Share News

ఈ సార్లు సుద్దపూసలా!

ABN , Publish Date - Apr 07 , 2024 | 03:47 AM

ఐపీఎ్‌సలు తమకు తాము సర్టిఫికెట్‌ ఇచ్చుకున్నారు. నీతికీ, న్యాయానికీ, నిష్పాక్షికతకూ కట్టుబడి ఉన్నాం...

ఈ సార్లు సుద్దపూసలా!

ఎన్నికల కమిషన్‌కు 19మంది ఐపీఎస్‌ల లేఖ

విపక్షాల ఫిర్యాదులపై ఆక్రోశం

మీడియా గొంతు నొక్కాలని డిమాండ్‌

తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందట

ఈసీ ప్రభావితమవుతోందని వింత వాదన

ఐదేళ్లు పోలీసు ప్రతిష్ఠను దెబ్బతీసిందెవరు?

ఏకపక్ష దాడులు, అరెస్టులు మరిచారా?

ఐపీసీని మరిచి వైసీపీ భజన చేయలేదా?

ఎన్నికల విధుల్లో ఉండేందుకే ఈ తహతహ

ఐపీఎస్‌లు ఈ తరహా లేఖలు రాయొచ్చా?

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘మేం సుద్దపూసలం... సత్యవంతులం!’ అని 19 మంది ఐపీఎస్‌లు తమకు తాము సర్టిఫికెట్‌ ఇచ్చుకున్నారు. నీతికీ, న్యాయానికీ, నిష్పాక్షికతకూ కట్టుబడి ఉన్నాం... అని చెప్పుకొచ్చారు! అంతేకాదండోయ్‌! ‘మీరు ప్రతిపక్షాలు, మీడియా చెప్పుడు మాటలు వింటున్నారు’ అంటూ ఏకంగా ఎన్నికల కమిషన్‌నే నిందించారు. రాష్ట్రంలో 144 మంది ఐపీఎ్‌సలు ఉండగా వీరికి మాత్రమే ఈ అవసరం ఎందుకొచ్చింది? మిగిలిన అందరూ కాకుండా... వీరు మాత్రమే ఎందుకు భుజాలు తడుముకున్నారు? అని కాస్త లోతుగా ఆలోచిస్తే అసలు కిటుకు ఇట్టే అర్థమవుతుంది! వీరంతా... ఐదేళ్లపాటు వైసీపీ సర్కారుతో అంటకాగి, వైసీపీనే ఐపీసీగా అమలు చేసినట్లు బలమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే! అందులో ఆరు మందిని ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ పక్కకు తప్పించింది. ఎవరి ఆదేశాల మేరుకు కదిలారో తెలియదుకానీ.... ఈ ఆరుగురితోపాటు మొత్తం 19 మంది ఐపీఎ్‌సలు అసాధారణ రీతిలో ఈసీకి సుదీర్ఘ లేఖ రాశారు.

ఈసీ తీరుపై ఈసీకే ఫిర్యాదు చేయడం మరో చిత్రం! ‘మీడియా గొంతు నొక్కండి. ప్రతిపక్షాలను కట్టడి చేయండి’ అంటూ ఈసీకి పరోక్ష విన్నపాలు చేసుకున్నారు. మరికొందరు ‘వైసీపీ ఐపీఎ్‌సలు, ఐఏఎ్‌స’లపై ఈసీ చర్యలు తీసుకోకుండా, విపక్ష ఫిర్యాదులు పట్టించుకోకుండా ఈసీపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ లేఖ రాశారనే అనుమానాలూ తలెత్తుతున్నాయి. అలాగే... ఏదిఏమైనా ఎన్నికల డ్యూటీలో ఉండాలి, వైసీపీ సేవ చేయాలనే తహతహ కూడా ఈ అధికారుల్లో కనిపిస్తోందనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. సంతకాలు చేసిన 19 మంది వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరనే అంశంపైనా ఐపీఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ లేఖలో ఐపీఎ్‌సలు ప్రస్తావించిన అంశాలు, అసలు వాస్తవాలు ఇలా ఉన్నాయి...

