Share News

AP Budget : నేడే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:44 AM

రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను బుధవారం ఉదయం 11 గంటల 3 నిమిషాలకు చట్టసభల్లో ప్రవేశపెట్టనుంది.

AP Budget : నేడే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

4 నెలలకు రూ.95 వేల కోట్లకుపైనే..

శాసనసభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన

అమరావతి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను బుధవారం ఉదయం 11 గంటల 3 నిమిషాలకు చట్టసభల్లో ప్రవేశపెట్టనుంది. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి రూ.2.86 లక్షల కోట్ల బడ్జెట్‌ను అంచనా వేయగా, ప్రస్తుతం ఓటాన్‌ అకౌంట్‌ కింద 4 నెలలకు రూ.95 వేల కోట్ల నుంచి రూ.96 వేల కోట్ల వరకు బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నారు.

బడ్జెట్‌ ఎలా ఉండాలి.. ఎలా ఉంటోంది?

సాధారణంగా బడ్జెట్‌ అంటే రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది? ఎన్ని అప్పులు తెచ్చుకోవచ్చు? రాష్ట్రం ఖర్చులు ఎంత? అభివృద్ధి పనుల కోసం ఏ శాఖకు ఎంత కేటాయించాలి? ప్రజల కోసం చేయాల్సిన పనులు, వాటి ఖర్చుల వివరాలు ఉంటాయి. అందుకే బడ్జెట్‌ అంటే రాష్ట్ర ఆర్థిక స్థితిని ప్రతిబింబించే ఒక వాస్తవ సంఖ్య. కానీ, వైసీపీ హయాంలో బడ్జెట్‌ అంటే కేవలం ఒక ఫ్యాన్సీ నంబర్‌. జగన్‌ సర్కార్‌ బడ్జెట్‌ అంకెలు చూస్తుంటే, రాష్ట్ర ఆర్థిక స్థితిని కాకుండా న్యూమరాలజీ ప్రకారం బడ్జెట్‌ అంకెను ఓకే చేశారా అన్న అనుమానమైతే వస్తుంది. 2019-20లో రూ.2,27,974 కోట్లు, 2020-21లో రూ.2,24,789 కోట్లు, 2021-22లో రూ.2,29,779 కోట్లు , 2022-23లో రూ.2,56,256 కోట్లు, 2023-24లో రూ.2,79,279 కోట్లు బడ్జెట్‌ అంకెగా నిర్ణయించారు.

ఇలా నిర్ణయిస్తున్నారు..

ఆర్థిక శాఖ ఉద్యోగులు చెప్పే వివరాల ప్రకారం.. ఆర్థిక శాఖ కార్యదర్శులు ఇద్దరూ కలిసి ముందుగా ఒక నెంబర్‌ అనుకుంటారట. ఆ తర్వాత మరో ఇద్దరు కన్సల్టెంట్లను పిలిచి ఆ నెంబర్‌కు మ్యాచయ్యేలా కేటాయింపుల లెక్కలు వేయిస్తారంట. ఐదేళ్ల నుంచి ఇదే విధానం అమలవుతోంది. ఇలా ఆ నలుగురే బడ్జెట్‌ మొత్తం చూసుకుంటారు. మరి ఆర్థిక శాఖలోని ఉద్యోగులంతా ఏం చేస్తారు? జగన్‌ హయాంలో పనుల్లేవు కాబట్టి ఫైళ్ల తాకిడి కూడా తక్కువే. అయినప్పటికీ కనీసం బడ్జెట్‌ వైపు వీరెవరూ కన్నెత్తి కూడా చూడరు. ఎందుకంటే బడ్జెట్‌ సచివాలయంలో కాకుండా ఎక్కడో బయట ఆ ఇద్దరు కన్సల్టెంట్ల ఆధ్వర్యంలో తయారవుతుంది. ముందుగా కార్యదర్శులు నిర్ణయించిన నెంబర్‌కి మ్యాచయ్యేలా కేటాయింపులు జరుగుతుంటాయి. ఈ తంతు అయిపోయాక, మమ అనిపించడానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందురోజు సచివాలయంలోని ఆర్థిక శాఖలో కార్యదర్శులు సమావేశం నిర్వహించి, మొక్కుబడిగా ముందు అనుకున్న నెంబర్‌ను ఓకే చేసి, వాటిని అర్ధరాత్రి ముద్రణకు పంపిస్తారు. ముద్రించిన బడ్జెట్‌ కాపీలు అర్ధరాత్రి తర్వాత సచివాలయానికి చేరుకుంటాయి. ఆర్థిక శాఖ ఉద్యోగులు చేయాల్సిన పని అప్పుడే మొదలవుతుంది. ఆ శాఖలోని పురుష ఉద్యోగులు రకరకాల బడ్జెట్‌ పుస్తకాలను కలిపి సెట్లుగా సిద్ధం చేస్తారు. మహిళా ఉద్యోగులు ఆ సెట్లను బ్యాగుల్లో సర్దుతారు. ఈ బ్యాగులనే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అధికారులకు అందజేస్తారు. మొత్తం బడ్జెట్‌ తయారీలో ఆర్థిక శాఖ ఉద్యోగుల పాత్ర ఇదే.

