Share News

బెదిరింపులు.. హత్యలు..

ABN , Publish Date - May 23 , 2024 | 03:24 AM

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం అభివృద్థిలో వెనకబడినప్పటికీ అరాచకాల్లో మాత్రం ముందంజలో ఉంది.

బెదిరింపులు.. హత్యలు..

పిన్నెల్లి బ్రదర్స్‌కు కామన్‌.. వేల కోట్లు పోగేసిన సోదరులు

(గుంటూరు-ఆంధ్రజ్యోతి)

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం అభివృద్థిలో వెనకబడినప్పటికీ అరాచకాల్లో మాత్రం ముందంజలో ఉంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 15 ఏళ్ల కిందట 2009లో ఇక్కడ విజయం దక్కించుకున్న నాటి నుంచి ఆయనతోపాటు సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నియోజకవర్గంపై ఆధిపత్యం చేయడం ప్రారంభించారు. దీంతో పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. మాచర్లలో ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని అన్నదమ్ములు పాశవిక పాలన కొనసాగిస్తున్నారు. అక్కడ వారు చెప్పిందే వేదం. వారు చెప్పిందే ధర్మం. వాళ్ల అనుమతి లేకుండా కాకి కూడా ఆ నియోజకవర్గంలో అడుగుపెట్టడానికి వీల్లేదన్నట్టుగా వ్యవహరించారు. కాంట్రాక్టర్లు కప్పం కట్టకుండా టెండర్‌ వేయటానికి వీల్లేదు. ఇక, ఎన్నికలు వచ్చాయంటే అన్నదమ్ముల క్రూరత్వానికి హద్దే ఉండదని ఇక్కడివారు చెబుతారు. అడ్డొచ్చిన వారిని తెగ నరకటానికి ఏమాత్రం సంకోచించరు. వీరికి తోడుగా కొంతమంది రౌడీలను, అరాచకవాదులను పెంచి పోషిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జడ్పిటీసీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన కాలమంతా మాచర్లలో ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా ఖూనీ అయింది. సొంత బాబాయిలకే వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యే సీటు సంపాదించుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ తర్వాత అందరికీ చెక్‌ పెట్టడం ప్రారంభించారు. చూడటానికి సౌమ్యుడిలా కనిపించినప్పటికీ అత్యంత కిరాతక మనస్తత్వం కలిగిన వ్యక్త అని ఆయనతో సన్నిహితంగా ఉండే వాళ్లు చెబుతుంటారు. రామకృష్ణారెడ్డి సోదరులు అక్కడి టీడీపీ కార్యకర్తలపై జరిపిన దాడులు, చేసిన హత్యలు అన్నీ ఇన్నీ కావు. 2006 నుండి 2009 వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల జడ్పీటీసీగా పనిచేశారు. నిధుల కోసం అప్పటి జిల్లా పరిషత్‌ పాలకవర్గంపై కూడా రౌడీయిజాన్ని ప్రదర్శించారు. 2009 ఎన్నికల్లో సొంతవారికి వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యే సీటు దక్కించుకున్నారు.

Updated Date - May 23 , 2024 | 03:24 AM