమ పిల్లలు పొరుగు రాష్ట్రంలో ఉన్నారని, తాము ఇక్కడ మగ్గుతున్నామని..

AP News: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా  వింత పోస్టింగులు.. జగన్‌ మార్క్‌ ట్రాన్స్‌ఫర్లు

కొత్త పోస్టులు సృష్టించి మరీ భజనపరులకు అందలాలు

గత సీఎస్‌ శర్మ కాదన్నారు.. ప్రస్తుత సీఎస్‌ చేసేశారు

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వింత వింత పోస్టింగులతో తన భజనపరులను సీఎం జగన్‌ కీలకమైన పోస్టుల్లో కూర్చోబెడుతున్నారు. ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌కు విరుద్ధమైనా, నిబంధనలంటూ లేని మార్గాల్లో కూడా తన వారిని అందలం ఎక్కిస్తున్నారు. ఇదేసమయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎ్‌సలు కలిసి నిర్ణయించిన నిబంధనల ప్రకారం ఉద్యోగులను ఏపీ నుంచి తెలంగాణకు పంపడానికి మాత్రం సర్కారుకు మనసు రావడం లేదు. ఫలితంగా 2 వేల మంది ఉద్యోగులు ‘పిల్లలక్కడ.. మేమిక్కడ’ అంటూ తల్లడిల్లుతున్నారు.

సజ్జల ఓఎస్డీకి సానుకూల బదిలీ

రాష్ట్రంలో అరాచక పోస్టింగులు

సీఎం జగన్‌ మార్క్‌ ట్రాన్స్‌ఫర్లు

సెంట్రల్‌ నుంచి స్టేట్‌ సర్వీ్‌సలోకి

జిల్లా కేడర్‌ నుంచి రాష్ట్ర కేడర్‌కు

ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌కు విరుద్ధంగా

వైసీపీ సర్కారు బదిలీల బంతాట

ఉద్యోగులకేమో మొండిచేయి

తల్లడిల్లుతున్న 2 వేల మంది

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీ వ్యవహారం రచ్చకెక్కుతోంది. తనకు భజన చేసేవారి బదిలీల విషయంలో కరుణ కురిపిస్తున్న సీఎం జగన్‌.. తమ పిల్లలు పొరుగు రాష్ట్రంలో ఉన్నారని, తాము ఇక్కడ మగ్గుతున్నామని.. తమను కూడా బదిలీ చేయాలని వేడుకుంటున్న వేతన జీవుల వేదనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 2,000 మందికి సంబంధించి వారి భార్య లేదా భర్త, పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. నిబంధనల ప్రకారం తమను తెలంగాణకు పంపమని దరఖాస్తులు పెట్టుకున్నారు. అంతేకాదు సీఎస్‌ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినప్పటికీ జగన్‌ ప్రభుత్వం వారిని కనికరించడం లేదు.

చరిత్రలో మొదటిసారి

6 ధారా శ్రీను.. 2014లో యూపీఎస్సీ స్పెషలైజ్డ్‌ నోటిఫికేషన్‌ ద్వారా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌గా కేంద్ర కార్మిక శాఖలో చేరారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019, జూన్‌ 12న డిప్యూటేషన్‌పై అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దగ్గర ఓఎస్డీగా చేరారు. ప్రస్తుతం మంత్రి జోగి రమేశ్‌ దగ్గర ఓఎస్డీగా చేస్తున్నారు. కన్నబాబు దగ్గర ఓఎస్డీగా ఉన్నప్పుడే, తనను సెంట్రల్‌ సర్వీస్‌ నుంచి స్టేట్‌ సర్వీ్‌సలోకి మార్చమని, ఇకపై అక్కడే కొనసాగుతానని కోరారు. ఈ మేరకు అనుమతి కోరుతూ అప్పటి సీఎస్‌ సమీర్‌శర్మకు ప్రతిపాదన పంపారు. దీనిపై సమీర్‌ శర్మ సీరియస్‌ అయ్యారు. సెంట్రల్‌ సర్వీస్‌ నుంచి స్టేట్‌ సర్వీ్‌సలోకి తీసుకునేందుకు నిబంధనలు లేవన్నారు. ఒకవేళ దీన్ని ఆమోదిస్తే చరిత్రలో ఇలా జరిగిన మొదటి కేసు ఇదే అవుతుందని కూడా పేర్కొన్నారు. సదరు ప్రతిపాదనను తిరస్కరించారు. సమీర్‌ శర్మ రిటైర్‌ అయ్యారు. కన్నబాబు మాజీ అయ్యారు. ఇప్పుడు జోగి రమేశ్‌ ద్వారా సీఎం నుంచి సీఎస్‌ వరకు చక్రం తిప్పి ప్రస్తుత సీఎస్‌ జవహర్‌రెడ్డి హయాంలో ఈ ప్రతిపాదనను ఓకే చేయించుకున్నారు. ఒక సీఎస్‌ తిరస్కరించిన ప్రతిపాదనను యథాతథంగా మరో సీఎస్‌ ఆమోదించడం గమనార్హం. ఇప్పుడు ఆ ప్రతిపాదనను ఆగమేఘాలపై కేబినెట్‌ షార్ట్‌ సర్క్యులేషన్‌కి పంపారు. దీనికి సంబంధించి తాజాగా గురువారం(7వ తేదీ) జీవో విడుదలైంది. ధారా శ్రీను కోసం కార్మిక శాఖలో అదనపు కమిషనర్‌ పోస్టును కొత్తగా క్రియేట్‌ చేశారు.

