tomoto market మార్కెట్లో.. మాఫియా హీట్
ABN , Publish Date - Aug 21 , 2024 | 12:21 AM
కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో మంగళవారం వేలం నిలిచిపోయింది. వ్యాపారులు వేలాన్ని బహిష్కరించారు. మార్కెట్‌లోని కొన్ని మాఫియా శక్తుల బెదిరింపులు, బరితెగింపులు దీనికి కారణమని బాధితులు మండిపడుతున్నారు.
కొనసాగిన బెదిరింపులు.. వసూళ్లు
వేలాన్ని బహిష్కరించిన బయ్యర్లు
దిక్కుతోచక రోడ్డెక్కిన టమోటా రైతులు
భయపడి పారిపోయిన ఐదారుగురు వ్యాపారులు
అనంతపురం రూరల్, ఆగస్టు 20: కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో మంగళవారం వేలం నిలిచిపోయింది. వ్యాపారులు వేలాన్ని బహిష్కరించారు. మార్కెట్‌లోని కొన్ని మాఫియా శక్తుల బెదిరింపులు, బరితెగింపులు దీనికి కారణమని బాధితులు మండిపడుతున్నారు. ది అనంతపురం హెవీ గూడ్స్ లారీ అసోసియేషన, మండి అసోసియేషన్లు అనుసరిస్తున్న వైఖరితో తాము నష్టపోతున్నామని వ్యాపారులు, రైతులు వాపోతున్నారు. ఇతర ప్రాంతాల వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లు, బయ్యర్లకు బెదిరింపులతో మార్కెట్‌లో భయానక వాతావరనం నెలకొంది. రక్షణగా ఉంటారనుకున్న పోలీసుల పేరిటా బెదిరింపులు రావడంతో కొందరు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. వేలంపాటలు నిలిచిపోవడంతో మార్కెట్‌కు వచ్చిన రైతులు ఒక్కసారిగా బెంగుళూరు-హైదరాబాదు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం బైఠాయించారు. అన్నదాతల ధర్నాతో హైవే దద్దరిల్లింది. వాహనాల రాకపోకలు గంటకుపైగా నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ వారు వినుకోలేదు. రేయింబవళ్లు శ్రమించిన పండించిన పంటను కొనుగోలు చేయకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని, టమోటా దిగుబడులను దిబ్బల్లో పారేయాల్సి వస్తుందని వాపోయారు. అసోసియేషన్ల అక్రమాలకు తాము బలిపశువులు అవుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ‘వ్యాపారుల నుంచి అసోసియేషన్లవారు రూ.వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ఈ కారణంగా వారు మా సరుకును తక్కువ ధరకు కొంటున్నారు. పంట పండించేందుకు మేము ఎంత కష్టపడుతున్నామో తెలుసా..? నిమిషాల వ్యవధిలో మా కష్టాన్ని దోచుకుంటున్నారు. కలెక్టర్‌ను రమ్మనండి. ఆయనతోనే మాట్లాడుతాం. జిల్లా కేంద్రంలోనే ఇంత బరితెగింపా..? అసోసియేషనలకు డబ్బులెందుకు కట్టాలి..? ఏ హక్కుతో వారు డబ్బులు వసూలు చేస్తున్నారు..?’ అని రైతులు మండిపడ్డారు. ‘డబ్బులు వసూలు చేసుకుని ఎవడెవడో బాగుపడుతున్నాడు. మేం సర్వనాశనం అయిపోతున్నాం..’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగు గోడల మధ్య చర్చలు
పోలీసు అధికారులు రైతులకు నచ్చజెప్పి చర్చల పేరిట మార్కెట్ వద్దకు తీసుకెళ్లారు. ఓ మండీ గదిలోక హెవీ గూడ్స్ లారీ అసోసియేషన, మండీ అసోసియేషన, రైతులు, నలుగురైదుగురు బయ్యర్లు డీఎస్పీ టీవీవీ ప్రతాప్ సమక్షంలో చర్చలు జరిపారు. కానీ సఫలం కాలేదు. డబ్బులు వసూలు చేయవద్దని లారీ అసోసియేషన సభ్యులకు డీఎస్పీ గట్టిగా సూచించారని సమాచారం. ఇంతలో టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. మొదట టమోటాల వేలం పూర్తి చేయాలని, సమస్యలపై తరువాత చర్చించుకుందామని అన్నారు. దీంతో అక్కడి నుంచి అందరూ వెళ్లిపోయారు.
ముగ్గురి రాజ్యం
టమోటా మార్కెట్ తమ కనుసన్నల్లో నడవాలని మండీ అసోసియేషనకు చెం దిన ముగ్గురు వ్యక్తులు కథ నడిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ముగ్గురే బయ్యర్లను తీవ్రంగా భయపెట్టినట్లు సమాచారం. జాతీయ రహదారిపై సోమవారం ఆందోళనకు దిగిన బయ్యర్లు మంగళవారం ఆ ప్రాంతంలో కనిపించకపోవడం గమనార్హం. వారికి ఫోన చేసి ‘నరుకుతాం..’ అని తీవ్రంగా బెదిరించారని ప్రచారం జరుగుతోంది. దీంతో రాత్రికి రాత్రే ఐదారుగురు బయ్యర్లు మార్కెట్ వదిలి వెళ్లినట్లు సమాచారం. మార్కెట్‌లో బయ్యర్లకు కనీస మర్యాద దక్కడం లేదు. ‘ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. బెదిరిస్తున్నారు..’ అని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ‘వసూళ్లు శ్రుతిమించాయి. వేలకు వేలు ఎక్కడి నుం చి తెచ్చివ్వాలి..? అయినా కిమ్మనకుండా ఇస్తున్నాం. డబ్బులు తీసుకుని బెదిరిస్తున్నారు. మా సమస్యను ఎవరికి చెప్పుకోవాలి..?’ అని కంటతడి పెట్టుకున్నారు.
