ఏసీబీ ఉచ్చులో తిరుపతి డిప్యూటీ కలెక్టర్
ABN , Publish Date - Nov 10 , 2024 | 03:58 AM
తిరుపతి డిప్యూటీ కలెక్టర్ ఎం.ఎ్‌స.మురళి ఆస్తులపై శనివారం ఏసీబీ తనిఖీలు చేపట్టింది.
ఆదాయానికి మించి ఆస్తులపై ప్రభుత్వానికి ఫిర్యాదులు
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో విస్తృత సోదాలు
తిరుపతిలో కొడుకు పేరిట పెద్ద హోటల్
మదనపల్లెలో అదుపులోకి తీసుకున్న ఏసీబీ
తిరుపతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): తిరుపతి డిప్యూటీ కలెక్టర్ ఎం.ఎ్‌స.మురళి ఆస్తులపై శనివారం ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదుల తో రంగంలోకి దిగిన ఏసీబీ.. శనివారం తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, నెల్లూరు జిల్లాల పరిధిలో విస్తృత సోదాలు జరిపింది. మదనపల్లెలో ఆయన్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ కలెక్టర్ మురళి అత్యధిక శాతం ఆస్తులను తన పేరిట, కుటుంబీకుల పేరిట కాకుండా బినామీల పేరిట పెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. రెవెన్యూ శాఖలో తన కిం ద పనిచేసిన నమ్మకస్తులైన ఉద్యోగులు, అధికారుల పేరిట ఆస్తులు కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. అందులో భాగంగా ఓ సర్వేయరు, మరో డిప్యూటీ తహసీల్దార్ల నివాసాల్లోనూ తనిఖీలు జరిగాయి. సాయి గ్రాండ్ హోటల్ స్థలం విలు వ రూ. కోట్లలో ఉండడంతో తొలుత అధికారులు ప్రశ్నించగా లీజుకు తీసుకున్నట్టు డిప్యూటీ కలెక్టర్ చెప్పారని సమాచారం. అయితే ఏసీబీ అధికారులు డాక్యుమెంట్లు పరిశీలించడంతో కొడుకు పేరిటే స్థలం కొనుగోలు చేసి హోటల్ కట్టించినట్టు గుర్తించారని తెలిసింది. ఇక చిత్తూరు జిల్లా పరిధిలో 8 చోట్ల కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అన్నమయ్య జిల్లాలోని రామసముద్రం, రాయచోటి, రాజంపేట, ఒంగోలు జిల్లా కేంద్రం, బెంగుళూరులోనూ భారీగా ఆస్తుల్ని గుర్తించినట్టు సమాచారం. మదనపల్లె ప్రశాంత్‌నగర్‌లోని ఆర్డీవో మురళి ఇం ట్లో నివాసం ఉన్న ఆయన తమ్ముడు వెంకటాచలపతి నివాసం లో, ఆయన ప్రియశిష్యుడు మదనపల్లె మండలం పొన్నేటిపాళెం వీఆర్వో శేఖర్ నివాసంలోనూ సోదాలు జరిగాయి. మొత్తంగా బినామీల పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ. 200 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. పలు డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీన పర్చుకున్నారు. కాగా, మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్లు దగ్ధమైన కేసులో ఇప్పటికే ప్రభుత్వం మురళీని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.