Share News

రాముడి నోటి మాటే.. ‘లేపాక్షి’!

ABN , Publish Date - Jan 17 , 2024 | 03:03 AM

అయోధ్య రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం ఆసన్నమైంది. ఈ సమయంలో రామాయణంతో సంబంధం ఉన్న లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రధాని మోదీ మంగళవారం సందర్శించారు.

రాముడి నోటి మాటే.. ‘లేపాక్షి’!

విజయనగర రాజుల కాలంలో నిర్మితం

ఆలయంలో అణువణువూ కళాఖండమే

పైకప్పు లోపలి వైపు తైలవర్ణ చిత్రాలు...

ప్రధాని రాకతో మరింత ప్రాచుర్యం!

అతి పెద్ద ఏక శిలా బసవయ్య విగ్రహం

నేటికీ మిస్టరీగానే వేలాడే స్తంభం

అయోధ్య రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం ఆసన్నమైంది. ఈ సమయంలో రామాయణంతో సంబంధం ఉన్న లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రధాని మోదీ మంగళవారం సందర్శించారు. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి లేపాక్షి ఆలయంపై పడింది. ప్రధాని రాకతో ఈ ఆలయం మరింత ప్రాచుర్యం పొందుతుందని భావిస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ కేంద్రానికి సుమారు 14కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయంలో అణువణువూ ఓ కళాఖండమే. క్రీ.శ. 1528 నుంచి క్రీ.శ. 1549 వరకు ఆలయ నిర్మాణం జరిగిందని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయంలో మొత్తం 878 స్తంభాలు ఉన్నాయి. ఇందులో 246 స్తంభాలపై శిల్ప కళాకృతులు అప్పటి శిల్ప నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యం. ఆలయం పైకప్పు లోపలివైపు గీసిన అద్భుతమైన తైలవర్ణ చిత్రాలను చూడటానికి రెండు కళ్లూ చాలవు. భారత, రామాయణ, శివపురాణాల్లోని ప్రముఖ ఘట్టాలను చిత్రీకరించారు. వీటిలోని డిజైన్లను నేటికీ కలంకారీ కళలో వాడుతున్నారు.

ఏడు ప్రాకారాల అద్భుత కట్టడం

లేపాక్షి వీరభధ్రస్వామి ఆలయం ఏడు ప్రాకారాలతో భారీ ఎత్తున నిర్మించారు. మొదటి ప్రాకారంలో గర్భగుడి, రెండో ప్రాకారంలో నాట్య కళామండపాలు ఉన్నాయి. మూడో ప్రాకారంలో ధ్వజస్తంభం కనిపిస్తుంది. మిగిలిన నాలుగు ప్రాకారాలు శిథిలమయ్యాయి. గర్భగుడికి పడమర దిశలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన నీటి కొలను ఉంది. ఆలయంలోని పెద్ద ఉగ్ర గణపతి విగ్రహం ఆకట్టుకుంటుంది. రెండో మహాద్వారాన్ని దాటితే నాట్యమంటపం వస్తుంది. దీనిని ఎనిమిది జతల ఉత్తమ అశ్వాలు కట్టిన రథంలా తీర్చిదిద్దారు. గుడికి పడమర దిశలో ఆంజనేయ మండపం ముందున్న బండపై నిరంతరం నీరు ప్రవహించే (సీతాదేవి పాదం) పాదం, తాండమేశ్వర లింగం మరో ఆకర్షణ. దేశంలో ఉన్న 108 శైవక్షేత్రాల్లో లేపాక్షి వీరభద్రాలయం ఒకటిగా చెబుతారు. వీరభద్రస్వామి ఉగ్రుడు కాబట్టి, ప్రవేశ ద్వారానికి కొంచెం పక్కన గర్భాలయాన్ని నిర్మించారు. దీనికి ఆగ్నేయ దిశలో ఉన్న ఎత్తయిన శివలింగానికి కవచంగా ఏడు శిరస్సులతో నాగేంద్రుడు మూడుసార్లు చుట్టుకొని ఉన్నట్లు దర్శనమిస్తాడు. ఆలయంలో నాట్యమండపం పైకప్పు నుంచి ఒక పెద్ద స్తంభం వేలాడుతూ ఉంటుంది. దీనినే అంతరిక్ష స్తంభం అని కూడా అంటారు. గర్భగుడి ముందు నేలకు తాకీ తాకనట్లుగా ఉండే ఈ స్తంభం ప్రత్యేక ఆకర్షణ. ఈ స్తంభం ఎలా వేలాడుతోందనే రహస్యాన్ని ఇప్పటికీ ఎవరూ ఛేదించలేకపోయారు. దీని కింద చేతి రుమాలుని ఇటు నుంచి అటు తీసుకోవచ్చు.

