Share News

గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు

ABN , Publish Date - Oct 30 , 2024 | 04:17 AM

గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకూ పుష్కరాలు నిర్వహించనున్నారు.

గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు

2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహణ

8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా

ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో ప్రతిపాదలు

రాజమహేంద్రవరం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకూ పుష్కరాలు నిర్వహించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో మంగళవారం పుష్కరాల నిర్వహణపై తొలి సమావేశం జరిగింది. మంత్రి కందుల దుర్గేశ్‌, ఎంపీ పురందేశ్వరి ఈ సమావేశంలో మాట్లాడారు. పుష్కరాలకు సుమారు 8 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నారు. సుమారు రెండున్నరేళ్ల కంటే ఎక్కువ సమయం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటి నుంచే రంగంలోకి దిగారు. అఖండ గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్‌ ప్లాన్‌ కూడా సిద్ధమైంది. అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా వేశారు. మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు. యాత్రికుల బస ఏర్పాట్లపై చర్చించారు. రాజమహేంద్రవరం పరిఽధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదించారు. కార్పొరేషన్‌ రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. సిటీ బ్యూటిషికేషన్‌, ఐకానిక్‌ టూరిజం సైట్‌ ప్రాజెక్టు కోసం రూ.75 కోట్లతో ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్‌, కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 04:17 AM