Share News

అడ్డగోలు బదిలీలు

ABN , Publish Date - Mar 01 , 2024 | 03:06 AM

మున్సిపల్‌శాఖలో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ అడ్డగోలుగా తయారైంది. మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు ఇష్టారీతిగా చేపడతున్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో చేపట్టిన కమిషనర్ల బదిలీల ప్రక్రియతో మున్సిపల్‌ మంత్రి, ఉన్నతాధికారులు భారీగా సొమ్ము

అడ్డగోలు బదిలీలు

డబ్బులిస్తే చాలు..అర్హతలేనివారికి అందలం!

మున్సిపల్‌ శాఖలో నిబంధనలకు పాతర

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మున్సిపల్‌శాఖలో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ అడ్డగోలుగా తయారైంది. మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు ఇష్టారీతిగా చేపడతున్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో చేపట్టిన కమిషనర్ల బదిలీల ప్రక్రియతో మున్సిపల్‌ మంత్రి, ఉన్నతాధికారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీల పేరుతో ఇష్టం లేని వారిని నిబంధనలు తుంగలో తొక్కి.. ప్రాధాన్యం లేని పోస్టుల్లోకి విసిరిపారేస్తున్నారు. ఓ వైపు ఆ శాఖ మంత్రి, మరో వైపు మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారి ఇష్టారాజ్యంగా దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రెండు విడతలు మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు జరిగాయి. తమకు నచ్చనివారిని అప్రాధాన్య పోస్టుల్లో నియమిస్తూ.. నచ్చినవారిని అందలమెక్కిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు.

ఇవి కొన్ని ఉదాహరణలు..

తాడిపత్రిలో పనిచేస్తున్న స్పెషల్‌గ్రేడ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ను ఆముదాలవలస నగర పంచాయతీకి బదిలీ చేసి నిబంధనలను తుంగలో తొక్కారు. తమ వాడనుకున్న కాకినాడ కార్పొరేషన్‌ సెక్రటరీ మాత్రం పదోన్నతి ఇచ్చి మరీ అక్కడే కొనసాగించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను తుంగలో తొక్కి అధికారపార్టీ నేతల సిఫారసులతో బదిలీ చేయకుండా నిలిపేశారు. అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీల్లో కూడా బదిలీలు అడ్డగోలు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలు కార్పొరేషన్‌ నుంచి వైఎ్‌సఆర్‌ తాడిగడపకు బదిలీ చేయించుకునేందుకు ఓ కమిషనర్‌ పాతిక లక్షలు ఖర్చు పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. భీమవరం కమిషనర్‌ విషయంలో అయితే ఇష్టారీతిగా వ్యవహరించారు. ఓ ఎంపీడీఓను భీమవరం కమిషనర్‌గా నియమించి అక్కడి నుంచి విజయవాడకు బదిలీ చేశారు. ఆ తర్వాత విజయవాడ నుంచి భీమవరంకు బదిలీ చేశారు. డబ్బులిస్తే ఎవరిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా మున్సిపల్‌ శాఖలో బదిలీ చేయవచ్చన్న ఆరోపణలు వస్తున్నాయి. తాడేపల్లిగూడెం లాంటి సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీకి పశుసంవర్థకశాఖకు చెందిన ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ను నియమించారు. ఇతర శాఖల అధికారులపై ఉన్న ప్రేమ సొంత శాఖకు సంబంధించిన వారిపై ఉన్నతాధికారులకు, మంత్రికి లేదని మున్సిపల్‌ అధికారులు వాపోతున్నారు.

మున్సిపల్‌శాఖలో సమర్థులైన అధికారులు ఉన్నప్పటికీ ఆశాఖ ఉన్నతాధికారులు ఇతర శాఖల అధికారులపై ఎక్కడలేని అభిమానం చూపిస్తున్నారు. తమపట్ల శీతకన్ను వేసి.. సుమారు 40 మంది ఇతర శాఖల అధికారులను కమిషనర్లుగా తీసుకున్నారని, సొంత శాఖలో కమిషనర్లను ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించారని ఇక్కడి అధికారులు వాపోతున్నారు. ఇతర శాఖల అధికారులకైతే ఎలాంటి పోస్టులకైనా కొరత లేదని, సొంత శాఖ సిబ్బంది అంటే మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులకు చీదరింపుగా ఉందని ఆక్రోశిస్తున్నారు.

