వారంతా వైసీపీ వలంటీర్లు!
ABN , Publish Date - Jun 27 , 2024 | 02:11 AM
వైసీపీ హయాంలో నియమితులైన వలంటీర్లంతా ఆ పార్టీ కార్యకర్తలేనని, వారి నియామకాలను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు.

హైకోర్టులో పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు
కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం
అమరావతి, జూన్ 26(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో నియమితులైన వలంటీర్లంతా ఆ పార్టీ కార్యకర్తలేనని, వారి నియామకాలను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. వలంటీర్లకు గౌరవ వేతనంగా ప్రభుత్వ ఖజానా నిధులు ఇచ్చారని, కానీ, నియామక ప్రక్రియలో రిజర్వేషన్ పాటించలేదని తెలిపారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను సెప్టెంబరు 18కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. గ్రామ-వార్డు వలంటీర్లను నియామకాన్ని సవాల్ చేస్తూ కడప జిల్లా, రాజంపేటకు చెందిన షేక్ అబుబాకర్ సిద్ధిఖి గతంలోనే హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ పిల్‌పై తొలుత మార్చి 20న విచారణ జరిపిన ధర్మాసనం.. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న అప్పటి సీఎం జగన్, అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఇతర అధికారులు, కొందరు వలంటీర్లకు కూడా నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. వైసీపీ కార్యకర్తలనే వలంటీర్లుగా నియమించారని తెలిపారు.