Share News

కుక్కలు చింపిన విస్తరిలా రాష్ట్రం

ABN , Publish Date - Jun 03 , 2024 | 03:40 AM

సీఎం జగన్మోహన్‌రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ఆర్థికంగా రాష్ట్రాన్ని చెత్త కుప్పగా మిగిల్చి వెళ్తున్నారు. ఇంత ఘోరమైన పాలనను ఉమ్మడి పాలనలో కూడా ఏనాడూ చూడలేదు’

కుక్కలు చింపిన విస్తరిలా రాష్ట్రం

రోజుకు వడ్డీ 90 కోట్లు

జగన్‌ పాలన దేశానికో కేస్‌ స్టడీ: నీలాయపాలెం

అమరావతి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): ‘సీఎం జగన్మోహన్‌రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ఆర్థికంగా రాష్ట్రాన్ని చెత్త కుప్పగా మిగిల్చి వెళ్తున్నారు. ఇంత ఘోరమైన పాలనను ఉమ్మడి పాలనలో కూడా ఏనాడూ చూడలేదు’ అని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ఆదివారం ఇక్కడ ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్‌ విలేకరులతో మాట్లాడారు. ‘తెచ్చిన అప్పుల కింద ప్రస్తుతం రోజుకు రూ.90 కోట్లు వడ్డీ కింద చెల్లించాల్సి వస్తోంది. రాబోయే రోజుల్లో కేవలం వడ్డీ భారం మరో ఏభై శాతం పెరగబోతోంది. జగన్‌ ఇంటికి వెళ్లడం ఖాయం. అది ఖరారై పోయింది. ఆయన పోతూపోతూ మిగిల్చిన రాష్ట్రాన్ని చూస్తేనే ఆవేదన దహించి వేస్తోంది. ఐదేళ్లు చంద్రబాబు చాకిరీ చేసి ఆర్థికంగా ఒక దశకు కొత్త రాష్ట్రాన్ని చేరిస్తే... జగన్‌ దానిని అథఃపాతాళానికి చేర్చారు. మళ్లీ చంద్రబాబు సున్నా నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్ధితి నెలకొంది. ఇప్పుడు అధికారికంగా, అనధికారికంగా నెలకు రూ.6,000 కోట్ల అప్పులు చేస్తున్నారు. వడ్డీ కింద నెలకు రూ.2,700 కోట్లు కడుతున్నారు. జగన్‌ ఇప్పటివరకూ ధారాళంగా తెస్తున్న అప్పులకు వడ్డీ చెల్లింపులు మొదలైతే రోజుకు చెల్లించాల్సిన వడ్డీలు రూ.130 కోట్ల వరకూ చేరతాయి. ఈ ఏడాది మార్చి నెలలో వడ్డీ కింద రూ.28,000 కోట్లు వడ్డీ కింద కట్టాల్సి వచ్చింది. ఇదంతా కేవలం రిజర్వు బ్యాంకు నుంచి తెచ్చి అప్పుల కింద చెల్లించిన మొత్తం. వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు తేవాల్సిన పరిస్థితిని జగన్‌ సృష్టించి వెళ్తున్నారు. ఆదాయం పెరగడానికి అప్పులు తేవడం ఒకటే మార్గమని నమ్మి దాని కోసమే జగన్‌ ప్రభుత్వం పని చేసింది. ఆర్థికంగా రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మిగిలింది. ఒక రాష్ట్రాన్ని ప్రభుత్వమే ఎలా కుప్పకూలుస్తుందో చెప్పడానికి జగన్‌ పాలన దేశానికి ఒక కేస్‌ స్టడీగా మిగులుతుంది’ అని విజయకుమార్‌ అన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 03:40 AM