Share News

ఉచ్చు బిగుస్తోంది!

ABN , Publish Date - Aug 30 , 2024 | 04:57 AM

‘జగన్‌ ఆదేశించారు... మేం పాటిస్తాం’ అంటూ అడ్డగోలు పనులు చేసిన పోలీసు అధికారుల చుట్టూ బలంగా ఉచ్చు బిగుస్తోంది.

ఉచ్చు బిగుస్తోంది!

ముంబై నటి కేసుపై సర్కారు సీరియస్‌

విచారణాధికారిగా ఏసీపీ స్రవంతి రాయ్‌

నేడు విజయవాడకు కాదంబరి జెత్వానీ

వేధింపులపై వాంగ్మూలం ఇచ్చే అవకాశం

1నే ఏపీ పోలీసులపై ముంబైలో ఫిర్యాదు

అక్రమ అరెస్టుపై విచారణకు వినతి

తాజాగా బెజవాడ సీపీకి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు

‘నన్ను బ్లాక్‌మెయిల్‌ చేసి, బెదిరించి నా పొలాన్ని రాయించుకుంది’ అంటూ కాదంబరి జెత్వానీపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌రావు ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకు ఆధారంగా ఓ డాక్యుమెంట్‌ను కూడా ‘సృష్టించారు’. అసలు విషయం ఏమిటంటే.. 2018లో రాసుకున్నట్లుగా ఉన్న డాక్యుమెంట్‌పై.. 2020లో ముంబైలోని జుహూలో కాదంబరి కొన్న ఫ్లాట్‌ చిరునామా చూపించారు. అంతేకాదు... ఆ డాక్యుమెంట్‌ పేపర్‌ను స్టాంప్‌ వెండర్‌ నుంచి 2023లో కొన్నట్లు దానిపై స్పష్టంగా ఉంది. ఏపీ పోలీసులు తనపై పెట్టింది తప్పుడు కేసు అనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని కాదంబరి ప్రశ్నిస్తున్నారు.

(విజయవాడ - ఆంధ్రజ్యోతి)

‘జగన్‌ ఆదేశించారు... మేం పాటిస్తాం’ అంటూ అడ్డగోలు పనులు చేసిన పోలీసు అధికారుల చుట్టూ బలంగా ఉచ్చు బిగుస్తోంది. ముంబై నటి, వైద్యురాలు కాదంబరి జెత్వానీని తప్పుడు కేసులో ఇరికించి, ఆమె కుటుంబ సభ్యులనూ అరెస్టు చేసి, అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలు పెట్టిన కేసులో సీనియర్‌ ఐపీఎ్‌సల పాత్ర తేల్చేందుకు రంగం సిద్ధమైంది. రెండు తెలుగురాష్ట్రాలతోపాటు... ముంబైలో, సినీ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. అటు బాధితురాలు కాదంబరి కూడా అప్పటి ఏపీ పోలీసులపై ఈనెల 1వ తేదీనే కేసు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గురువారం విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబుకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు... ఆమె నేరుగా విజయవాడకు వచ్చేస్తున్నారు. గురువారం రాత్రి ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కాదంబరి... శుక్రవారం విజయవాడ చేరుకోనున్నారు. ఇక్కడ ఆమె పోలీసులు ఆమె వాంగ్మూలం నమోదు చేస్తారు. అదే సమయంలో తనను వేధించిన ఏపీ ఐపీఎ్‌సలపై ఆమె ఫిర్యాదు చేసే అవకాశముంది. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు విచారణాధికారిగా విజయవాడ ఏసీపీ కె.స్రవంతి రాయ్‌ని నియమించింది. డీజీపీ ఆదేశాల మేరకు విజయవాడ పోలీసు కమిషనర్‌ రాజశేఖర బాబు గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

అడ్డగోలుగా అరెస్టు...

నటి కాదంబరిపై కుక్కల విద్యాసాగర్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఫిర్యాదు చేయడం... ఆ మరుసటి రోజునే ముంబైలో ఏపీ పోలీసులు ఆమెను అరెస్టు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏపీలో తనను వేధించిన తీరుపై ఆగస్టు 1వ తేదీన ముంబై జుహూ పోలీసుస్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. ‘‘నన్ను, నా తల్లిదండ్రులను ఏపీ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి 3న అరెస్టు చేశారు. ఫిబ్రవరి 2న ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి, 24 గంటల్లోనే రోడ్డు మార్గాన విజయవాడ నుంచి ముంబై వచ్చి ఎలాంటి ఆధారాలు లేకున్నా అరెస్టు చేశారు. ఆ సమయంలో మా లాయర్‌ను కానీ, బంధువులను కానీ సంప్రదించే అవకాశం కల్పించలేదు. విజయవాడ తీసుకెళ్లిన తర్వాత కూడా మాకు లాయర్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వలేదు. మా అరెస్టు సమాచారాన్ని బంధువులకు తెలియజేశామని ఏపీ పోలీసులు చెప్పడం పెద్ద అబద్ధం. అలాగే... మా నివాసం నుంచి ఓ డాక్యుమెంట్‌ను రికవరీ చేశామని, దాని ఆధారంగానే అరెస్టు చేశామని చెబుతున్నారు. దానిని సృష్టించింది కూడా పోలీసులే. 2018లో అగ్రిమెంట్‌ చేసుకున్నట్లు ఆ డాక్యుమెంట్‌లో ఉంది. కానీ... అందులోని చిరునామా మాత్రం 2020లో నేను జుహూలో కొనుగోలు చేసిన ఫ్లాట్‌ది. అంతేకాదు... ఆ డాక్యుమెంట్‌ పేపర్‌ను 2023లో కొన్నారు. అది ఫోర్జరీ అని చెప్పేందుకు ఇవే నిదర్శనాలు’’ అని ఆ ఫిర్యాదులో కాదంబరి పేర్కొన్నారు.


విజయవాడ సీపీకి ఫిర్యాదు

కాదంబరి జెత్వానీ గురువారం విజయవాడ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబుకు ఆన్‌లైన్‌లో మరో ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ తనపైన, తన తల్లిదండ్రులపైన నమోదు చేసిన తప్పుడు కేసుపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. విద్యాసాగర్‌ తమపై తప్పుడు ఫిర్యాదు చేయగా దాని ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. విద్యాసాగర్‌ రాజకీయంగా తనకున్న సంబంధాలను ఉపయోగించి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి తప్పుడు కేసు పెట్టారని తెలిపారు.

నాలుగైదు రోజుల్లో విచారణ పూర్తి!

‘‘కాదంబరి జెత్వానీ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నాం. ఇందులో ప్రధానంగా ఐపీఎస్‌ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందనే అంశంపై దృష్టి పెట్టాం. బాధితురాలితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుంటాం. చీటింగ్‌ కేసులో నటితోపాటు ఆమె కుటుంబం మొత్తాన్ని ఎందుకు అరెస్టు చేశారో తెలియాలి. అరెస్టు చేసిన సమయంలో ఎవరెవరి పాత్ర ఎంత వరకు ఉందో దర్యాప్తులో తేలుతుంది. నాలుగైదు రోజుల్లో ఈ విచారణ పూర్తి చేస్తాం. ఈ కేసులో సాంకేతిక ఆధారాలను కూడా సేకరిస్తాం. ఐపీఎస్‌ల పాత్ర ఉన్నట్లు తేలితే డీజీపీ చర్యలు తీసుకుంటారు.’’

- ఎస్వీ రాజశేఖర్‌ బాబు, సీపీ విజయవాడ

Updated Date - Aug 30 , 2024 | 04:58 AM