బెదిరించి దోచేశారు.. కక్కాల్సిందే!
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:53 AM
ఐదేళ్ల అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలు, అధికారులు చేసిన అవినీతి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది.

వైసీపీ నేతలకు బార్ల నిర్వాహకుల హెచ్చరిక
నరసరావుపేట, జూన్ 6: ఐదేళ్ల అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలు, అధికారులు చేసిన అవినీతి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. గురువారం బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు గళమెత్తారు. తమను బెదిరించి వైసీపీ నేతలు కొట్టేసిన డబ్బు కక్కించేందుకు టీడీపీ, జనసేనకు చెందిన బార్ల నిర్వహకులు ఉద్యమిస్తున్నారు. పల్నాడు జిల్లాలో దాదాపు రూ.1.25 కోట్లు వైసీపీ నేతలు వసూలు చేశారని, ఎవరైతే తమ వద్ద డబ్బు తీసుకువెళ్లారో సదరు నేతలు ఆ సొమ్మును వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు కంగుతింటున్నారు. తనను బెదిరించి రూ.20 లక్షలు తీసుకున్న ఓ వైసీపీ నేతకు ఓ బార్ నిర్వాహకుడు ఫోన్ చేసి ఆ మొత్తాన్ని వడ్డీతో సహా తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇతర బార్ల నిర్వహకులు కూడా వారి వద్ద అక్రమంగా డబ్బు కాజేసిన వారిని తిరిగి ఇవ్వాలని హెచ్చరిస్తున్నారు. ఓ బార్ నిర్వహకుడి వద్ద రూ.40 లక్షలు, మరో వ్యాపారి వద్ద రూ.25 లక్షలు, మరో వ్యక్తి వద్ద రూ.15 లక్షలు వైసీపీ నేతలు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు.