Share News

Kadambari Jethwani: కాదంబరి జెత్వానీ- వైసీపీ నేత వ్యవహారంలో అసలేం జరిగిందో పూసగుచ్చినట్టుగా..

ABN , Publish Date - Aug 29 , 2024 | 04:47 AM

చంద్రబాబునే అరెస్టు చేశాం! ఇక మీరెంత! మాతో పెట్టుకుంటే అంతే!’... ముంబై నటిని ‘వైసీపీ’ పోలీసులు బెదిరించిన తీరిది! ఆమె పేరు.

Kadambari Jethwani: కాదంబరి జెత్వానీ- వైసీపీ నేత వ్యవహారంలో అసలేం జరిగిందో పూసగుచ్చినట్టుగా..

ముంబై నటి కాదంబరి, ఆమె తల్లి ఆశా ఆవేదన కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏపీ అధికారులు కన్నీటి పర్యంతమవుతూ వివరాల వెల్లడి.. తొలిసారి బయటికి వచ్చిన నటి‘‘కొందరు పోలీసు అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి నన్ను, నా కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు. వాళ్ల వేధింపుల నుంచి నేను ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాను. సరిగా నిద్ర కూడా పట్టని పరిస్థితి. ఓ క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న వ్యక్తి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా నన్ను, నా కుటుంబాన్ని దారుణంగా వేధించారు’’

- కాదంబరి జెత్వానీ, నటి, వైద్యురాలు

  • చిత్రహింసలు పెట్టారు

  • మూడు రోజులు వీటీపీఎస్‌ గెస్ట్‌హౌస్‌లో నిర్బంధం

  • అత్యంత కర్కశంగా వ్యవహరించారు

  • బాబునే అరెస్టు చేశాం.. మీరెంత అని బెదిరించారు

  • నెలసరిలో న్యాప్‌కిన్స్‌ కూడా అనుమతించలేదు

  • బెజవాడలో వేధింపులు జీవితాంతం మర్చిపోలేం

  • తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారు: ఆశా

  • కుక్కల విద్యాసాగర్‌ అసభ్య చిత్రాలతో వేధించారు

  • వృద్ధులైన తల్లిదండ్రులనూ అన్యాయంగా తీసుకొచ్చారు

  • కనీసం ఫోన్‌ కాల్‌ కూడా చేసుకోనివ్వలేదు: కాదంబరి

(విజయవాడ/అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘చంద్రబాబునే అరెస్టు చేశాం! ఇక మీరెంత! మాతో పెట్టుకుంటే అంతే!’... ముంబై నటిని ‘వైసీపీ’ పోలీసులు బెదిరించిన తీరిది! ఆమె పేరు... కాదంబరి జెత్వానీ! నటి మాత్రమే కాదు... వైద్యురాలు కూడా! వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ పెట్టిన తప్పుడు కేసులో ఆమెను, ఆమె తల్లిదండ్రులనూ అరెస్టు చేసి నరకం చూపించారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన వరుస కథనాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. దీంతో... పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ‘అప్పుడు ఏం జరిగింది? ఇందులో కుక్కల విద్యాసాగర్‌ పాత్ర ఏమిటి? ఎవరి ఆదేశాల మేరకు అప్పటి పోలీసు కమిషనర్‌ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్‌ గున్నీ అత్యుత్సాహం ప్రదర్శించారు?’ వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో నేరుగా ముంబై నటి కాదంబరితోపాటు ఆమె కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం...

