గులక రాయి డ్రామాపై సీబీఐ విచారణ జరగాలి
ABN , Publish Date - Apr 18 , 2024 | 03:47 AM
ముఖ్యమంత్రి జగన్‌పై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన గులకరాయి దాడి డ్రామాపై సీబీఐతో విచారణ జరిపించాలని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ
కేసులో నన్ను ఇరికించేందుకు కుట్ర: బొండా ఉమ
విజయవాడ, ఏప్రిల్ 17: ముఖ్యమంత్రి జగన్‌పై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన గులకరాయి దాడి డ్రామాపై సీబీఐతో విచారణ జరిపించాలని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బొండా ఉమ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ‘గులకరాయి ఘటనపై గవర్నర్, సీఈసీకి ఫిర్యాదు చేశాం. సీఎంపై గులకరాయి దాడి ఘటనలో నన్ను అక్రమంగా ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారు. ఈ కేసును పూర్తిగా తప్పుదారి పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన కొంతమంది మైనర్లను అక్రమంగా తీసుకొచ్చారు. చిత్రహింసలు పెట్టి వారితో నా పేరు చెప్పించే ప్రయత్నం చేశారు. దీనివెనుక సజ్జల, వెలంపల్లి ఉన్నారు. జూన్ 4 తర్వాత ఏర్పడే మా ప్రభుత్వంలో గులకరాయి కేసులో అసలు నిందితులు ఎవరో బయటకు తెస్తాం. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సీఈసీకి, గవర్నర్‌కు లేఖలు ఇచ్చాం. కోడికత్తి డ్రామా, వివేకా హత్య కేసుల్లో వైసీపీ నాయకులు అడ్డంగా దొరికిపోవడంతో ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు గులకరాయి డ్రామా ఆడుతున్నారు. మైనర్లను హింసించినా ప్రయోజనం లేకపోవడంతో వడ్డెర కాలనీకి చెందిన నా పార్టీ కార్యాలయం వ్యవహారాలు చూసే టీడీపీ కార్యకర్త వేముల దుర్గారావును తీసుకెళ్లారు. హింసించి నా పేరు చెప్పించాలని చూస్తున్నారు. గులకరాయి దాడిలో నాకు కానీ, టీడీపీకి చెందిన వారికి కానీ ఎలాంటి సంబంధమూ లేదు. కావాలంటే మా ఫోన్ రికార్డులను తనిఖీ చేసుకోవచ్చు. నా ఇంటి వద్ద, కార్యాలయం వద్ద పోలీసులు నిఘా పెట్టారు. కాకినాడ, గుంటూరు నుంచి పోలీసు అధికారుల్ని పిలిపించి మరీ నన్ను ఎలా ఈ కేసులో ఇరికించాలో ఆలోచనలు చేస్తున్నారు. వైసీపీ బస్సు యాత్రకు జనసమీకరణ జరిపి, వచ్చిన వారికి డబ్బులు ఇవ్వకపోవడంతోనే రాయి విసిరామని మైనర్లు చెబుతున్నారని పోలీసులే లీకులు ఇస్తున్నారు. సీఎంపై రాయి దాడి ఘటనను ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో సహా అందరూ ఖండించారు. నిజమైన దోషులను గుర్తించి పట్టుకొనేందుకు మేం కూడా సహకరిస్తాం’ అని బొండా ఉమ స్పష్టం చేశారు.