రైతు బజార్లలో దొంగలు
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:36 PM
కర్నూలు నగరంలోని సీ.క్యాంపు, అమీన అబ్బా్‌సనగర్, కొత్తపేట రైతుబజార్లలో కొనుగోలుదారులకు దొంగల భయం పట్టుకుంది.

కర్నూలు అగ్రికల్చర్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలోని సీ.క్యాంపు, అమీన అబ్బా్‌సనగర్, కొత్తపేట రైతుబజార్లలో కొనుగోలుదారులకు దొంగల భయం పట్టుకుంది. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా దొంగలు మాటు వేసి పర్సులతో పాటు సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లిపోతున్నారు. ఇటీవల కాలంలో ఈ సమస్య ఎక్కువై పోవడంతో రైతుబజార్ల ఎస్టేట్ అధికారులు మరోదారి లేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వినియోగదారులకు దొంగల నుంచి ఉన్న ముప్పును నివారించాలని ఎస్టేట్ అధికారులు విజ్ఞప్తి చేయడంతో పోలీసులు రైతుబజార్లకు వచ్చి లౌడు స్పీకర్ల ద్వారా వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నారు. మరో వైపు కూరగాయలను కొనుగోలు చేసే క్రమంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని, జేబుల్లో పర్సులు ఎవరైనా ఎత్తుకెళ్లే ప్రయత్నాలు చేస్తుంటే.. వెంటనే తమకు సమాచారం అందించాలని, వెంటనే సీసీ కెమెరాల ద్వారా గుర్తించి పోలీసులకు అప్పగిస్తామని సీ. క్యాంపు రైతుబజారు ఎస్టేట్ అధికారి హరీష్ కుమార్ తెలిపారు.