Share News

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ఠ భద్రత

ABN , Publish Date - May 19 , 2024 | 03:21 AM

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌ కుమార్‌ మీనా ఆదేశించారు.

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ఠ భద్రత

అనధికార వ్యక్తులను అనుమతించకండి: మీనా

కలెక్టర్‌, సీపీలతో కలసి ఈవీఎంలు భద్రపరచిన గదులు పరిశీలన

మహారాణిపేట (విశాఖపట్నం), మే 18: స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌ కుమార్‌ మీనా ఆదేశించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. ఆయన శనివారం ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ (ఈవీఎంలను భద్రపరచిన గదులు)లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, పోలీస్‌ కమిషనర్‌ ఎ.రవిశంకర్‌ అయ్యన్నార్‌తో కలసి పరిశీలించారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్‌ రూమ్‌లను ఆయన తనిఖీ చేశారు. తలుపులకు వేసిన సీళ్లను సునిశితంగా పరిశీలించారు. అక్కడ పరిస్థితులను గమనించారు. అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయా? లేదా? అన్ని జాగ్రత్తలు తీసుకున్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. తనిఖీ అనంతరం అక్కడ ఉన్న లాగ్‌బుక్‌లో సంతకం చేశారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను పాటించాలని, అక్కడ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌కు సూచించారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్‌రూమ్‌లు ఉన్న ప్రాంతాల్లోకి ఎట్టి పరిస్థితల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనల ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ పర్యటనలో జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, నియోజకవర్గాల ఆర్వోలు ఇతర అధికారులు ఉన్నారు.

Updated Date - May 19 , 2024 | 07:23 AM