Share News

పట్టణం పసుపుమయం

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:44 AM

సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మిగనూరు పట్టణం పసుపు మయంగా మారింది.

పట్టణం పసుపుమయం

ఎమ్మిగనూరులో టీడీపీకి రికార్డు మెజారిటి

ప్రభావం చూపని బుట్టా చేనేత కార్డ్‌..

ఎమ్మిగనూరు, జూన్‌5: సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మిగనూరు పట్టణం పసుపు మయంగా మారింది. పట్టణ ఓటర్లు టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డికి భారీ మెజార్టీని కట్టబెట్టారు. పట్టణంలోని 83 బూతుల్లో టీడీపీకి మెజార్టీ దక్కగా కేవలం 10 బూతుల్లోనే వైసీపీ స్వల్ప మెజార్టీ సాధించింది. టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డికి పట్టణంలో 35,016ఓట్లు పోలవ్వగా, వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకకు 21,207 ఓట్లుమాత్రమే వచ్చాయి. దీంతో మునుపెన్నడూ లేని విధంగా పట్టణంలో 13,809 ఓట్ల మెజార్టీని టీడీపీ సాధించింది. ఇక నందవరం మండలంలో టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డికి 19507 ఓట్లు పోలవ్వగా, వైసీపీ అభ్యర్థికి బుట్టారేణుకకు 17,126 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఇక్కడ 2,381 ఓట్ల మెజార్టీని టీడీపీ సాధించింది. అలాగే గోనేగండ్ల మండలంలో టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి 25,222 ఓట్లు పోలవ్వగా, వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకకు 22,499 ఓట్లు పోలవ్వగా 2728 ఓట్లు మెజార్టీని టీడీపీ సాధించింది. ఇక ఎమ్మిగనూరు మండలంలో వైసీపీని మెజార్టీని టీడీపీ భారీగా అడ్డుకుంది. ఎమ్మిగనూరు మండలంలో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకకు 25,565 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డికి 21,462 ఓట్లు పోలయ్యాయి. దీంతో వైసీపీ 4,103 ఓట్ల మెజార్టీని మాత్రమే సాధించింది.

ప్రభావం చూపని చేనేత కార్డు

చేనేతలు అధికంగా ఉన్న ఎమ్మిగనూరులో చేనేత ఓట్లు రాబట్టడానికి వైసీపీ చేనేత అభ్యర్థి బుట్టా రేణుకను రంగంలోకి దింపింది. అయితే, ఆమె పట్టణంలోని చేనేతలపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఎప్పటి లాగానే చేనేతలు బీవీ కుటుంబానికి మరోసారి అండగా నిలిచాయి. చేనేత వార్డుల్లో బీవీకి పూర్తి ఆధిక్యత లభించింది. దీంతో వైసీపీ వేసిన చేనేత కార్డు పాచిక పూర్తిగా విఫలమయ్యింది.

మొదటి రౌండ్‌ నుంచి బీవీ ఆధిక్యత

ఎమ్మిగనూరు అసెంబ్లీ ఓట్ల లెక్కింపు మంగళవారం కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటిలో జరిగింది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 2,47,752 మంది ఓటర్లు ఉండగా 2,03,086 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 14 టేబుళ్లలో 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఇందులో టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆది నుంచి ఆదిఖ్యతను కనబరిచారు. 20రౌండ్లలో 14 రౌండ్లలో బీవీకి మెజారిటీ రాగా, కేవలం 6రౌండ్లలో మాత్రమే వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకకు మెజార్టీ వచ్చింది. దీంతో బీవీ జయనాగేశ్వరరెడ్డి 14,816ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ప్రజా గళాన్ని వినిపిస్తా : బీవీ

శాసనసభలో నియోజకవర్గ ప్రజల సమస్యలపై తనగళాన్ని వినిపిస్తానని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా బీవీ భారీ విజయం సాధించడంతో నియోజకవర్గంలోని ఆయా మండలాలు, గ్రామాల నుంచి బుధవారం టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బీవీ నివాసానికి తరలివచ్చి పూలమాలలతో ముంచెత్తి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీవీ విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ పాలనలో అన్నివర్గాలు ఇబ్బంది పడ్డాయన్నారు. నవరత్నాలు అన్న జగన్‌కు పదోరత్నాన్ని ప్రజలు అందించారని ఎద్దెవచేశారు. చంద్రబాబు, లోకేశ్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని ఎమ్మిగనూరు ప్రజలు నిల బెట్టారని కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా పల్లెనిద్రలు, వార్డు పర్యటనల ద్వారా తెలుసుకున్న సమస్యలను స్థానిక మేనిఫెస్టోను రూపొందించి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పరిష్కారానికి శ్రీకారం చుడతానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, ఇక రాష్ర్టానికి అన్నీ మంచిరోజులేనని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్డీఏ కూటమికి గొప్పవిజయాన్ని అందించారన్నారు. తన తండ్రి దివంగతనేత మాజీ మంత్రి బీవీ మోహన్‌ రెడ్డి ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా ఎమ్మిగనూరు అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 12:44 AM