అంతర్జాతీయ స్మగ్లర్లు, ఉగ్రవాదుల తరహాలో తమను ఏపీ పోలీసులు అరెస్టు చేసి విమానంలో తీసుకొచ్చారని జెత్వానీ కుటుంబ సభ్యులు వాపోయారు. విశాల్‌ గున్నీ నేతృత్వంలో జెత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన విజయవాడకు తీసుకొచ్చారు. మూడు రోజులపాటు వారిని ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్‌ గెస్ట్‌హౌ్‌సలో ఉంచారు. తీవ్రంగా హింసించారు. ఫిబ్రవరి 6వ తేదీన కాదంబరిని రిమాండుకు పంపించారు. ‘‘ఏపీలో ఎంత పెద్దవారైనా వైసీపీ నేతలతో పెట్టుకుంటే జైలుకు వెళ్లాల్సిందే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి చూశారా’’ అని ఆమె తల్లి ఆశా జెత్వానీని హెచ్చరించారు. రాజీపడాలని, భవిష్యత్తులో ఇటువైపు రావొద్దని, అలాగైతేనే జైలు నుంచి కాదంబరి బయటికి వస్తుందని ఆమె కుటుంబ సభ్యుల్ని బెదిరించారు. రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆమెను చూసేందుకు ములాఖత్‌లు ఇవ్వకుండా జైలు అధికారులపై విజయవాడ పోలీసులు ఒత్తిడి చేశారు. తన కుమార్తెకు నెలసరి వచ్చినప్పుడు శానిటరీ న్యాప్‌కిన్స్‌ పంపేందుకూ అంగీకరించలేదని ఆశా జెత్వానీ కన్నీటి పర్యంతమయ్యారు. సాటి మనుషులపట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారని అనుకోలేదని రోదించారు. ఇక్కడ ఏకంగా ప్రభుత్వ పెద్దలు, ఐపీఎస్‌ అధికారులు బెదిరిస్తుండటంతో తమ సన్నిహితులెవరూ సహాయం చేసేందుకు ముందుకు రాలేదన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఎలా బయటికి వచ్చిందో తమకు తెలియదని, తనను హింసించిన వైసీపీ నాయకుడు విద్యాసాగర్‌తోపాటు పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆశా జెత్వానీ విన్నవించుకొంటున్నారు. త్వరలో నేరుగా విజయవాడకు వచ్చి హోంశాఖ మంత్రితోపాటు డీజీపీని కూడా కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని జెత్వానీ కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు తెలిసింది.

మనశ్శాంతి కరువై...

కాదంబరి బుధవారం ఓ చానల్‌లో మాట్లాడారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో తనకు 2015లో పరిచయం ఏర్పడిందని, అదే ఏడాది అతను తనకు పెళ్లి ప్రతిపాదన చేశాడని ఆమె తెలిపారు. కానీ... ఆయన నేపథ్యం తెలిసి తాను ఆ ప్రతిపాదన తిరస్కరించానని జెత్వానీ తెలిపారు. ‘‘విద్యాసాగర్‌కు పెళ్లయిన 14 నెలలకే భార్య వదిలేసి వెళ్లి పోయారు. ఆయనకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని గుర్తించి అతన్ని దూరం పెట్టాను. అప్పటి నుంచి నగ్న వీడియో కాల్స్‌తో, అసభ్యకర సందేశాలతో నన్ను వేధించసాగాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌లో విద్యాసాగర్‌ నాపై దొంగ కేసు పెట్టాడు’’ అని వాపోయారు. ఆంధ్రాలో కేవలం ట్రైలర్‌ మాత్రమే చూపించారని, మిగిలిన రాష్ట్రాల్లోనూ దొంగ కేసులు పెట్టి వేధిస్తామని తనను బెదిరించారని తెలిపారు. ముంబైలో కేసు (సజ్జన్‌ జిందాల్‌పై పెట్టిన కేసు) విత్‌డ్రా చేసుకుంటే ఇక్కడ తనపై కేసు తీసివేస్తామని చెప్పారని... కానీ ఇప్పటికీ కేసు విత్‌ డ్రా చేసుకోలేదని జెత్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా యూఏఈలో వ్యాపారం చేసుకుంటున్న తన సోదరుడిపై కూడా కేసు నమోదు చేశారని తెలిపారు.

ఫోర్జరీ డాక్యుమెంట్‌పై...

వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ 2024 ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేశారు. అది కూడా ఓ ఫోర్జరీ డాక్యుమెంట్‌ను చూపించి ఈ కేసు పెట్టారు. జెత్వాని ముంబైలో ఇప్పుడు నివాసం ఉంటున్న ఫ్లాట్‌ను 2020లో కొనుగోలు చేశారు. అయితే 2018లో కొనుగోలుకు సంబంధించిన అగ్రిమెంట్‌ జరిగింది. అగ్రిమెంట్‌ మాత్రమే జరిగిన ఫ్లాట్‌లో ఆమె ఉంటున్నట్టు చూపడం గమనార్హం. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్‌ను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేయడం, ఆ మరుసటి రోజే అంటే, ఫిబ్రవరి 3న ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నీ ఆధ్వర్యంలో ఏసీపీలు రమణమూర్తి, హనుమంతరావు, సీఐ ముత్యాల సత్యనారాయణ, ఎస్సై షరీఫ్‌ ముంబై వెళ్లి కాదంబరిని, ఆమె కుటుంబ సభ్యులను విజయవాడకు తీసుకొచ్చారు. మూడు రోజులు ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్‌ అతిథిగృహంలో పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. కాదంబరిపై భౌతికంగా దాడులు చేశారు. ఫిబ్రవరి 6న ఆమెను, ఆమె తల్లిదండ్రులను రిమాండుకు పంపించారు.