సజ్జల ఓఎస్డీపై కురిసిన కరుణ

6 ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా పనిచేస్తున్న దశరాథరామిరెడ్డిని తెలంగాణలోని జైళ్ల శాఖ నుంచి ఏపీలోని మున్సిపల్‌ శాఖలో కమిషనర్‌గా(సెలక్షన్‌ గ్రేడ్‌) నియమించారు. దశరథరామిరెడ్డి తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగి. తెలంగాణ జైళ్ల శాఖలో సూపరింటెండెంట్‌గా ఉన్నారు. స్థానికత ఆధారంగా దశరాథరామిరెడ్డిని ఏపీ రీఆర్గరైజేషన్‌ కమిటీ తెలంగాణకు కేటాయించింది. కానీ, జగన్‌కి వీర విధేయుడు, భజనపరుడు కావడంతో నిబంధనలను తుంగలో తొక్కి సజ్జలకు ఓఎస్డీగా నియమించారు. గత ఏడాది నవంబరు 23న జీవో 146 ద్వారా మునిసిపల్‌ కమిషనర్‌(సెలక్షన్‌ గ్రేడ్‌)గా నియమించారు.

6 తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల సీఎ్‌సల ఆధ్వర్యంలో కమిటీలు వేసి ఉద్యోగుల బదిలీ విషయంలో నిబంధనలు ఖరారు చేశారు. దీంతో సుమారు 2,000 మందికి పైగా ఉద్యోగులు ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లడానికి దరఖాస్తులు పెట్టుకున్నారు. గతేడాది సీఎస్‌ సమీర్‌ శర్మ వీరందరినీ తెలంగాణకు పంపడానికి నిరభ్యంతర పత్రం కూడా ఇచ్చారు. కానీ, అది జరగలేదు. దీంతో, ఉద్యోగులంతా గంపగుత్తగా కాకుండా విడివిడిగా వారి కుటుంబసమస్యలు చెప్పుకొంటూ సీఎ్‌సకి దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారసులు కూడా తెచ్చుకున్నారు. కానీ, 7 నెలల నుంచి ఈ దరఖాస్తులన్నీ సీఎస్‌ వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రి సీఎస్‌ జవహర్‌ రెడ్డిని ఉద్యోగుల తరఫున ఈ విషయం అడగ్గా, విడివిడి దరఖాస్తులు కూడా ఆమోదించబోనని చెప్పినట్టు తెలిసింది. కానీ, దశరథరామిరెడ్డికి మాత్రం ఈయనే పోస్టింగ్‌ ఇవ్వడం విశేషం. 2,000 మంది ఉద్యోగుల దరఖాస్తులు మాత్రం 7 నెలల నుంచి సీఎస్‌ వద్ద పడున్నాయి. పైగా తదుపరి కన్‌ఫర్డ్‌ ఐఏఎ్‌సల జాబితాలో తన పేరు ఉంటుందని దశరథరామిరెడ్డి ప్రచారం చేసుకోవడం గమనార్హం.

నీరజా రెడ్డికి రెడ్‌ కార్పెట్‌

తెలంగాణలో ఎంప్లాయిమెంట్‌ జేడీగా నీరజారెడ్డి, ఏపీలోని ప్రోటోకాల్‌ శాఖ డిప్యూటీ సెక్రటరీ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి సతీమణి. ఆమెను ఏపీకి తీసుకురావడానికి రెడ్‌కార్పెట్‌ పరిచారు. ఏపీ ఎంప్లాయ్‌మెంట్‌ శాఖలో కొత్త జేడీ పోస్టు సృష్టించి మరీ ఆమెను ఆహ్వానించారు. బాలసుబ్రహ్మణ్యం రెడ్డి జగన్‌ మనిషి అనే విషయం తెలిసిందే.

గజ్జల పవన్‌కుమార్‌ రెడ్డి ఒక జిల్లా స్థాయి ఉద్యోగి. డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి. ఈయనను నేరుగా రాష్ట్ర సచివాలయంలోని రెవెన్యూ శాఖలో ఎస్‌వోగా నియమించారు. జిల్లా కేడర్‌ ఉద్యోగిని, రాష్ట్ర కేడర్‌లోకి తీకసుకోవడం ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌కి విరుద్ధం. అయితే, ఈయన సీఎంవో అధికారి ధనుంజయ్‌ రెడ్డికి బంధువు కావడం.. పెద్దల కనికరానికి కలిసి వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ఒక శాఖ నుంచి ఇంకో శాఖకు కన్వర్షన్స్‌ జరిగాయి. ఉదాహరణకు, హెల్త్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఉద్యోగిని మునిసిపల్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా తీసుకురావడం, జైళ్ల శాఖలో పనిచేసే ఉద్యోగిని మరో శాఖలోకి తరలించడం వంటివి చకచకా జరిగిపోయాయి. అయితే.. వీరంతా వైసీకి వీర విఽధేయులుగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం.

Updated Date - Mar 09 , 2024 | 06:56 AM