ట్రాఫిక్ ‘చక్ర’ వ్యూహం
ABN , Publish Date - Dec 27 , 2024 | 01:11 AM
విజయవాడ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వెళ్తున్న బస్సులు ఆగేది అక్కడే. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర నుంచి పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌కు వచ్చే బస్సులు మలుపు తిరిగేది ఇక్కడే. జాతీయ రహదారికి ఇవతలి వైపు నుంచి అవతలి వైపునకు తిరిగే మలుపూ ఇదే. ఒకే వైపునకు మూడు విభిన్న పరిస్థితులు ఉన్న ప్రదేశమది. అదే వారధికి దిగువన ఉన్న ధర్మచక్రం కూడలి. విజయవాడలో ఇబ్రహీంపట్నం తర్వాత అతిపెద్ద కూడలి ఇదే. ఇక్కడంతా గందరగోళమే. వచ్చేపోయే బస్సులను ఎక్కడ ఆపాలన్న దానిపై ఒక స్పష్టత లేకపోవడం, సరిగ్గా మలుపుల వద్దే బస్‌స్టాప్‌ను ఏర్పాటు చేయడం, మలుపుల వరకు ఐలాండ్‌లు ఉండడంతో ఇక్కడ పరిస్థితి అంతా తికమకగా, ప్రమాదకరంగా ఉంటుంది. దీనికి పరిష్కారం చూపించడానికి కొత్త ప్రతిపాదనలను ట్రాఫిక్ పోలీసులు సిద్ధం చేస్తున్నారు.

వారధి ‘ధర్మచక్రం’ వద్ద మూడు మలుపులు
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు
గుంటూరు వైపు బస్టాండ్ మార్పుపై సమాలోచనలు
బందరు కాల్వ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో బస్‌బే ఏర్పాటు
ఇరిగేషన్, ఆర్టీసీ, వీఎంసీ సమన్వయమే ముఖ్యఘట్టం
ప్రణాళిక పట్టాలెక్కితే ‘చక్రం’ ట్రాఫిక్‌కు చెక్
విజయవాడ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వెళ్తున్న బస్సులు ఆగేది అక్కడే. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర నుంచి పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌కు వచ్చే బస్సులు మలుపు తిరిగేది ఇక్కడే. జాతీయ రహదారికి ఇవతలి వైపు నుంచి అవతలి వైపునకు తిరిగే మలుపూ ఇదే. ఒకే వైపునకు మూడు విభిన్న పరిస్థితులు ఉన్న ప్రదేశమది. అదే వారధికి దిగువన ఉన్న ధర్మచక్రం కూడలి. విజయవాడలో ఇబ్రహీంపట్నం తర్వాత అతిపెద్ద కూడలి ఇదే. ఇక్కడంతా గందరగోళమే. వచ్చేపోయే బస్సులను ఎక్కడ ఆపాలన్న దానిపై ఒక స్పష్టత లేకపోవడం, సరిగ్గా మలుపుల వద్దే బస్‌స్టాప్‌ను ఏర్పాటు చేయడం, మలుపుల వరకు ఐలాండ్‌లు ఉండడంతో ఇక్కడ పరిస్థితి అంతా తికమకగా, ప్రమాదకరంగా ఉంటుంది. దీనికి పరిష్కారం చూపించడానికి కొత్త ప్రతిపాదనలను ట్రాఫిక్ పోలీసులు సిద్ధం చేస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వెళ్లే బస్సులు కృష్ణలంక ఆర్వోబీపై నుంచి వచ్చి వారధికి దిగువ ఉన్న ఐలాండ్ కూడలి వద్ద మలుపు తీసుకుని గుంటూరు వైపు రహదారిపైకి ప్రవేశిస్తాయి. ఆర్టీసీ అధికారులు సరిగ్గా ఈ ప్రదేశంలోనే బస్టాప్‌ను ఏర్పాటు చేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వెళ్లాల్సి ప్రయాణికులు ఇక్కడ వేచి ఉంటున్నారు. మొత్తం ఇక్కడ మూడు మలుపులు ఉన్నాయి. రాణిగారితోట వైపు నుంచి పశువుల ఆస్పత్రి వీధిలోకి వెళ్లాల్సిన వాహనదారులు వారధి కింద మొదటి మలుపులోకి తిరగాల్సి ఉంటుంది. రెండో మలుపు నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాల వైపు వెళ్లే బస్సులు వస్తాయి. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి పీఎన్‌బీఎస్‌కు వచ్చే బస్సులు మూడో మలుపు నుంచి వెళ్తాయి. పీఎన్‌బీఎస్ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాకు వెళ్లే బస్సులను ఇక్కడ ఉన్న స్టాప్ వద్ద ఆపుతున్నారు. ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు, ఆటోలే కాకుండా కొన్ని లారీలు, ఇతర కంటైనర్లు రావడంతో మొత్తం రహదారి స్తంభించిపోతోంది. ఫలితంగా మొదటి మలుపు నుంచి పశువుల ఆస్పత్రి రోడ్డులోకి వెళ్లాల్సిన వాహనదారులు రూటు తప్పుతున్నారు. వారధికి అందాలను అద్దడానికి ఇక్కడ విశాల ప్రదేశంలో భారీ ఐలాండ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ మూడు మలుపులను వేరు చేసేలా ఐలాండ్ నిర్మించారు. దీనివల్ల ఈ కూడలిలో ఉన్న రహదారులు ఇరుకుగా మారాయి. ఏకకాలంలో రెండు బస్సులు పక్కపక్కన వెళ్లాలంటే ఇబ్బందిగా మారింది.
