Share News

వేలికి ఇంకు పూసేందుకే!

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:28 AM

సార్వత్రిక ఎన్నికల్లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నిర్వర్తించాల్సిన పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

వేలికి ఇంకు పూసేందుకే!

సచివాలయ సిబ్బందికి ఇలాంటి విధులే అప్పగించాలి

ఎన్నికల్లో ఓపీవోలుగా మాత్రమే ఉపయోగించుకోవాలి

ప్రాధాన్యం లేని పనులు మాత్రమే అప్పగించాలి

వలంటీర్లకు ఎన్నికల విధులు వద్దే వద్దు

పోలింగ్‌ ఏజెంట్లుగా కూడా కుదరదు: ఈసీ ఆదేశం

జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా మెమో

అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నిర్వర్తించాల్సిన పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఓటర్ల వేలికి ఇంకు పూసే విధులతో పాటు మరికొన్ని ప్రాధాన్యం లేని పనులు (ఓపీవో విధులు) మాత్రమే వీరికి అప్పగించాలని స్పష్టం చేసింది. ముఖ్యమైన ఎన్నికల పనులేవీ వారికి అప్పగించొద్దని ఆదేశించింది. పోలింగ్‌ రోజున బూత్‌ల్లో జరిగే కీలకమైన కార్యకలాపాల్లో సచివాలయ సిబ్బంది జోక్యం చేసుకోకుండా అడ్డుకట్ట వేసింది. ఎన్నికల విధుల్లోకి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని తీసుకునేందుకు అభ్యంతరం లేదని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈ మేరకు అర్హులైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో నియమించుకునేందుకు అభ్యంతరం లేదని పేర్కొంటూ జిల్లా కలెక్టర్లు, అధికారులకు మీనా బుధవారం సూచనలతో కూడిన మెమో జారీ చేశారు. రాబోయే ఎన్నికల్లో అర్హులైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పోలింగ్‌ పార్టీలుగా విధులు అప్పగించవచ్చని సూచించారు. ప్రతి పోలింగ్‌ పార్టీలోనూ అర్హులైన ఒక ఉద్యోగిని నియమించుకోవచ్చన్నారు. బీఎల్‌వోలుగా వ్యవహరించిన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని పోలింగ్‌ పార్టీలుగా తీసుకోవద్దని ఈసీ పేర్కొంది. పోలింగ్‌ రోజున వారికి ఎన్నికల విధులు కాకుండా ఇతర విధులు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని సూచించింది. గ్రామ, వార్డు వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలకు సంబంధించిన విధులు అప్పగించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టంచేసింది. అభ్యర్థులకు పోలింగ్‌ ఏజెంట్లుగా కూడా వలంటీర్లను అనుమతించవద్దని తేల్చిచెప్పింది.

Updated Date - Feb 15 , 2024 | 03:28 AM