నేడే సిరిమానోత్సవం
ABN , Publish Date - Oct 15 , 2024 | 03:38 AM
విజయనగరం పైడితల్లి అమ్మవారి తొలేళ్ల తంతు పూర్తయింది.. అసలు సంబరానికి వేళ అయింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి శ్రీనివాస్
విజయనగరం (ఆంఽధ్రజ్యోతి), అక్టోబరు 14: విజయనగరం పైడితల్లి అమ్మవారి తొలేళ్ల తంతు పూర్తయింది.. అసలు సంబరానికి వేళ అయింది. కొద్ది గంటల్లో అశేష జనవాహిని అత్యంత భక్తిశ్రద్ధలతో తిలకించే సిరిమానోత్సవం ఆరంభం కానుంది. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సిరిమాను బయలుదేరనుంది. ఇందుకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. అమ్మవారి పరివారంగా పిలిచే జాలరి వల, అంజలి రథం, పాలధార రథాలు సిరిమాను వెంట నడుస్తాయి. సాయంత్రం ఆరు గంటల సమయానికి సిరిమానోత్సవాన్ని పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం ఉదయం పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.
భక్తిశ్రద్ధలతో తొలేళ్ల ఉత్సవం
పైడితల్లమ్మ తొలేళ్ల ఉత్సవం సోమవారం భక్తి శ్రద్ధలతో జరిగింది. పూసపాటి వంశీయులు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, సతీమణి సునీలా గజపతిరాజు, కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సభ్యులు కూడా పైడిమాంబకు పట్టువస్త్రాలు సమర్పించి, పల్లకీ సేవలో పాల్గొన్నారు. ఆదివారం రాత్రి 10.35 గంటల సమయంలో అమ్మవారిని తొలేళ్ల ఉత్సవానికి సిద్ధం చేస్తూ వివిధ నదీజలాలతో అభిషేకించారు.
రైతులకు విత్తనాలు పంపిణీ
సిరిమాను అధిరోహించే పూజారి బంటుపల్లి వెంకటరావు అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం విజయనగరం పరిసర ప్రాంత రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ విత్తనాలను తీసుకునేందుకు రైతులు అర్ధరాత్రి వరకూ వేచి ఉన్నారు. రాత్రి 12 గంటల సమయంలో ఈ ప్రక్రియ కొనసాగింది. ఈ తంతుతో తొలేళ్ల ఘట్టం పూర్తయింది.