రూ.45వేల కోట్ల అదనపు ప్రతిపాదనలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో బడ్జెట్‌ కేటాయింపులు కాకుండా రూ.45,000 కోట్ల అదనపు ప్రతిపాదనలను ఆర్థికశాఖ ఓకే చేసింది. బడ్జెట్‌లో డొల్లతనానికి ఈ అంకెలే నిదర్శనం. బడ్జెట్‌ పక్కాగా రూపొందిస్తే అదనపు కేటాయింపుల అవసరం పెద్దగా ఉండదు. కానీ, ఈ ఐదేళ్ల నుంచి బడ్జెట్‌ పెట్టిన మరుసటిరోజు నుంచే అదనపు నిధుల కోసం ఆర్థికశాఖకు ఫైళ్లు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్‌ గొప్పగా చెప్పుకునే వలంటీర్లు, సెంటు భూమి లాంటి పథకాలను కూడా ఆయా సంవత్సరాల బడ్జెట్‌లో పెట్టలేదు. వాటిని అదనపు ప్రతిపాదనలుగా పంపించి నిధులు ఖర్చు చేశారు.

పబ్లిక్‌ అకౌంట్లో మాయాజాలం

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల నుంచి బడ్జెట్‌లో చూపిస్తున్న పబ్లిక్‌ అకౌంట్‌ నంబర్లకు, వాస్తవిక అంకెలకు ఏ మాత్రం పొంతన ఉండదు. బడ్జెట్‌ మొత్తమ్మీద ఎక్కువ మాయ జరిగేది ఇక్కడే. పబ్లిక్‌ అకౌంట్‌లో ఉద్యోగుల జీతాల నుంచి కట్‌ చేసే జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ లాంటి నిధులు ఉంటాయి. 2019-20లో దాదాపు రూ.10,000 కోట్లకు చేరువగా ఉన్న నిధి ఈ ఏడాది రూ.16,000కోట్లు దాటింది. ఈ డబ్బు మొత్తాన్ని ప్రభుత్వం వాడేసుకుంటుంది. దీన్ని అప్పు కింద పరిగణిస్తారు. కానీ, బడ్జెట్‌ పుస్తకాల్లో మాత్రం పబ్లిక్‌ అకౌంట్‌లో రూ.500 కోట్ల లోపుగానే ఉన్నట్టు చూపిస్తున్నారు. అంటే రూ.15,000కోట్ల వరకు అప్పును దాచేసి, పరిమితి లేకపోయినా ఆమేర కొత్త అప్పులు తెస్తున్నారు.

నిర్వహణ పేరిట భారీ ఖర్చు

బడ్జెట్‌లో మెయింటెనెన్స్‌ పేరుతో ప్రభుత్వం భారీగా ఖర్చు పెడుతోంది. కానీ, ఆ పనులు మాత్రం కంటికి కనిపించడం లేదు. రాష్ట్ర సచివాలయంలోని కార్యాలయాలు అపరిశుభ్రంగా ఉంటాయి. ఏసీలు పనిచేయవు. ఇంకా ఎన్నెన్నో సమస్యలు.. వాటి రిపైర్లకు అయ్యే బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదు. అయినా మెయింటెనెన్స్‌ కింద జగన్‌ ప్రభుత్వం 2019-20లో రూ.547కోట్లు, 2020-21లో రూ.918 కోట్లు, 2021-22లో రూ.844 కోట్లు, 2022-23లో రూ.709 కోట్లు ఖర్చు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి.