ఫోర్జరీ డాక్యుమెంట్‌ ఆధారంగా పెట్టిన దొంగ కేసులో కాదంబరి కుటుంబంపై 10ఏళ్ల శిక్ష పడే సెక్షన్లు నమోదు చేయడం గమనార్హం. సుమారు 40 రోజులపాటు వారు జైలులోనే ఉండే పరిస్థితి కల్పించారు. వారికి సంబంధించిన 18 బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేశారు. అందులో 80 లక్షల రూపాయలు ఉన్నాయి. కాదంబరి తండ్రి మర్చంట్‌ నేవీలో పనిచేయగా, ఆమె తల్లి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పనిచేశారు. ఈ కేసులో పోలీసులు ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో తెలియాలంటే అప్పటి సీపీ కాంతి రాణాతోపాటు ఈ కేసులో పాల్గొన్న అప్పటి సీఐ ముత్యాల సత్యనారాయణ తదితరుల ఫోన్‌ కాల్స్‌ డేటా, వాట్సాప్‌ చాట్‌ను పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆమె తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

కుక్కల విద్యాసాగర్‌ ఎక్కడ?

జెత్వాని కేసు సంచలనంగా మారినా ఈ కేసులో సూత్రధారి, ఫిర్యాదుదారు అయిన కుక్కల విద్యాసాగర్‌ ఎక్కడున్నారో తెలియడంలేదు. విద్యాసాగర్‌కు, సజ్జన్‌ జిందాల్‌కు పరిచయం ఏమిటి? జిందాల్‌ను రక్షించేందుకే విద్యాసాగర్‌ ఈ దొంగ కేసు పెట్టారా? అప్పటి వైసీపీ పెద్దల ప్రమేయం ఎంత వరకు ఉంది? తదితర ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. ముంబై నటి కాదంబరి జెత్వానీ అంశంపై పోలీసు ఉన్నతాధికారులు అంతర్గత విచారణ ప్రారంభించారు. విజయవాడ పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబు ప్రస్తుతం ఉన్న ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్‌ను కేసు గురించి ఆరా తీశారు. ఈ కేసు సీడీ (కేస్‌ డైరీ) ఫైల్‌ను సీపీ పరిశీలించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ బుధవారం విజయవాడ పోలీసు కమిషనరేట్‌కు వచ్చారు. సీపీతో సుమారుగా అరగంటపాటు భేటీ అయ్యారు. ముంబై నటి కేసుపై ఇద్దరూ చర్చించారని తెలుస్తోంది. ఈ కేసు వెనుక అప్పటి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, పోలీసు అధికారుల పాత్ర ఉందని బలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ విషయం సంచలనం సృష్టించడంతో ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్‌ విభాగం నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నివేదికతోపాటు ముంబై నటి నేరుగా వచ్చి ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కాంతి రాణా, విశాల్‌ గున్నీ, ఇతర పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది.

‘‘మేం నిస్సహాయులుగా మిగిలిపోయాం. కనీసం ప్రాణాలతోనైనా ఉండాలనే ఉద్దేశంతో విజయవాడ పోలీసులు అడిగినట్లుగా తెల్లకాగితాలపై సంతకాలు పెట్టాం. దీంతో వాళ్లే మార్చి 15న మాకు బెయిలు ఇప్పించారు. ఈ విషయాల గురించి ఎవ్వరితోనూ మాట్లాడకూడదని హెచ్చరించారు. మీడియాతో మాట్లాడినా, భవిష్యత్తులో కోర్టుకు వెళ్లినా... జీవితాంతం జైల్లోనే మగ్గేలా చేస్తామని మేం సంతకాలు చేసిన తెల్లకాగితాలు చూపిస్తూ హెచ్చరించారు’’ -ఆశా జెత్వానీ (కాదంబరి తల్లి)

Updated Date - Aug 29 , 2024 | 11:00 AM