ఐపీఎ్‌సలు: ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేనతోపాటు కొన్ని మీడియా సంస్థలు ఐపీఎ్‌సలపై తప్పుడు ప్రచా రం చేస్తూ పోలీసు ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాయి.

జవాబు: ప్రతిపక్షాల ఫిర్యాదులతో, మీడియా కథనాలతో ఐపీఎ్‌సల పరువు పోయిందనడం పెద్ద జోక్‌! వైసీపీ నేతల ఆకా ంక్షలు, ఆదేశాల మేరకు విపక్ష కార్యకర్తలు, అమాయకులను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేసి, చితక బాది, ఏకపక్షంగా కేసు లు నమోదు చేయించిన కొందరు ఐపీఎ్‌సలు ఎప్పుడో పరువు పోగొట్టుకున్నారు. ఏపీ పోలీసు ప్రతిష్ఠను వాళ్లే దిగజార్చారు.

ఐపీఎ్‌సలు: రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎలాంటి ఆధారాల్లేకుండా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి ఆపై మీడియా ముందుకొచ్చి నిందలు వేస్తున్నారు. ఒక వర్గం మీడియా వాటిని జనంలోకి తీసుకెళుతోంది. ఈ దుర్మార్గపు విష వలయంలో చిక్కుకుని గత రెండు నెలల్లో 30మంది ఐపీఎ్‌సలు నష్టపోయారు.

వాస్తవం: ఎన్నికల కమిషనర్లుగా ఐఏఎ్‌సలే ఉన్నారు. నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూడటం వారి విధి! ఎన్నికల కమిషన్‌కు భారీ స్థాయిలో ఫిర్యాదులు అందుతున్నాయి. వీటన్నింటిపై ఈసీ స్పందిస్తున్న దాఖలాలు లేవు. లోతుగా ఆరా తీసి, ఆధారాలు ఉన్నప్పుడే ఈసీ చర్యలు తీసుకుంటోంది. ఇక... రెండు నెలల్లో 30 మంది ఐపీఎ్‌సలు నష్టపోయారని చెప్పడం మరో వింత! ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చి 20 రోజులవుతోంది. ఈసీ ఇప్పటికి ఆరుగురు ఐపీఎ్‌సలపై మాత్రమే చర్యలు తీసుకుంది. కోడ్‌కు ముందు ఈసీ పాత్ర, ప్రమేయం లేనే లేదు. మరి... 30 మంది ‘బాధితులు’ ఎక్కడి నుంచి వచ్చినట్లు? మరి... 30 మంది ఐపీఎ్‌సలు నష్టపోతే, ఈ 19 మంది మాత్రమే ఎందుకు స్పందించారు?

ఐపీఎ్‌సలు: నిరంతరం ప్రతికూల ప్రచారం చేస్తూ, చిన్న ఘటనలనూ పెద్దవిగా చూపిస్తూ ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేసి పలువురు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఒక ఐజీని బదిలీ చేయించడంలో ఈ వర్గాలు విజయం సాధించాయి.

జవాబు: అంటే మీడియా కథనాలను ఈసీ గుడ్డిగా నమ్ముతోందని మీ ఉద్దేశమా? ఇది ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయతను నేరుగా ప్రశ్నించడమే. అఖిల భారత సర్వీసు అధికారులు రాజకీయ నాయకుల తరహాలో ఇలాంటి ఆరోపణలు చేయొచ్చా? ఇంతకూ మీ ఆక్రోశం... మీడియా కథనాలు రాయడంపైనా, లేక ఈసీ చర్యలపైనా?

ఐపీఎ్‌సలు: వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాల కట్టడిలో అగ్రగామిగా నిలిచిన ఏపీ పోలీసులు విధులు అనే బలిపీఠంపై నిలిచారు. సంఘ వ్యతిరేక శక్తుల నుంచి సమాజాన్ని పరిరక్షించేది, విపత్తుల సమయంలో పోలీసులకు నాయకత్వం వహించేది ఐపీఎస్‌ అధికారులే. చట్టాన్ని శ్రద్ధగా పాటిస్తూ పనిచేస్తున్న మా చొరవను నిరాధార ఆరోపణలతో నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది.

