Share News

ప్రపంచం ఒక మాయాజాలం

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:25 AM

మన రాష్ట్రంలో జన్మించిన ఆచార్య నాగార్జునుడు తన నిశితమైన తార్కిక మేధస్సుతో పదునైన దార్శనిక, సైద్ధాంతిక వ్యూహాలను సృష్టించాడు.

ప్రపంచం ఒక మాయాజాలం

మన రాష్ట్రంలో జన్మించిన ఆచార్య నాగార్జునుడు తన నిశితమైన తార్కిక మేధస్సుతో పదునైన దార్శనిక, సైద్ధాంతిక వ్యూహాలను సృష్టించాడు. ‘‘ఈ ప్రపంచమంతా ఒక మాయాజాలం’’ అని ఆయన అన్నాడు. కలలలో కనిపించే వస్తువుల ఉనికి మాదిరిగా... ఈ ప్రపంచంలోని అన్ని వస్తువుల ఉనికి ఊహాజనితమే. మనం మేలుకొని ఉన్నప్పుడు కూడా కలలు కంటాం. అలాగే ఈ ప్రపంచాన్ని విశ్లేషిస్తే... అందులో ఏమీ లేదని తెలుస్తుంది. ప్రపంచం నిత్యం పరివర్తన చెందుతూ ఉంటుంది. ఇది ఏమాత్రం శాశ్వతం కాదు... ఇవీ ఆయన ప్రతిపాదనలు. ‘‘మరి కనిపించే ప్రపంచం మాట ఏమిటి? యదార్థమైన ఈ ప్రపంచంలో ఉంటూ, దాన్ని అనుభవిస్తూ, దాని అస్తిత్వాన్నే ఒప్పుకోకపోవడం సముచితమా?’’ అని కొందరు ప్రశ్నించవచ్చు. ప్రపంచం ఉన్నదనే మాట సత్యమే. కానీ అది పారమార్థికంగా లేదు. అందుకే ఆచార్య నాగార్జునుడి సిద్ధాంతానుసారం సత్యం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి: సంవృతి సత్యం... అంటే ఉపరితల సత్యం. రెండోది: పరమార్థ సత్యం... అంటే అంతిమ సత్యం. పారమార్థికంగా చూస్తే ‘ఈ ప్రపంచమంతా ఒక మాయాజాలం’ అని తెలుస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు... కలలో కనిపించే వస్తువుల్లా... ఈ ప్రపంచం ఊహాజనితం. ఈ ద్వివిధ సత్య సిద్ధాంత ప్రతిపాదనలో నాగార్జునుడు కీలక పాత్రను పోషించాడు. ఆ తరువాత మిగిలిన అద్వైతాది తాత్వికులు ఈ సిద్ధాంతంపై తమ జగన్మిధ్యావాదాన్ని నిర్మించారు.

ఈ ప్రపంచం ఏమిటి? ఇది కేవలం అసంపూర్ణ సంబంధాల సమాహారం. పదార్థాలకు వాటి గుణాలు తప్ప స్వతంత్రమైన ఉనికి లేనట్టే... ఈ ప్రపంచం కూడా కేవలం సంస్కారాల కలయిక మాత్రమే. ఈ లోకంలో సుఖం, దుఃఖం, బంధం, మోక్షం, ఉత్పత్తి, వినాశం, చలనం, విశ్రాంతి, అంతరిక్షం, సమయం లాంటివి మన భావనలు మాత్రమే. మానవులు తమ అశాశ్వత సౌధాన్ని నిర్మించడం కోసం సృష్టించిన నిరాధారమైన ఊహే ఈ ప్రపంచం. ప్రపంచం బయటకు శాశ్వతంగా కనిపిస్తున్నా తార్కికంగా విశ్లేషించినప్పుడు అబద్ధమని తేలుతుంది. ప్రపంచంలోని ఈ సంబంధ భాంధవ్యాలు ఏదో ఒకనాడు ఇసుకలాగా రాలిపోతాయి. అయితే సమాజంలో సత్ప్రవర్తన చాలా అవసరం. ఆ సత్ప్రవర్తనే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. దానికోసం సమాజాన్ని మనం నిలబెట్టాలి. ఈ విషయాలను ‘మాధ్యమిక కారిక’ గ్రంథంలో ఆచార్య నాగార్జునుడు చాలా స్పష్టంగా వివరించాడు. జగత్తు శక్తిని పరీక్ష చేసి, ఆ శక్తి ఉనికిని విశ్లేషించిన తరువాత... అది శూన్యరూపంలో ఉంటుందనే నిర్ధారణకు మాధ్యమికులు వచ్చారు. సృష్టి ఆవిర్భావాన్ని సరైన విచక్షణతో విశ్లేషిస్తే... దాని ఉనికిని నిరాకరించడం కుదరదు. కానీ ‘అంతా ఉంది’ అనుకోవడం ఒక తీవ్రత. ‘అన్నీ లేవు’ అనుకోవడం మరో తీవ్రత. ఈ రెండు తీవ్రతలనూ విడిచిపెట్టి... మధ్యమ మార్గంలో తన ధర్మాన్ని తథాగతుడు

బోధించాడు.

ఆచార్య చౌడూరి ఉపేంద్ర రావు,

జేఎన్‌యు, న్యూఢిల్లీ.

91 98189 69756

Updated Date - Jul 05 , 2024 | 12:25 AM