112 టన్నుల టమోటా నోసేల్
మార్కెట్‌లో ఆందోళనల కారణంగా 112 టన్నుల టమోటా నోసేల్ కింద పడిపోయాయి. మార్కెట్ ఉదయం 6:30గంటలకు ప్రారంభం కావాల్సిన టమోటా వేలం 10:30గంటలకు ప్రారంభమైంది. అప్పటికే నాలుగు గంటల సమయం గడిచిపోయింది. ఈ క్రమంలో బయ్యర్లు ఆక్షనను బహిష్కరించడంతో వేలం ఆలస్యమైంది. అసలే వర్షాలకు కాయలు దెబ్బతింటున్నాయి. దీంతో సాధారణ ధరకంటే తక్కువ ధరకు కాయలు అమ్ముడుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌కు 3,750 టన్నుల కాయాలు రాగా.. ఇందులో 112 టన్నులు నోసేల్ కింద పడిపోయాయి. అంటే 1.12 లక్షల కిలోల టమోటా వేలంలో అమ్ముడుపోలేదన్నమాట. కిలో రూ.5 చొప్పున అమ్ముడుపోయినా.. రైతులకు కొంతలో కొంతైనా ఊరటగా ఉండేదీ. నో సేల్ కారణంగా రైతులకు పైసా కూడా దక్కకుండా పోయింది.
వసూళ్లపై కలెక్టర్ ఆరా
టమోటా మార్కెట్‌లో లారీ అసోసియేషన, మండీ అసోయేషనల అక్రమ వసూళ్లపై కలెక్టర్ వినోద్‌కుమార్ ఆరా తీసినట్లు తెలిసింది. ఎవరు డబ్బులు వసూలు చేస్తున్నారు, ఎందుకు వసూలు చేస్తున్నారని ఆయన అధికారులను అడిగినట్లు తెలిసింది. వసూళ్ల వెనుక ఎవరున్నారు..? బెదిరిస్తున్నది ఎవరు అని ఆరా తీసినట్లు సమాచారం. కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు జోక్యం చేసుకుంటే మార్కెట్‌లో సమస్యలు పరిష్కారమౌతాయని రైతులు అంటున్నారు.
రైతులు ఇబ్బంది పడకూడదు: పరిటాల శ్రీరామ్
మార్కెట్‌లో అసోసియేషన్లకు, బయ్యర్లకు మధ్య సమస్యలు ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో రాజకీయ నాయకులు, ఇక్కడి నాయకుల కారణంగా కొన్ని పద్ధతులు మొదలయ్యాయి. అసోసియేషన్లవారు, బయ్యర్లు లాభాలకోసం పనిచేస్తారు. కానీ రైతులు పరిస్థితి వేరు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పంటలు పండిస్తారు. వ్యయప్రయాసలకోర్చి టమోటాను మార్కెట్‌కు తెస్తారు. వేలం జరగకపోతే తీవ్రంగా నష్టపోతారు. వారికి ఇబ్బంది లేకుండా మొదట వేలం వేయమని చెప్పాము.
వేలకు వేలు ఎక్కడి నుంచి తెస్తాం..?
లారీ అసోసియేషన రూ.2,500 వసూలు చేస్తోం ది. మరో అసోసియేషన రూ.500, ఇంకొకటి రూ.200 గుంజుతోంది. ఇంత సొమ్ము ఎలా కట్టేది..? ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారు. దీంతో కొంత మంది రాత్రి మార్కెట్ నుంచి వెళ్లిపోయారు. వసూళ్లను నిలుపుదల చేస్తే బాగుటుంది.
- రఫీ, టమోటా వ్యాపారి
మేం చావాల్సిందే..
అసోసియేషన్ల అక్రమ వసూళ్లతో మార్కెట్‌లో రెండురోజులుగా రైతులు నానా అవస్థలు పడుతున్నాము. అసోసియేషన్లకు రూ.5వేలు.. రూ.10 వేలు కట్టలేమని బయ్యర్లు అంటున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతామని అంటున్నారు. అయినా అసోసియేషనలు మారడం లేదు. పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. మాకు కడుపు మండి రోడ్డుపైకి వచ్చాం. పరిస్థితి ఇలాగే ఉంటే టమోటా రైతులు చావాల్సిందే.
- తిమ్మప్ప, రైతు, రాంపురం
ఎవరికీ పట్టడం లేదు..
మార్కెట్‌లో రైతు కష్టాలు ఎవరికీ పట్టడం లేదు. నో సేల్ అంటున్నారు. కాయలు అమ్ముడుపోక మేము ఇబ్బంది పడుతుంటే పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయాలంటూ మమ్మల్ని రోడ్డుపై నుంచి లాగేస్తున్నారు. బయ్యర్లు వేలం పాడేది లేదంటున్నారు. మా గోడు ఎవరితో చెప్పుకుంటే తీరుతుంది..?
- పవన, రైతు, కాటిగానికాలవ
మా గతేమిటి..?
కూలీలకు ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చి కాయలు కోసి మార్కెట్‌కు తీసుకొచ్చాను. ఇక్కడ కాయలు కొనకుండా బండ్లోళ్లని మల్లగొడుతున్నారు. ఇట్లయితే మా గతేమిటి..? మార్కెట్‌లో మూడు లక్షల బాక్సులుంటే ఒక్క బాక్సు కొనేవాడు లేడు. బయ్యర్లు కొనుగోలు చేసేందుకు రావడం లేదు. ఈ తిప్పలు ఎవరికీ రాకూడదు.
-ఖలందర్, రైతు, పీఆర్ కొట్టాల, కళ్యాణదుర్గం