ఎన్నికల్లో లబ్ధికి అనర్హులకు పదోన్నతులు!

టౌన్‌ప్లానింగ్‌ అధికారుల పదోన్నతుల విషయంలో మున్సిపల్‌శాఖ అడ్డగోలుగా వ్యవహరించింది. సొమ్ములు తీసుకుని ఏకంగా అర్హత లేని వారికి పదోన్నతులు కల్పించిందని ఆరోపిస్తున్నారు. ఆరేళ్ల సర్వీసు ఉన్న అసిస్టెంట్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులను పదోన్నతిపై డిప్యూటీ డైరక్టర్లుగా నియమించాలని సర్వీసు రూల్స్‌ నిబంధనలు చెప్తున్నాయి. అయితే మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులు ఈ నిబంధనలకు తిలోదకాలిచ్చారు. కొద్దిమంది అసిస్టెంట్‌ డైరెక్టర్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు రెండేళ్ల సర్వీసు మాత్రమే ఉన్నప్పటికీ వారికి పదోన్నతి కల్పించాలని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఆరేళ్ల సర్వీసును రెండేళ్లకు తగ్గించి మరీ పదోన్నతులు కల్పించేందుకు మున్సిపల్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అనుమతించారు. ఇది సర్వీసు నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ఉత్తర్వులు జారీచేశారు. రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న అసిస్టెంట్‌ డైరెక్టర్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు బి.గురవారెడ్డి, కేఆర్‌ మధు, ఈ.బాలాజీ, జి.రామకృష్ణుడు, ఎన్‌.హరిబాబు, జెడ్‌ సుధాకర్‌లను డీడీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులుగా అడహాక్‌ పదోన్నతులు కల్పించాలని మున్సిపల్‌శాఖ మెమో జారీచేసింది. అయితే ఈ విధానం మిగతా వారికి వర్తించదని, కేవలం వారికి మాత్రమేనని మెమోలో పేర్కొనడం గమనార్హం. ఇటీవలనే జీవీఎంసీ నుంచి పార్వతీపురానికి బదిలీ అయిన ఓ అధికారిని మళ్లీ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలనే సాకు చూపించి చీరాలకు మార్చారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నరసరావుపేటలో బదిలీలు వైసీపీ నేతల ఇష్టారీతిగా చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న కమిషనర్‌ ఎం.రామ్మోహన్‌రావును ఇటీవల బదిలీ చేశారు. ఆయన జూన్‌లో ఇక్కడ కమిషనర్‌గా చేరారు. ఎన్నికల్లో వైసీపీకి సహకరించరన్న ఉద్దేశంతో అధికారపార్టీ నేతలు ఆయనను బదిలీ చేయించారు. ఆయన స్థానంలో ఆడిట్‌ అధికారిని నియమించారు.

‘డబ్బులిస్తే ఎవరిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేస్తారు.. నచ్చినవారికి అందలమెక్కించి అందినకాడికి దండుకుంటున్నారు.. ప్రధానంగా ఎన్నికల ప్రక్రియలో పట్టణాల్లో కీలకంగా ఉన్న అధికారులను అవసరమైన చోట్ల వైసీపీ ఆదేశాలతో ఇష్టారీతిగా బదిలీ చేస్తున్నారు.. ఓటర్ల జాబితాలను తారు మారు చేసేందుకు తమకు అనుకూలమైన అధికారులను నియమించి అడ్డగోలుగా పదోన్నతులు కల్పిస్తున్నారు.. అధికారపార్టీ నేతలు కావాలనుకుంటే.. అర్హత లేని సీనియర్‌ అసిస్టెంట్లను, ఆడిట్‌ అధికార్లను కమిషనర్లుగా నియమిస్తున్నారు’.. ఇవీ మున్సిపల్‌శాఖపై వస్తున్న ఇబ్బడిముబ్బడి ఆరోపణలు!! నిజమే.. తాడేపల్లిగూడెం లాంటి సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీకి పశుసంవర్థకశాఖకు చెందిన ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ను కమిషనర్‌గా నియమించారంటే.. బదిలీల్లో ప్రభుత్వం ఏ మేరకు నిబంధనలు అనుసరించిందో.. పై ఆరోపణలను బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు!!

Updated Date - Mar 01 , 2024 | 09:39 AM