జవాబు: ఐపీఎస్‌లకు విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదే! దీనిని ఒప్పుకోవాల్సిందే. నిక్కచ్చిగా పని చేసే ఐపీఎ్‌సలకు సెల్యూట్‌ కొట్టాల్సిందే! కానీ... అసలు సమస్యంతా వైసీపీ ఐపీఎ్‌సలతోనే! వీరి నిర్వాకాలు ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇక... ఈ లేఖలో కొన్ని పేర్కొన్నట్లుగా రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం లేనేలేదు. ఉగ్రవాదులూ లేరు. ఉన్నదంతా ప్రభుత్వ ఉగ్రవాదమే అని విపక్షాలు వాపోతున్నాయి. ఇక... భూకబ్జాలు, ఇసుక, మద్యం మాఫియా వంటి ‘వ్యవస్థీకృత’ నేరాలు చేస్తున్నదే వైసీపీ నేతలు. వాటిని ఐపీఎ్‌సలు అణచివేశారా... అండగా ఉన్నారా అన్నది అందరికీ తెలుసు. హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే దిక్కులేదు. కానీ... అధికార పార్టీ నాయకులపై పోస్టులు ఫార్వర్డ్‌, చేసినా ‘నేనేరా పోలీస్‌’ అంటూ గర్జించారు. కరోనా సమయంలో కానిస్టేబుల్‌ నుంచి పై స్థాయి వరకూ పోలీసులు చేసిన సేవలు మరువరానివే. వైద్య సిబ్బందితోపాటు పోలీసులూ శ్రమించారు. దీనికీ ఈ అధికారులపై వచ్చిన ఆరోపణలకు సంబంధమేమిటో!?

ఐపీఎ్‌సలు: నిరాధారమైన ఆరోపణలతో అధికారుల ప్రతిష్ఠ దిగజార్చి, కీలకమైన సమస్యల నుంచి దృష్టి మరల్చి సమాజంలో అనవసరమైన వైషమ్యాలను సృష్టించి ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించే దురుద్దేశం ఉంది. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపు ఇచ్చిన తరుణంలో ప్రశాంతంగా పోలింగ్‌ ప్రక్రియ పూర్తి చేయడం సవాలుతో కూడుకున్నది. అందుకు ధైర్యం, చొరవతో కూడిన పోలీసు దళం అవసరం. స్వేచ్ఛాయుత, హింసరహిత ఎన్నికలు జరగాలంటే పోలీసు అధికారులపై జరుగుతున్న ఇలాంటి దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలి.

జవాబు: ముందే చెప్పినట్లు... రాష్ట్రంలోని మొత్తం 144 మంది ఐపీఎ్‌సలపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. వారందరిపైనా తీవ్రమైన ఆరోపణలు లేవు. సమస్యంతా ‘వైసీపీ ఐపీఎ్‌స’లతోనే! ఇక... రాష్ట్రంలో ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు ఎప్పుడు పిలుపునిచ్చారో వారికే తెలియాలి. అసలు ఇక్కడ నక్సల్స్‌ ఉనికే లేదని పోలీసు బాస్‌లు చెబుతూనే ఉన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలనే ఎన్నికల కమిషన్‌ కూడా చర్యలు తీసుకుంటోంది.

ప్రభుత్వం మీద ఎప్పుడు ఈగ వాలినా విజయవాడ నగర కమిషనర్‌ కాంతిరాణా టాటా టక్కున స్పందిస్తారు. ఐపీఎస్‌ అధికారుల సంఘం అంటే తానే అన్నట్లుగా ‘ఖండనలు’ పంపిస్తుంటారు. ఇప్పుడు ఆయనే వెళ్లి 19 మంది ఐపీఎ్‌సలు సంతకం చేసిన లేఖను సీఈవో మీనాకు అందించడం విశేషం. అన్నట్లు... కాంతి రాణా పని తీరును కొన్నాళ్ల కిందట విజయవాడలో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలోనే తప్పుపట్టారు. అప్పటికి ఎన్నికల కోడ్‌ కూడా రాలేదు. విపక్షాల ఫిర్యాదులూ లేవు.

