Share News

రక్తపు మరకలతో బూత్‌లోకి వచ్చారు

ABN , Publish Date - May 25 , 2024 | 04:02 AM

రక్తపు మరకలతో పోలింగ్‌ బూత్‌లోకి వచ్చారు. నాకు చాలా భయమేసింది. ట్రైనీ డీఎస్పీ జగదీశ్‌ రక్షణలో ప్రాణాలతో భయపడ్డా.

రక్తపు మరకలతో బూత్‌లోకి వచ్చారు

టీడీపీ ఏజెంట్‌గా ఉండొద్దని గద్దించారు

భయమేసినా అక్కడే ఉన్నా

ట్రైనీ డీఎస్పీ లేకపోతే ఈపాటికి శవమయ్యేవాడిని

నేను మాట వినడం లేదని నా కుటుంబాన్ని హింసించారు

‘ఏబీఎన్‌ డిబేట్‌’లో మాచర్ల టీడీపీ నేత

నోముల మాణిక్యరావు ఆవేదన

మాచర్లటౌన్‌, మే 24: ‘‘రక్తపు మరకలతో పోలింగ్‌ బూత్‌లోకి వచ్చారు. నాకు చాలా భయమేసింది. ట్రైనీ డీఎస్పీ జగదీశ్‌ రక్షణలో ప్రాణాలతో భయపడ్డా. లేదంటే ఈపాటికి శవంగా మిగిలేవాడ్ని’’ అంటూ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం కండ్లకుంటలో టీడీపీ ఏజెంట్‌ నోముల మాణిక్యరావు చెబుతుంటే ఆయన గొంతు భయంతో వణికింది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హింసాపర్వంలోని మరో భయానక అధ్యయనాన్ని ఆయన శుక్రవారం ‘ఏబీఎన్‌ డిబేట్‌’లో పంచుకున్నారు. ‘‘చిన్నప్పటి నుంచి పిన్నెల్లి సోదరుల వ్యక్తిత్వం నాకు తెలుసు. వారి పద్ధతులు నచ్చక టీడీపీ అభిమానిగా మారాను. చంద్రబాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి అంటే ఉన్న ఇష్టం, గౌరవంతో పోలింగ్‌ రోజు కండ్లకుంటలో ఏజెంట్‌గా కూర్చున్నా. బూత్‌లో చొచ్చుకువచ్చిన రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి నాపై విరుచుకుపడ్డారు. వెంకట్రామిరెడ్డి, ఆయన అనుచరుడు దేశిరెడ్డి నాసరరెడ్డి... టీడీపీ ఏజెంట్‌గా కూర్చొవద్దు.. చంపేస్తామని బెదిరించారు. అయినప్పటికీ నేను బెదరకుండా అక్కడే ఉన్నాను. దీంతో వారు నా ఇంటికెళ్లి నా భార్య, పిల్లల ను చితకబాదారు. డిగ్రీ చదువుతున్న నా పెద్ద కుమారుడితో... ‘ఎంత బలుపురా మీనాన్నకు’ అంటూ పొత్తికడుపుపై తన్నారు. చిన్న కొడుకును అందరూ కలిసి కొట్టారు. అడ్డుకోబోయిన నా భార్యను కొట్టారు. ఇంత అరాచకమేంటో! మాచర్లలో పుట్టడమే దౌర్భాగ్యంగా ఉంది. పోలీసులు, పీవోవంటి వాళ్లు పిన్నెల్లి సోదరులు అంటే వణికిపోతారు. చావునోట్లోకి వెళ్లొచ్చాను. మా ఇంట్లో వారిని వేధించిన తర్వాత తిరిగి పోలింగ్‌ బూత్‌ వద్దకు వచ్చారు. నన్ను చంపడానికి పెట్రోలు బాంబులు, బరిసెలు, మారణాయుధాలతో సిద్ధమయ్యారు. అక్కడున్న ట్రైనీ డీఎస్పీ జగదీశ్‌కు పరిస్థితి వివరించి, కాపాడమని అని వేడుకున్నా.

ఆయనతో మాట్లాడుతుండగానే వెంకట్రామిరెడ్డి మంది మార్భలంతో వచ్చారు. ‘‘వాడ్ని నాకు విడిచిపెట్టండి’’ అని అంటే, అందుకు ట్రైనీ డీఎస్పీ అంగీకరించలేదు. ‘ఇది కరెక్ట్‌ కాద’ని అన్నారు. ఆయన్ను లాగి నన్ను చంపాలని ప్రయత్నించారు. సెంట్రల్‌ పోలీసు సిబ్బంది ఇక్కడ పరిస్థితి క్రిటికల్‌గా ఉంది అంటూ ట్రైనీడీఎస్పీతో మాట్లాడారు. జగదీశ్‌ చొరవతో గొట్టిపాళ్ల నుంచి సెంట్రల్‌ పోలీసులను రప్పించి నన్ను రక్షించే ప్రయత్నం చేశారు. దీనిపై వెంకట్రామిరెడ్డి ఫైరయ్యారు. ‘గతంలో బుద్ధా వెంకన్నను తురకా కిషోర్‌ దాడినుంచి రక్షించినట్టే... నన్ను జగదీశ్‌ తన వాహనంలో ఎక్కించుకుని వేగంగా వెల్దుర్తి పోలీ్‌సస్టేషన్‌కు చేరుకుని.. అక్కడ వదిలిపెట్టారు. ఆయన లేకపోతే నేను చనిపోయేవాడ్ని. పోలింగ్‌ అయిపోయాక నా భార్య బిడ్డలను చంపాలని ప్లాన్‌ చేశారు. ట్రైనీ డీఎస్పీ కంట్రోలులోకి వచ్చాక నా ఫోన్‌ను తెప్పించుకుని కుటుంబసభ్యులతో మాట్లాడాను. పోలింగ్‌ రోజు జరిగిన సంఘటనలు ఎవరికీ చెప్పవద్దు.. చంపేస్తారంటూ నా భార్యాబిడ్డలు ఏడ్చారు. ఎస్పీ గారికి, జేసీకి చెబితే, చేస్తాం చూస్తాం అన్నారేగానీ, చేసిందేమీ లేదు. ఎలాగైనా నన్ను చంపేస్తారు. ఏబీఎన్‌ మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నాను. నేను చనిపోతే వెంకట్రామిరెడ్డి ఆయన అన్న రామకృష్ణారెడ్డే కారణం. ఇది నా మరణ వాంగ్మూలం. మా నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి నాకు అండగాఉండి భరోసా కల్పించారు. తన ప్రాణమున్నంత వరకు కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఓ తండ్రిలా నాకు అండగా నిలిచారు’’ అంటూ నోముల మాణిక్యరావు ఏబీఎన్‌ డిబెట్‌లో ఫోన్‌ ద్వారా తెలిపారు.

Updated Date - May 25 , 2024 | 04:02 AM