Share News

ఇది నవశకం పొత్తు!

ABN , Publish Date - Mar 13 , 2024 | 03:59 AM

ఎవరికి ఎన్ని సీట్లు అనేది ప్రధానం కాదు. 175 సీట్లలో మూడు పార్టీలు పోటీ చేస్తున్నట్లే. కచ్చితంగా ఈ నవశకం పొత్తు రాష్ట్రానికి మేలు చేస్తుంది.

ఇది నవశకం పొత్తు!

రాష్ట్ర క్షేమం కోసం అసాధ్యమైన పొత్తును మనం సాధించగలిగాం. ఇది గర్వకారణమని చెప్పను గానీ.. ఇది రాష్ట్రానికి చాలా కీలకం.

-పవన్‌

వైసీపీ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకే: పవన్‌

అసాధ్యాన్ని సుసాధ్యం చేశా.. పొత్తు కుదర్చడంలో కీలక పాత్ర పోషించా

ఎవరికి ఎన్ని సీట్లన్నది ముఖ్యం కాదు

175 సీట్లలో 3 పార్టీలూ పోటీ చేస్తున్నట్లే

జగన్‌కు మరచిపోలేని యుద్ధాన్ని ఇద్దాం

మే 15లోపు వైసీపీ విముక్త ఆంధ్ర

కలిసి పనిచేసి ఈ కల సాకారం చేద్దాం

భీమవరాన్ని ఓ రౌడీ చేతిలో పెట్టారు

అక్కడ ఇల్లు కొందామంటే..

భయంతో ఎవరూ అమ్మడం లేదు

ఈసారి సీటు కొట్టి తీరతాం: జనసేనాని

జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి

అమరావతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ‘ఎవరికి ఎన్ని సీట్లు అనేది ప్రధానం కాదు. 175 సీట్లలో మూడు పార్టీలు పోటీ చేస్తున్నట్లే. కచ్చితంగా ఈ నవశకం పొత్తు రాష్ట్రానికి మేలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల తలరాతను మారుస్తుంది’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకొచ్చి నవ శకంలోకి అడుగుపెట్టడానికి పొత్తు ఎంతో ఉపకరిస్తుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు తన అనుచరులతో కలిసి మంగళవారమిక్కడ జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్‌ సమక్షంలో పార్టీలో చేశారు. ఆయన వీరందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు. ‘ఒక అసాధ్యమైన, అసాధారణమైన రాజకీయ కలయికను రాష్ట్రంలో సాకారం చేయగల శక్తిని మీ అభిమాన బలమే నాకు అందించింది. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయినా ప్రజల గుండెల్లో నాకు అత్యున్నత స్థానం ఇచ్చారు. ఆ బలంతోనే రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడుకోవాలనే తపనతో కేంద్ర పెద్దలను ఒప్పించి మరీ అసాధ్యంగా కనిపించిన పొత్తును సుసాధ్యం చేశాను’ అని తెలిపారు. పొత్తులో భాగంగా జనసేన తీసుకున్న సీట్లపై చాలా రకాలుగా మాట్లాడుతున్నారని, 2019లో తాను ఒక్కచోట గెలిచినా ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉండేదని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జగన్‌తోపాటు జగన్‌ జలగలను ఏరిపారేద్దామని పిలుపిచ్చారు. ఇంకా ఏమన్నారంటే..

వ్యతిరేక ఓటు ఒక్కటీ చీలకుండా...

రాష్ట్ర భవిష్యత్‌ కోసం, వైసీపీ పాలనలో దశాబ్దాలు వెనక్కి వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు దశ, దిశ చూపేందుకు మూడు పార్టీలు ఒకే వేదికపైకి వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకుండా, బయటకు వెళ్లకుండా సంపూర్ణంగా ప్రజలంతా ఒకే తాటిపైకి రావాలని తీసుకున్న నిర్ణయమిది. ఒకడి దగ్గరే అధికారం, డబ్బు, అవినీతి, కిరాయి సైన్యం, అరాచకం ఉంటే ప్రజలెవరూ బతకలేరు. రాష్ట్రంలో పెరిగిపోయిన క్రిమినల్‌ చెట్లను కూకటివేళ్లతో పెకిలించాలి. మే 15లోపు మనం కలలు కన్న వైసీపీ విముక్త ఏపీ దగ్గరలోనే ఉంది. రానున్న నెల రోజులపాటు కష్టపడి పనిచేసి మన కలను సాకారం చేసుకుందాం. రౌడీల చేతిలో రాజ్యం ఉండకూడదనే నినాదంతో వైసీపీని తరిమేద్దాం.

కుబేరుల పట్టణంలో..

రాష్ట్రంలో కుబేరులు ఎక్కువగా ఉండే పట్టణంగా భీమవరానికి పేరు ఉంది. అలాంటి పట్టణాన్ని 2019లో ఒక రౌడీ (వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌) చేతిలో పెట్టారు. వీధి రౌడీని ఎమ్మెల్యేను చేస్తే ఎలా ఉంటుందో అక్కడి ప్రజలు ఇప్పుడు స్వయంగా తెలుసుకుంటున్నారు. భీమవరంలో ఈ ఎమ్మెల్యే వల్ల అక్రమ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెరిగిపోయాయి. రామాంజనేయుల్ని ఒక్కటే కోరుతున్నాను. భీమవరంలో నాకో స్థలం చూపిస్తే కొనుక్కుంటాను. అక్కడే కార్యాలయం ఏర్పాటు చేసుకుందాం. అక్కడి రౌడీయిజాన్ని కట్టడి చేయడంపై దృష్టిపెడతాను. భీమవరాన్ని గుండెల్లో పెట్టుకుంటాను. అది నాది.. దానిని వదలను. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఇలాంటి వ్యక్తిని ఎన్నుకోకుండా ధైర్యంగా పనిచేద్దాం. గత ఎన్నికల్లో గ్రంధి శ్రీనివాస్‌ మా బంధువు.. మా కులపు వ్యక్తి అనే కోణంలో చాలామంది అతడికి మద్దతుగా నిలిచారు. రాజకీయాల్లో యుద్ధం మాత్రమే ఉంటుంది. బంధుత్వం ఉండదు. మన బంధువయినా ప్రజలపై అన్యాయంగా దాడులు చేస్తే అతడికి మద్దతుగా ఉంటామా..? శ్రీనివాస్‌ చేసే తప్పుడు పనులు కులానికి చుట్టుకునే దుస్థితి వచ్చింది. వైసీపీ ఎన్ని కోట్లు కుమ్మరించినా ఈసారి ఈ సీటు కొట్టి తీరుతాం. ప్రతిసారి కోకిలలా సిద్ధం.. సిద్ధం అంటున్న జగన్‌కు మరచిపోలేని యుద్ధం ఇద్దాం. యుద్ధం అంతిమ లక్ష్యం రాజకీయ ప్రక్షాళన, ప్రభుత్వ మార్పు.

భీమవరానికి వచ్చి శాశ్వతంగా ఉండేందుకు 2019 నుంచీ ప్రయత్నిస్తున్నాను. కానీ అక్కడ ఎమ్మెల్యేకు భయపడి స్థలం లేదా ఇల్లు అమ్మడానికి, లీజుకు ఇవ్వడానికి స్థానికులు భయపడుతున్నారు. నాలాంటి వ్యక్తికే ఇలా ఉంటే సాధారణ ప్రజల పరిస్థితి ఊహించుకోవచ్చు.

- పవన్‌ కల్యాణ్‌

Updated Date - Mar 13 , 2024 | 03:59 AM