బడ్జెట్‌ మాయలు ఈ ఖర్చు ఏ ఖాతాలో?

రూ.1,04,607 కోట్లకు లెక్కల్లేవ్‌

నాన్‌ అసైన్డ్‌ హెడ్స్‌...వేటికీ కేటాయించని ఖాతాలు.. ఈ హెడ్‌ కింద ఏకంగా రూ.1,04,607 కోట్లు ఖర్చు పెట్టారు. ఖజానా నుంచి తీసిన రూపాయినైనా దేనికి ఖర్చు చేశారో చెప్పాలి. కనీసం బడ్జెట్‌ పుస్తకాల్లో అయినా రాయాలి. కానీ, వైసీపీ హయాంలో కొత్తగా వచ్చిన ఈ హెడ్‌కి సంబంధించి ఎక్కడా ఒక్క ఆధారం కూడా కనిపించదు. 2020-21లో రూ.3,266 కోట్లు, 2021-22లో రూ.20,854 కోట్లు, 2022-23లో రూ.40,487 కోట్లు, 2023-24లో డిసెంబరు నాటికి రూ.40,000 కోట్ల పైచిలుకు ఈ హెడ్‌ కింద ఖర్చు చేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇది మరింత పెరగొచ్చు కూడా. పేరు లేని ఈ ఖర్చుల గురించి ఏజీ కార్యాలయం అడిగినా ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. ఖర్చు సక్రమమైనప్పుడు ఏ అవసరానికి వాడారో శాసన సభకు చెప్పి ఆమోదం తీసుకోవచ్చు. కనీసం ఏజీకైనా చెప్పుకోవచ్చు. అయినా నాన్‌ అసైన్డ్‌ పేరుతో ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారో తెలియదు. సాధారణంగా రెవెన్యూ, క్యాపిటల్‌ అనే రెండు విభాగాల కింద ఖర్చులు చేస్తుంటారు. మరి ఈ రూ.1,04,607 కోట్లు ఏ విభాగం కిందకి వస్తాయో మరి.

లక్ష కోట్లు దాటిన అప్పులు కొత్తగా మరో 4,000 కోట్ల రుణం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జగన్‌ సర్కారు లక్ష కోట్లకు పైగా అప్పులు చేసింది. ఇందులో ప్రతి మంగళవారం రిజర్వ్‌ బ్యాంక్‌ ద్వారా తెస్తున్న అప్పులే రూ.66,000 కోట్లకు చేరుకున్నాయి. మంగళవారం ఆర్‌బీఐ నిర్వహించిన వేలంలో ప్రభుత్వం సెక్యూరిటీలు విక్రయించి రూ.4,000 కోట్ల అప్పు తెచ్చింది. వీటిపై 7.39 శాతం నుంచి 7.52 శాతం వరకు వడ్డీ పడింది. కాగా, రిటైర్డ్‌ ఉద్యోగుల్లో దాదాపు 90 శాతం మందికిపైగా ఈ నెల ఇంకా పెన్షన్లు అందలేదు. వీరి పింఛన్లకు ప్రతి నెలా దాదాపు రూ.1800 కోట్ల వరకు కావాలి. కానీ, మంగళవారం సాయంత్రం వరకు పెన్షనర్లకు చెల్లింపులు జరగలేదు.

ఓటాన్‌ అకౌంట్‌ కోసం కేబినెట్‌

రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు సమావేశం కానున్నది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 2024-25 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలుపుతుంది. మంత్రివర్గం ఆమోదం పొందిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను శాసనసభలో ఉదయం 11 గంటల 3 నిమిషాలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ప్రవేశపెడతారు.

Updated Date - Feb 07 , 2024 | 04:48 AM