Share News

పోలవరం నిర్మాణ బాధ్యత రాష్ట్రానిదే

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:06 AM

పోలవరం.. జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ దాన్ని నిర్మించే బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదేనని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ స్పష్టం చేశారు.

పోలవరం నిర్మాణ బాధ్యత రాష్ట్రానిదే

డబ్బులివ్వడం వరకే మా బాధ్యత: కేంద్రం

2021 నుంచి పెట్టిన ఖర్చును ఏపీకి చెల్లించాం

రాజ్యసభకు తెలిపిన కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌

టీడీపీ సభ్యుడు కనకమేడల ప్రశ్నకు సమాధానం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): పోలవరం.. జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ దాన్ని నిర్మించే బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదేనని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ స్పష్టం చేశారు. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సోమవారం సమాధానమిచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బాధ్యత నూటికి నూరు శాతం నిధులు మంజూరు చేయడం వరకేనన్నారు. ఏపీ ప్రభుత్వం 2021 నుంచి పెట్టిన ఖర్చును కేంద్రం తిరిగి చెల్లించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా కేంద్రానికి పంపుతుందని వివరించారు. 2020లో వచ్చిన భారీ వరదల వల్ల పాక్షికంగా నిర్మించిన అప్పర్‌ కాఫర్‌ డామ్‌ ద్వారా నీరు ప్రవేశించి డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నదని మంత్రి తెలిపారు. ఎన్‌హెచ్‌పీసీ దీనిపై సాంకేతిక సమీక్ష జరిపిందని, అంతర్జాతీయ డిజైన్‌ ఏజెన్సీలను కూడా సంప్రదించిందని చెప్పారు. వారి సూచనల మేరకు కేంద్ర జలవనరుల సంఘం ఆమోదించిన డిజైన్‌ ప్రకారం ఏపీ ప్రభుత్వం డయాఫ్రం వాల్‌ ను పునరుద్ధరిస్తుందన్నారు. అయితే, పోలవరం ఎప్పటికి పూర్తవుతుందని కనకమేడల అడిగిన ప్రశ్నకు మాత్రం మంత్రి సమాధానం ఇవ్వలేదు.

Updated Date - Feb 06 , 2024 | 04:06 AM