Share News

ఆ ఓట్లు ఓకే!

ABN , Publish Date - May 27 , 2024 | 04:17 AM

ఉద్యోగులు, సర్వీసు అధికారులు, ఇతర వ్యక్తుల నుంచి వచ్చిన పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.

ఆ ఓట్లు ఓకే!

ఆర్వో సీల్‌ లేకున్నా లెక్కించాలి

సీల్‌ వేసే బాధ్యత అధికారులదే

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై ఈసీ స్పష్టీకరణ

ఆదేశాలు జారీ చేసిన సీఈవో మీనా

అధికార పార్టీ ఎత్తుగడకు ఈసీ చెక్‌

అమరావతి, మే 26(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, సర్వీసు అధికారులు, ఇతర వ్యక్తుల నుంచి వచ్చిన పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. పోస్టల్‌ బ్యాలెట్‌ పేపరు వెనుక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో) సంతకమున్నా, సీల్‌(అధికారిక స్టాంప్‌) లేదని పోస్టల్‌ బ్యాలెట్‌ తిరస్కరించకూడదని స్పష్టం చేసింది. అదేవిధంగా పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌పైనా గెజిటెడ్‌ అధికారి సంతకం ఉంటే సీల్‌ లేకపోయినా సదరు బ్యాలెట్‌ను తిరస్కరించవద్దని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటరు తమ ఓటును బ్యాలెట్‌ పేపరులో సక్రమంగా వేశారా? లేదా? అని మాత్రమే చూడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేశ్‌కుమార్‌ మీనా ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఆర్వోలు, కౌంటింగ్‌ సిబ్బంది, సూపర్‌ వైజర్లకు జిల్లా ఎన్నికల అధికారులు వెంటనే సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. అవసరమైతే శిక్షణా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఆర్వో సంతకానికి, బ్యాలెట్‌ చెల్లుబాటుకు సంబంధం లేదన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వెనుక రిటర్నింగ్‌ అధికారి సీల్‌ వేయడం ఆయన బాధ్యతేనని స్పష్టం చేశారు. అదేవిధంగా ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో గెజిటెడ్‌ అధికారి సంతకం చేయడం, సీల్‌ వేయడం కూడా అక్కడ విధులు నిర్వర్తించిన అధికారుల బాధ్యతేనని తెలిపారు. వీటిని సాకుగా చూపి ఓట్లను తిరస్కరించవద్దన్నారు. ఫాం-13(ఏ)పై ఆర్వో తన సంతకం సహా పూర్తి వివరాలు నింపి ఉంటే సీల్‌ లేకపోయినా ఆ బ్యాలెట్‌ చెల్లుబాటు అవుతుందని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌పై సదరు ఆర్వో సహా బ్యాలెట్‌ను ధృవీకరించేందుకు రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కవర్‌ ఫాం-బీ(ఫాం-13సీ)పై ఓటరు సంతకం లేదన్న కారణంగా కూడా బ్యాలెట్‌ను తిరస్కరించరాదన్నారు.

అధికార పార్టీ ఎత్తులకు చెక్‌!

ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికార పార్టీలో గుబులు మొదలైంది. ప్రభు త్వం తమకు అనుకూలంగా వ్యవహరించే కొందరు ఆర్వోలు, గెజిటెడ్‌ అధి కారులతో ఉద్దేశపూర్వకంగానే తమ పోస్టల్‌ బ్యాలెట్లపై సీల్‌ వేయకుండా అడు ్డకుందనే వాదనాలు ఉద్యోగుల్లో వినిపిస్తున్నాయి. సీల్‌ వేయకపోవడం వల్ల ఎన్నికల సంఘం తమ ఓటును పరిగణనలోకి తీసుకోదనే ఆందోళనలో ఉన్నా రు. ఉద్దేశ పూర్వకంగానే తమ పోస్టల్‌ బ్యాలెట్లపై కొందరు అధికారులు సీల్‌ వేయలేదని పలువురు ఉద్యోగులు ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగులు, ప్రతిపక్షాలైన టీడీ పీ, జనసేన, బీజేపీలు పదే పదే అధికారులు చేసిన తప్పులకు ఉద్యోగుల ఓట్లు ఇన్‌వ్యాలిడ్‌ చేయవద్దని ఈసీకి వినతులు పంపారు. దీంతో సీల్‌ లేకపోయినా పోస్టల్‌ బ్యాలెట్లు తిరస్కరించొద్దని ఈసీ ఆదేశించింది. దీంతో ఉద్యోగుల్లో ఆనం దం నెలకొంది. ప్రభుత్వ పన్నాగానికి ఈసీ అడ్డుకట్ట వేసిందని అంటున్నారు.

ఇవీ మార్గదర్శకాలు

పోస్టల్‌ బ్యాలెట్‌ను తిరస్కరించాల్సి వస్తే లోపలి కవర్‌ తెరవకుండా తిరస్కరించాలి.

ఫారం13-ఏలోని డిక్లరేషన్‌, ఫారం 13-సీలోని కవర్‌-బీ లోపల కనిపించని పక్షంలో తిరస్కరించవచ్చు.

డిక్లరేషన్‌పై ఓటర్లు సక్రమంగా సంతకం చేయకపోయినా, లోపభూయిష్టంగా ఉన్నా తిరస్కరించవచ్చు.

సీరియల్‌ నెంబర్‌ ఫాం 13-బీలో డిక్లరేషన్‌పై కనిపించే బ్యాలెట్‌ పేపర్‌, ఫాం- 13-బీ లోపలి కవర్‌ ఏపై ఆమోదించిన క్రమ సంఖ్యకు భిన్నంగా ఉన్నా తిరస్కరించవచ్చు.

పోస్టల్‌ బ్యాలెట్‌పై ఓటు నమోదు కాకపోయినా తిప్పికొట్టవచ్చు.

నకిలీ బ్యాలెట్‌ పేపరు అయినా, దెబ్బతిన్నా తిరస్కరించవచ్చు.

ఆర్వో బ్యాలెట్‌తోపాటుగా పంపిన కవర్‌ బీలో తిరిగి ఇవ్వకపోయినా తిరస్కరిస్తారు.

ఓటును సూచించే గుర్తు సందేహాస్పదంగా ఉంటే పోస్టల్‌ బ్యాలెట్‌ను తిరస్కరించవచ్చు.

Updated Date - May 27 , 2024 | 04:17 AM