AP Elections 2024: రాజంపేట పోరు రసవత్తరం !
ABN , Publish Date - May 10 , 2024 | 04:17 AM
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. వరుసగా రెండు సార్లు విజయం దక్కించుకున్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కూటమి తరఫున తలపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్లిం నాయకుడు షేక్ బషీద్ పోటీలో ఉన్నారు.
హ్యాట్రిక్ కోసం మిథున్‌రెడ్డి
తొలిసారి లోక్‌సభ బరిలో నల్లారి
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. వరుసగా రెండు సార్లు విజయం దక్కించుకున్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కూటమి తరఫున తలపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్లిం నాయకుడు షేక్ బషీద్ పోటీలో ఉన్నారు.
హ్యాట్రిక్ కోసం మిథున్
గత రెండు ఎన్నికల్లో రాజంపేట నుంచి విజయం దక్కించుకున్న పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఈసారి హ్యాట్రిక్ కోసం తపిస్తున్నారు. అయితే సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న మాజీ సీఎం నల్లారి కూటమి తరఫున బరిలో ఉండడంతో మిథున్ గెలుపుపై సందేహాలు ముసురుకున్నాయి. ఎంతైనా ఖర్చు పెట్టగల డబ్బు.. అఽధికారాన్ని అడ్డం పెట్టుకుని పోల్‌మేనేజ్‌మెంట్ చేయడంలో మాత్రం మిథున్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. కానీ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం సాగించిన పెత్తనంపై జిల్లావ్యాప్తంగా అసంతృప్తి పెల్లుబుకుతోంది. మిథున్‌రెడ్డి 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో దగ్గుపాటి పురందేశ్వరిపై లక్షా 70వేలు, 2019లో టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై రెండు లక్షల 66వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
కిరణ్‌కు తొలి ప్రయత్నం
1989లో రాజకీయ అరంగేట్రం చేసిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి 2009 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. మధ్యలో 1994లో ఓటమి మినహా ఆయన ప్రతి ఎన్నికలోనూ విజయం దక్కించుకున్నారు. ఉమ్మడి ఏపీ స్పీకర్‌గా, ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నా విజయం సాధించలేకపోయారు.
అనంతరం కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు తొలిసారి బీజేపీ తరఫున పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. కూటమి పార్టీలైన జనసేన, టీడీపీ నేతల మద్దతు కూడగట్టారు. పుంగనూరులో వ్యక్తిగతంగా కిరణ్‌కుమార్‌రెడ్డికి పరిచయాలు ఉన్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలో కిరణ్‌కుమార్‌రెడ్డి గ్రాఫ్ పెరిగింది.
ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కలిసి పనిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం, చల్లపల్లి నరసింహారెడ్డి.. కిరణ్ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజంపేటలో కిరణ్‌కుమార్‌రెడ్డికి క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. పీలేరు సొంత నియోజకవర్గం కావడంతో.. నల్లారికి వ్యక్తిగతంగా బలం ఉంది. రాయచోటిలో కూటమి బలంగా ఉంది.
కాంగ్రెస్ ఆశ ఇదే!
రాజంపేట పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అభ్యర్థి షేక్ బషీద్‌ను పోటీలో నిలిపింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని పేర్కొంటున్నారు. అయితే పార్లమెంటు పరిధిలో సుమారు 2 లక్షల ముస్లిం మైనార్టీల ఓట్లు ఉన్నాయి. ఇప్పటికే అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత కారణంగా.. కూటమి అభ్యర్థికి వేయకపోయినా తమకే వేయవచ్చనే ఆశలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి.
- రాయచోటి,ఆంధ్రజ్యోతి
మిథున్‌రెడ్డి బలాలు
జిల్లా వ్యాప్తంగా మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పెత్తనం.
ప్రతి నియోజకవర్గంలోనూ సొంత అనుచరవర్గం.
అపరిమిత ఆర్థిక వనరులు.
ఎన్నికల వ్యూహాలు, పోల్ మేనేజ్‌మెంట్.
కనుసన్నల్లో పనిచేసే అధికార యంత్రాంగం.
ప్రతిపక్షాల కట్టడి.
బలహీనతలు
పెద్దిరెడ్డి కుటుంబ అక్రమాలు.
ఇసుక, వనరుల దోపిడీపై ప్రజల్లో వ్యతిరేకత.
స్థానికంగా ఉండరన్న చెడ్డపేరు.
అన్నమయ్య జిల్లా కేంద్రం విషయంలో జనాల్లో వ్యతిరేకత.
నల్లారి బలాలు
సీఎం హోదాలో చేసిన అభివృద్ధి.
హుందాగా రాజకీయాలు చేయడం.
పార్టీలకు అతీతంగా విద్యావంతుల మద్దతు.
టీడీపీ నేతల సంపూర్ణ సహకారం.
బలహీనతలు
జిల్లాలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రం.
పెద్దగా క్యాడర్ లేకపోవడం.
పదేళ్లు రాజకీయాలకు దూరంగా ఉండడం
మొత్తం ఓటర్లు 14,21,196
పురుషులు: 6,97,638.,
మహిళలు: 7,23,434,
ట్రాన్స్‌జెండర్లు: 124
అసెంబ్లీ నియోజకవర్గాలు : తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, రాయచోటి, రాజంపేట, కోడూరు