Share News

చెలిమ నీరే దిక్కు

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:58 PM

తుంగభద్ర నదీ తీర గ్రామాల్లో తాగేందుకు చుక్కనీరు లేక పల్లె ప్రజలు తల్లడిల్లుతున్నారు.

చెలిమ నీరే దిక్కు
కౌతాళం మండలం మరళిలో తుంగభద్ర నదిలో చెలిమనీరు తోడుకుంటున్న గ్రామస్థుడు

తుంగభద్ర నదితీరంలో కన్నీటి ఘోష

పత్తాలేని ఆర్‌డబ్లూఎస్‌ అధికారులు

గాలికొదిలేసిన నీటి పథకాలు

కోసిగి, ఫిబ్రవరి 29: తుంగభద్ర నదీ తీర గ్రామాల్లో తాగేందుకు చుక్కనీరు లేక పల్లె ప్రజలు తల్లడిల్లుతున్నారు. నీటి పథకాలు మూలనపడి ఆర్‌డబ్లూఎస్‌ అధికారులు ఆఫీసులకే పరిమితమై పల్లెలవైపు కన్నెత్తి చూడటం లేదు. నియోజకవర్గంలోని కౌతాళం, కోసిగి, పెద్దకడబూరు, మంత్రాలయం మండలాల్లో వేసవికి ముందే తాగునీటి కష్టాలు తీవ్రతరమయ్యాయి. ఈ మండలాల్లో మొత్తం 96 పల్లెలు ఉన్నాయి. నియోజకవర్గ జనాభా 3 లక్షల పైచిలకు నివాసాలు ఉంటున్నారు. ఈ ఏడాది వర్షాలు లేక నదితీర గ్రామాల ప్రజలు పొలాలబాట పట్టి తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. కౌతాళం మండల పరిధిలోని హాల్వి ఎన్‌ఏపీ సీపీడబ్లూ పథకం ద్వారా 12 గ్రామాలకు చెందిన సుమారు 30 వేల మంది జనాభా ఈ నీటితోనే అవసరాలు తీర్చేకునేవారు. నదిలో నీరు ఇంకిపోవడంతో ఇప్పటికే పది గ్రామాలకు నీటి సరఫరా నిలిపివేశారు. తుంగభద్రనదిలో తవ్విన చెలిమ నీరు ద్వారా మరళి, కుంబలూరు, అగసలదిన్నె ప్రజలు దాహార్తిని తీర్చుకుంటున్నారు. కోసిగి మండలం సాతనూరు గ్రామస్తులు రెండు కి.మీల దూరంలోని పక్క గ్రామాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. తుంగభద్ర నదితీరంలోని అగసనూరు, కామన్‌దొడ్డి, కందుకూరు, కడిదొడ్డి, వందగల్లు, చిన్నభోంపల్లి, కోసిగి తదితర గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. దాదాపు రెండు నెలలుగా సాతనూరు దగ్గరున్న ఎన్‌ఏపీ స్కీమ్‌ ద్వారా కోసిగి గ్రామానికి నీరు సరఫరా కావడం లేదు. కాంట్రాక్టరు, ఆర్‌డబ్లూఎస్‌ ఏఈ పట్టించుకోకపోవడంతో తాగునీటి సమస్య తలెత్తిందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పెద్దకడుబూరు పరిధిలోని దొడ్డిమేకల, చిన్నకడుబూరు, కంబలధిన్నె, రంగాపురం, పారాపురం, మేకడోన, కల్లుకుంట, రాగిమాన్‌దొడ్డి గ్రామాల్లో తాగునీరు లేదు. మంత్రాలయం మండలంలో సూగూరు, చిలకలడోన, రచ్చుమర్రి, వగరూరు, తిమ్మాపురం గ్రామాల్లో చుక్కనీటి కోసం పరుగులు పెడుతున్నారు.

Updated Date - Feb 29 , 2024 | 11:58 PM