లేపాక్షి బసవయ్య రాజసం

లేపాక్షికి తూర్పు నుంచి ప్రవేశ మార్గంలోనే, ఆలయానికి ఈశాన్య దిశలో లేపాక్షి-హిందూపురం ప్రధాన రహదారికి ఆనుకొని అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహం ఉంటుంది. దీనిని ‘లేపాక్షి బసవయ్య’ అంటారు. బసవయ్య మెడలో పూసల హారాలు, గంటలు, రిక్కించిన చెవులు, లేవబోతూ కాలుని సరిచేసుకుంటున్న భంగిమ, మెడలో గండభేరుండ హారం, రాయలవారి రాజ ముద్రిక చూపరులను ఆకట్టుకుంటాయి. నందికి 29 గంటలు ఉన్న మెడపట్టీ, దానిపై 18 మువ్వల పట్టీ, దానిపై 27 రుద్రాక్షల మాలను చూస్తే.. సాక్షాత్తు బసవేశ్వరుడిని చూసినట్లే ఉంటుంది.

వైభవంగా లేపాక్షి ఉత్సవాలు

సినీరంగంలో మంచి గుర్తింపు పొందిన చిత్రాలకు లేపాక్షి నంది పురస్కారాలను అందజేస్తున్నారు. 2021లో ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో లేపాక్షి శకటాన్ని ప్రదర్శించారు. ఈ శకటంపై ఏకశిల నంది విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లేపాక్షి శిల్పకళ, ఆలయ విశిష్టతను తెలియజేసేందుకు కాంగ్రెస్‌ హయాంలో లేపాక్షి ఉత్సవాలు జరిపారు. గత టీడీపీ హయాంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకొని అత్యంత వైభవంగా మరోమారు ఉత్సవాలను జరిపించారు.

- హిందూపురం

సీతాపహరణాన్ని అడ్డుకునేందుకు యత్నించిన జటాయువు రెక్కలను రావణుడు ఖండించాడు. తన భార్య కోసం గాలిస్తూ ఆ మార్గాన వెళ్తున్న శ్రీరాముడికి కొన ఊపిరితో ఉన్న ఆ పక్షి కనిపించింది. గాయాలతో బాధపడుతున్న జటాయువును రాములవారు ‘లే.. పక్షీ..’ అన్నారు. అప్పటినుంచి ఆ ప్రాంతానికి ‘లేపక్షీ’ అనే పేరు వచ్చిందని, కాలక్రమేణా అది ’లేపాక్షి’గా మారిందని పురాణ గాథ.

విజయనగర రాజుల్లో ఒకరైన అచ్యుతరాయల వద్ద కోశాధికారిగా పనిచేసిన విరూపణ్ణ.... తన కులదైవమైన వీరభద్రుడి పేరుతో లేపాక్షి ఆలయాన్ని రాజు అనుమతి లేకుండా నిర్మించాడు. ఆయనంటే గిట్టనివారు ఈ విషయాన్ని రాజుకి చేరవేశారు. దీంతో రాజు విధించబోయే శిక్షను తనకు తానుగానే విరూపణ్ణ విధించుకున్నారు. తన రెండు కళ్లను పెకిలించుకుని, ఆలయ దక్షిణ భాగంలో ఉన్న గోడకేసి విసిరికొట్టాడట. ఇప్పటికీ ఆ గోడపై ఎర్రటి గుర్తులు కనిపిస్తాయి. అవి విరూపణ్ణ కంటి రక్తపు మరకలేనని విశ్వసిస్తారు. అలా ఆ ప్రాంతానికి లోప అక్షి (కళ్లు లేని) పేరు వచ్చిందని, కాలక్రమంలో అదే లేపాక్షి అయిందనీ చెబుతారు.

లేపాక్షి శిల్పసంపద మహాద్భుతం: మోదీ

వీరభద్ర స్వామికి స్వయంగా హారతి

హిందూపురం, జనవరి 16: భారతీయ చారిత్రక, పురాతన వైభవానికి లేపాక్షి నిదర్శనమని, ఇక్కడి శిల్పసంపద మహా అద్భుతమని ప్రధాని మోదీ అభివర్ణించారు. శ్రీసత్యసాయి జిల్లాలోని చారిత్రక, పర్యాటక కేంద్రం లేపాక్షిని మంగళవారం ఆయన సందర్శించారు. పుట్టపర్తి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు లేపాక్షికి చేరుకున్నారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన వీరభద్రస్వామి ఆలయానికి వెళ్లారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ స్వయంగా స్వామికి హారతి ఇచ్చారు. కాసేపు ధ్యానంలో కూర్చున్నారు. ఆలయ విశిష్టతను ఆయనకు అర్చకులు వివరించారు. ధర్మవరం మండలం నిమ్మలకుంట కళాకారులు ప్రధాని కోసం ప్రత్యేకంగా తోలుబొమ్మలాటను ప్రదర్శించారు. రామాయణంలోని జటాయువు ఘట్టాన్ని తోలుబొమ్మల ఆట ద్వారా వీక్షించిన మోదీ పరవశించిపోయారు. రంగనాథ రామాయణంలోని శ్రీరామ పట్టాభిషేకం, శ్రీరామ సంకీర్తనలను కళాకారులు ప్రదర్శించారు.

Updated Date - Jan 17 , 2024 | 03:03 AM