ప్రతిపక్ష నేత హోదా చాన్సే లేదు
ABN , Publish Date - Jun 27 , 2024 | 02:08 AM
వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు. అందుకే జగన్ ప్రతిపక్ష నేత కాదు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమే’ అని రాష్ట్ర ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.

జగన్ వైసీపీకి ఫ్లోర్ లీడర్ మాత్రమే
ఏ సలహాదారు సూచనలతో లేఖ రాశారో: మంత్రి పయ్యావుల
అమరావతి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ‘వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు. అందుకే జగన్ ప్రతిపక్ష నేత కాదు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమే’ అని రాష్ట్ర ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశం లేదు. కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా రావడానికి పదేళ్లు పట్టింది. ఆ హోదా రావడానికి జగన్‌కూ ఓ పదేళ్లు పడుతుంది. ఆయనకు ఆప్తుడైన కేసీఆర్ కూడా 2019లో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. స్పీకర్‌కు లేఖ రాసిన జగన్ బెదిరించే ప్రయత్నం చేశారు. లేఖ రాసింది మీరే అయితే మీ వైఖరి మార్చుకోండి.. దాన్ని రాసింది సలహాదారులైతే వారిని మార్చుకోండి’ అని సూచించారు. ప్రజా తీర్పును జీర్ణించుకోలేని స్థితిలో జగన్ ఉన్నారనే విషయం స్పీకర్‌కు ఆయన రాసిన లేఖను బట్టి అర్థమవుతోందన్నారు. ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే తరహాలో లేఖ రాయడమేంటని మంత్రి నిలదీశారు.
వారి సలహాలతో మునిగిపోతారు
‘జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయం తీసుకుని తీర్పు ఇచ్చారు. వారి తీర్పును అంగీకరించాలి. అధికార పార్టీగా మేం హుందాగానే స్పందించి మంత్రులతో పాటు జగన్‌తోనూ ప్రమాణం చేయించాం. ప్రతిపక్ష హోదా కోసం ఏ సలహాదారు సూచనలతో ఆయన లేఖ రాశారో అర్థం కావడంలేదు. (ఆంధ్రప్రదేశ్ పేమెంట్స్, అండ్ శాలరీస్ యాక్ట్) జీతాలు, పెన్షన్లు ఇచ్చే యాక్ట్ ప్రకారం ప్రతిపక్ష హోదా వస్తుందని ఆయనకు ఏ పెద్దమనిషి సలహా ఇచ్చారో’ అని పయ్యావుల ఎద్దేవా చేశారు. ‘గతంలో అంతమంది సలహాదారులను పెట్టుకునే జగన్ ఇప్పుడు ఇక్కడిదాకా వచ్చారు. వారి సలహాలు తీసుకుంటే మునిగిపోతానని జగన్ గుర్తించాలి. జగన్ లేఖ మొదటి లైన్‌లోనే తప్పు ఉంది. ఓనమాలు కూడా చూడకుండా ఈ లేఖ ఎలా రాశారు? సభ్యుల ఓత్ అనేది సంప్రదాయం కాదు... రాజ్యాంగంలోని ఆర్టికల్ 188 ప్రకారం తప్పనిసరి. ప్రమాణ స్వీకారం చేశాకే సభ్యుడిగా గుర్తింపు పొందుతారు’ అని స్పష్టం చేశారు.
కొసరు అధికారం కోసం పాకులాట
‘దేశవ్యాప్తంగా అన్ని శాసనసభలు, పార్లమెంట్‌లో పాటించే నిబంధనలు జగన్ తెలుసుకోవాలి. ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వాలన్న దానిపై తొలి స్పీకర్ మౌలాలంకర్ నిర్దేశించారు. కేవలం మద్యం, ఇసుక ఖాతా పుస్తకాలనే చూడటం కాదు. అప్పుడప్పుడూ శాసనసభ, పార్లమెంటరీ నిబంధనలు ఉండే కౌల్ అండ్ షఖ్దర్ పుస్తకాలను కూడా జగన్ చూడాలి. సభ జరపడానికి కోరం ఎంతమంది ఉండాలో అంతమంది ఉంటే మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆ బుక్‌లో ఉంది. గతంలో చంద్రబాబును సభలో ఎంత హేళన చేశారో వీడియో తెప్పించుకుని చూడండి. మొన్నటి వరకూ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేం చిటికేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు. 10శాతం సభ్యులు కూడా లేకుండా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని గత శాసనసభ సాక్షిగా జగన్ తన నోటితోనే చెప్పారు. ఇప్పుడు ఆ నిబంధనే లేదు తూచ్ అంటారా? ప్రజలు అధికారం తీసేసినా కొసరు అధికారం కోసం పాకులాడుతున్నారు. అందరు సభ్యుల్లాగానే జగన్‌కూ మాట్లాడే అవకాశం కల్పిస్తామని సభ మొదటిరోజే చెప్పాం. ప్రతిపక్ష హోదా కావాలి... ప్రజా సమస్యల గురించి మాట్లాడతామని చెబుతున్నారు. ఇన్ని రోజులకు ప్రజా సమస్యలు గుర్తుకొచ్చాయా’ అని పయ్యావుల నిలదీశారు. జగన్ ఏదో ఒక వంకతో సభకు రాకూడదనే ప్రయత్నం చేస్తున్నారని చాలామంది చెబుతున్నారని, అందులో ఈ లేఖ భాగం కావొచ్చన్నారు. 11 సీట్లు పొందిన జగన్ ప్రతిపక్ష హోదా కావాలని, అది ఉంటేనే సభలో ప్రజా సమస్యల్ని సమర్థంగా వినిపించగలమని చెప్పడం అసంబంద్ధంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య విమర్శించారు.
ఎంఎ్‌సఎంఈలను ప్రోత్సహించాలి
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని రాష్ట్ర ఆర్థిక, వాణిజ్యపన్నుల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. బుధవారం వాణిజ్యపన్నుల శాఖ అధికారులతో ఆయన విజయవాడలో సమీక్ష నిర్వహించారు. వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో వస్తువుల అమ్మకం, వినిమయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. హైకోర్టులో ప్రత్యేక ట్యాక్స్ బెంచ్ ఏర్పాటుకు కృషి చేయాలని, రాబోయే 100 రోజుల్లో సాధించాల్సిన లక్ష్యాలను మంత్రి కేశవ్ అధికారులకు నిర్దేశించారు.