Share News

పోలీసులు చోద్యం చూస్తున్నారా..!

ABN , Publish Date - May 16 , 2024 | 03:50 AM

వైసీపీ రౌడీ మూకలు ఇష్టానుసారం పెట్రేగిపోయి దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా? అంటూ తెలుగుదేశం పార్టీ మండిపడింది.

పోలీసులు చోద్యం చూస్తున్నారా..!

ఓటమి మంటతో వైసీపీ బరితెగింపు దాడులు

2 రోజులు... 25 నియోజకవర్గాలు... 119 సంఘటనలు

పోలీస్‌ వ్యవస్థ ప్రక్షాళన తక్షణ అవసరం: టీడీపీ

బాధితుల పరామర్శకు కమిటీ ఏర్పాటు చేసిన చంద్రబాబు

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): వైసీపీ రౌడీ మూకలు ఇష్టానుసారం పెట్రేగిపోయి దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా? అంటూ తెలుగుదేశం పార్టీ మండిపడింది. ఎన్నికల్లో ఓడిపోతున్నామన్న మంటతో వైసీపీ నేతలు బరితెగించి దాడులు చేస్తున్నారని, సీఎం జగన్‌కు బంట్రోతుల్లా తయారైన కొందరు పోలీసు అధికారులు ఆయన ఇంట్లో కూర్చుని వైసీపీ నేతలను రెచ్చగొడుతున్నారని ఆ పార్టీ ఆరోపించింది. బుధవారం ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, దేవినేని ఉమా మహేశ్వరరావు, నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి విలేకరులతో మాట్లాడారు. ‘టీడీపీ ఓటర్లు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకోవడానికి పోలింగ్‌ రోజే వైసీపీ నేతలు అనేకచోట్ల అరాచకం సృష్టించారు. పోలింగ్‌కు వెళ్తున్న మహిళల తల పగలగొట్టారు. పోలింగ్‌ తర్వాత మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వందల మంది రౌడీలను వెంటేసుకొని రాడ్లు, కర్రలతో స్వైర విహారం చేస్తుంటే పోలీస్‌ శాఖ ఏం చేస్తోంది? కాళ్లు విరగ్గొట్టి ఎందుకు లోపల పడేయలేదు? చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీని ఏకంగా హత్య చేయడానికి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు ప్రయత్నం చేశారు. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తానొక ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకొని బీభత్సం చేస్తుంటే డీఎస్పీ చైతన్య ఆయనకు ఎస్కార్ట్‌ మాదిరి తిరుగుతున్నాడు. ఈ రెండు రోజుల్లో రాష్ట్రంలో 25 నియోజకవర్గాల్లో 119 సంఘటనలు జరిగాయి. వీటిపై పార్టీపరంగా ఒక కమిటీని అధినేత చంద్రబాబు నియమించారు. మేం అందరం దాడులు జరుగుతున్న అన్ని నియోజకవర్గాలు పర్యటించి బాధితులను కలసి పరామర్శించి ధైర్యం చెప్పబోతున్నాం’ అని వర్ల రామయ్య చెప్పారు.

ముందే హెచ్చరించాం: లావు

గడచిన రెండు రోజులుగా రాష్ట్రంలో పరిణామాలు చూస్తే పోలీస్‌ వ్యవస్థ ప్రక్షాళన తక్షణ అవసరమని ఎంపీ లావు కృష్ణదేవ రాయలు పేర్కొన్నారు. ‘గత ఐదేళ్లుగా డీజీపీ తన పని తాను చేయడం లేదు. గురజాల నియోజకవర్గం మాదినపాడులో ఈరోజు ఒక హత్య జరిగింది. అదనపు బలగాలు ఎటు పోయాయో తెలియదు. మాచర్లలో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో కారంపూడిలో వైసీపీ ఎమ్మెల్యే ప్రైవేటు సైన్యం కవాతుతో ప్రపంచం చూసింది. వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ రెచ్చగొట్టే చర్యలు మానాలని నా విజ్ఞప్తి’ అని లావు అన్నారు. ‘మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే సోదరులు ప్రైవేటు సైన్యాన్ని సమీకరిస్తున్నారని టీడీపీ నేతలు పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చినా కదలలేదు. ఆ తర్వాత కారంపూడిలో విధ్వంసం చోటు చేసుకొంది’ అని నక్కా ఆనందబాబు ఆరోపించారు. పల్నాడు మర్చిపోయిన ఫ్యాక్షనిస్టు వాతావరణాన్ని వైసీపీ నేతలు మళ్లీ కల్పించాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. ‘వైసీపీ మూకల బరితెగింపు, రక్త దాహానికి అమాయకులు బలవుతున్నారు. రాష్ట్రంలో చెలరేగిన హింసపై ఎన్నికల కమిషన్‌ దర్యాప్తు చేయాలి’ అని దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

Updated Date - May 16 , 2024 | 07:10 AM