Share News

Ambedkar Statue: విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. ట్రాఫిక్ ఆంక్షలివే!

ABN , Publish Date - Jan 18 , 2024 | 07:34 PM

రేపు (19/01/24) విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్‌ని మళ్లించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా ఈ ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయి. కాబట్టి.. ఈ ట్రాఫిక్ మళ్లింపులను గుర్తించాలని విజయవాడ సీపీ కాంతిరాణా టాటా ప్రజలను సూచించారు.

Ambedkar Statue: విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. ట్రాఫిక్ ఆంక్షలివే!

రేపు (19/01/24) విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్‌ని మళ్లించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా ఈ ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయి. కాబట్టి.. ఈ ట్రాఫిక్ మళ్లింపులను ప్రజలు గుర్తించాలని విజయవాడ సీపీ కాంతిరాణా టాటా సూచించారు. విజయవాడ సిటీలో మాత్రం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 12 వరకు ట్రాఫిక్ మళ్లింపులుంటాయని పేర్కొన్నారు. ఈ ఈవెంట్‌కు మొత్తం 2500 బస్సుల్లో ప్రజలు తరలివస్తారని చెప్పారు.


హైదరాబాద్-విశాఖ, విశాఖ-హైదరాబాద్ వైపు వాహనాలన్నీ ఇబ్రహీంపట్నం దగ్గర మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా దారి మళ్లించినట్టు సీపీ కాంతిరాణా పేర్కొన్నారు. అలాగే.. చెన్నై నుంచి వైజాగ్ వెళ్లే వాహనాలను చీరాల, బాపట్ల‌ మీదగానూ.. వైజాగ్ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ దగ్గర దారి మళ్లించామన్నారు. చెన్నై నుంచి హైదరాబాద్, హైదరాబాద్- చెన్నై వెళ్లే వాహనాలను మేదరమెట్ట, అద్దంకి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ మీదగా మళ్లించడం జరిగిందని సీపీ తెలిపారు. చెన్నై, వైజాగ్ నుంచి వచ్చే భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి లేదని.. నేషనల్ హైవే మీదుగా వచ్చే వాహనాలను వివిధ రహదారుల గుండా దారి మళ్లిస్తున్నామని వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను కేటాయించామన్నారు. 21 ఎల్ఈడీ స్క్రిన్స్‌ని నగరంలో ఏర్పాటు చేశామన్నారు.

ఇక కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ.. సాయంత్రం 4:30కి అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. ముందుగా సీఎం జగన్‌ బహిరంగ సభ జరుగుతుందని, అనంతరం సీఎం చేతుల మీదుగా ఆరు గంటలకి అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుందని చెప్పుకొచ్చారు. విజయవాడ సెంటర్‌లో 8 ఎకరాల విస్తీర్ణంలో రూ.405 కోట్ల వ్యయంతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు జరిగిందన్నారు. సందర్శకులకు శుక్రవారం అనుమతి ఉండదని.. శనివారం అనుమతి ఉంటుందని తెలియజేశారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు.

Updated Date - Jan 18 , 2024 | 08:28 PM