పరీక్షలున్నాయి.. బయటికి రావొద్దు మామా!
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:15 AM
సీఎం జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి నివాసాన్ని వదలి బయటకు వస్తున్నారంటే ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలు అల్లాడిపోవడం సర్వసాధారణం.

సీఎం పర్యటనలతో ఇంటర్ విద్యార్థులకు చుక్కలు
పరీక్షల కాలంలో సీఎం కోసం ట్రాఫిక్ ఆంక్షలు
సమయానికి చేరుకోలేక విద్యార్థుల పాట్లు
నిమిషం దాటినా పరీక్షకు అనుమతించని అధికారులు
ఈనెల 18 నుంచి టెన్త్ పరీక్షలు
అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి నివాసాన్ని వదలి బయటకు వస్తున్నారంటే ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలు అల్లాడిపోవడం సర్వసాధారణం. అయితే ఇది పరీక్షల సీజన్. ఏడాది పొడవునా విద్యార్థులు కష్టపడి చదివేది ఈ పరీక్షల కోసమే. ఆ సమయంలో ఎదురుయ్యే ఎలాంటి ఇబ్బందులైనా వారి భవిష్యత్తును తలకిందులు చేస్తాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఇంటర్, 10వ తరగతి విద్యార్థుల పరిస్థితి అలానే ఉంది. మంగళవారం సీఎం విశాఖపట్నం పర్యటనకు బయలుదేరారు. ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఆయన విజయవాడమీదుగా గన్నవరం వెళ్లారు. సీఎం భద్రత పేరుతో పోలీసులు చాలా ముందుగానే రహదారులను ఆంక్షలతో నింపేశారు. దీంతో ఇంటర్ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. సీఎం పర్యటనల గురించి తెలియని విద్యార్థులు రోజూలాగే బయలుదేరారు. సీఎం పర్యటన ఆంక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. అందులోనూ విజయవాడ నుంచి గన్నవరం వెళ్లే జాతీయ రహదారిపై ఎక్కువ ఇంటర్ కాలేజీలున్నాయి. అలాగే నగరంలోనూ ప్రధాన రహదారి వెంట ఉన్న కాలేజీలకు పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులు ట్రాఫిక్ ఆంక్షలతో ఇబ్బందులకు గురయ్యారు. కాగా, బుధవారం సీఎం జగన్ ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ను జాతికి అంకింతం చేసేందుకు వెళ్తున్నారు. దీనికి కూడా ఉదయం 9.30 గంటలకే ఆయన బయలుదేరుతారని ప్రభుత్వం తెలిపింది. బుధవారం ఫస్టియర్ విద్యార్థులకు మ్యాథ్స్ 1-ఎ, బోటనీ, సివిక్స్ పరీక్షలున్నాయి. మళ్లీ 7న సీఎం ఇడుపులపాయలో వైఎ్‌సఆర్ స్మారక పార్కు ప్రారంభోత్సవానికి వెళ్తున్నారు. ఆ రోజున సెకెండియర్ విద్యార్థులకు గణితం, బోటనీ, సివిక్స్ పరీక్షలున్నాయి. ఇక ఈనెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. మరోవైపు టెట్ పరీక్షలు ఈనెల 9 వరకు ఉన్నాయి. దీంతో అటు ఇంటర్ విద్యార్థులు, ఇటు టెట్ అభ్యర్థులు అందరినీ సీఎం పర్యటనలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
బయటకు రావొద్దని వేడుకోలు
టెన్త్ పరీక్షలు ఈనెలాఖరుతో ముగుస్తాయి. అప్పటివరకూ సీఎం జగన్‌ను తాడేపల్లి ఇంటి నుంచి బయటకు రావొద్దంటూ విద్యార్థులు వేడుకునే పరిస్థితి వచ్చింది. రాజకీయ సభలను, ఎన్నికల ముందు హడావిడి ప్రారంభోత్సవాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. సీఎం పర్యటనల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల సమయంలో ట్రాఫిక్ ఆంక్షలేంటంటూ మండిపడుతున్నారు. అయితే సీఎం భద్రత విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేమని పోలీసులు తేల్చేస్తున్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సీఎం జగన్ ఏ రోజు ఏ జిల్లాకు వెళ్తున్నారనే విషయాన్ని కనుక్కొని జాగ్రత్తపడాల్సిన దుస్థితి.