ఇలా చేస్తే మేలు..
జాతీయ రహదారి వెంబడి నగరం మధ్య నుంచి బందరు కాల్వ ప్రవహిస్తోంది. దీనికి పక్కనే ఖాళీ స్థలం ఉంది. ఈ ప్రదేశాన్ని జనం డంపింగ్ యార్డుగా మార్చకుండా చేసేందుకు జాతీయ రహదారి పొడవున వీఎంసీ ప్రహరీని నిర్మించింది. ఐలాండ్ ఎదురుగా ఈ ప్రహరీ చెంతన ఆటోస్టాండ్ నడుస్తోంది. ఇక్కడ విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు, మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ వైపు వెళ్లాల్సిన బస్సులు ఆగుతున్నాయి. బందరు కాల్వ వెంబడి ఉన్న ఖాళీ ప్రదేశాల్లో ఆక్రమణలు పెరుగుతున్నాయి. కొన్ని ప్రదేశాల్లో వీఎంసీ కర్మల భవనాలను నిర్మించింది. ఇవి కాకుండా ప్రార్థనా మందిరాలు, ఆలయాలు ఒక్కో ప్రదేశంలో వెలిశాయి. నగరం నుంచి ప్రవహించే కాల్వల్లో జలవనరుల శాఖ పూడికతీత చేసిన దాఖలు ఇప్పటి వరకు కనిపించలేదు. కొన్ని ప్రదేశాల్లో మాత్రం వీఎంసీ సుందరీకరణ కోసం పార్కులు అభివృద్ధి చేసింది. పచ్చదనం కోసం మొక్కలు పెంచుతోంది. ధర్మచక్రం ఎదురుగా ప్రహరీకి వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలంలో భారీ బస్‌బేను నిర్మిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ట్రాఫిక్ అధికారులకు వచ్చింది. ఈ స్థలం జలవనరుల శాఖ పరిధిలో ఉంది. బాధ్యతలను వీఎంసీ చూస్తోంది. బస్‌బే నిర్మించాల్సిన బాధ్యత ఆర్టీసీది. ట్రాఫిక్ అధికారుల ప్రణాళికలు పట్టాలు ఎక్కాలంటే ఆర్టీసీ, జలవనరుల శాఖ, వీఎంసీ, పోలీసుల శాఖ మధ్య సమన్వయం ఉండాలి.
ప్రతిపాదనలు ఇలా...
- ధర్మచక్రం ఎదురుగా గల ఖాళీ స్థలంలో భారీ బస్‌బేను నిర్మించవచ్చు.
- విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వెళ్లే బస్సులను ఈ బస్‌బేలో ఆపొచ్చు.
- ప్రస్తుతం ఐల్యాండ్‌కి వెనుక వైపున గుంటూరు మార్గంలో ఉన్న బస్టాప్‌ను ఇక్కడికి మార్చుకోవచ్చు.
- ఈ నిర్ణయం వల్ల ఐల్యాండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గుతుంది.
- విశాఖపట్నం, గుడివాడ, మచిలీపట్నం, అవనిగడ్డ, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వెళ్లాల్సిన బస్సులు నేరుగా బస్‌బేలోకి వస్తాయి. ఈ బస్సులను ప్రస్తుతం జాతీయ రహదారిపై ఆపుతున్నారు. ఈ బస్సులను బస్‌బేల్లోకి పంపడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బంది ఉండదు.
- గుంటూరు మార్గంలో ఉన్న బస్టాప్ వద్ద రద్దీ చాలా వరకు తగ్గుముఖం పడుతుంది.