ఎన్నికల కమిషన్‌ ఇప్పటికి కేవలం ఆరుగురు ఐపీఎస్‌లను మాత్రమే బదిలీ చేసింది. కానీ... వీరితోపాటు ఏకంగా 19 మంది ఐపీఎస్‌ అధికారులు భుజాలు తడుముకున్నారు? ఎందుకని... ఆ అవసరం ఏమిటి?

2019 ఎన్నికల సమయంలో కడప, శ్రీకాకుళం, ప్రకాశం ఎస్పీలను... ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ను, ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే ఎన్నికల కమిషన్‌ పక్కన పెట్టేసింది. అప్పుడు వీళ్లెవరూ గగ్గోలు పెట్టలేదు. ఇతర ఐఏఎస్‌, ఐపీఎ్‌సలూ హాహాకారాలు చేయలేదు.

ఈసీకి సమర్పించిన లేఖతో పత్రికల్లో ప్రచురితమైన కథనాలనూ జత చేశారు. అందులో... గ్రూప్‌-1 వ్యవహారంలో ఏపీపీఎస్సీ నిర్వాకంపై చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టిన వార్త కూడా ఉంది. పోలీసులకు ఏపీపీఎస్సీతో ఏం సంబంధం? ఇప్పుడు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న పీఎస్సార్‌ ఆంజనేయులు అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రస్తుతం మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కమిషన్‌ చైర్మన్‌గా ఉన్నారు. వీరిలో ఎవరికోసం ఈ ఐపీఎ్‌సల ఆరాటం?

లేఖపై సంతకాలు చేసింది వీరే..

1) పీవీ సునీల్‌ కుమార్‌-డీజీ అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ సంస్థ 2) ఎన్‌ సంజయ్‌-ఏడీజీ, సీఐడీ 3) కాంతి రాణా - పోలీస్‌ కమిషనర్‌, విజయవాడ సిటీ 4) పాలరాజు- ఇటీవల ఈసీ పక్కనబెట్టిన ఐజీ 5) కొల్లి రఘురామి రెడ్డి- డీజీ వీ అండ్‌ ఈ, డీజీ డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ 6) జీవీజీ అశోక్‌ కుమార్‌- ఐజీ, ఏలూరు రేంజ్‌ 7) సీహెచ్‌ విజయరావు- డీఐజీ కర్నూలు రేంజ్‌ 8)జి. కృష్ణకాంత్‌ - అవినాశ్‌ రెడ్డి అరె్‌స్టకు సీబీఐకి నో చెప్పిన కర్నూలు ఎస్పీ 9) విశాల్‌ గున్ని- డీఐజీ, విశాఖపట్నం రేంజ్‌ 10)జీఆర్‌ రాధిక- ఎస్పీ, శ్రీకాకుళం 11) అమ్మిరెడ్డి- డీఐజీ, అనంతపురం రేంజ్‌, 12) అన్బురాజన్‌- ఇటీవల ఈసీ తప్పించిన అనంత ఎస్పీ, 13) సిద్ధార్థ కౌశల్‌- ప్రస్తుతం కడప జిల్లా ఎస్పీ, 14) రిశాంత్‌ రెడ్డి- ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ 15) మేరీ ప్రశాంతి- ఎస్పీ, ఏలూరు 16) రఘువీర్‌ రెడ్డి- ఎస్పీ, నంద్యాల, 17) తిరుమలేశ్వర్‌ రెడ్డి- ఈసీ తప్పించిన నెల్లూరు ఎస్పీ, 18) పరమేశ్వర్‌ రెడ్డి- ఈసీ తొలగించిన ప్రకాశం ఎస్పీ, 19) జాషువా- ఈసీ తప్పించిన చిత్తూరు ఎస్పీ

Updated Date - Apr 07 , 2024 | 09:09 AM