Share News

‘దుకాణం’ మాదే!

ABN , Publish Date - Oct 08 , 2024 | 05:00 AM

ఆ మండలంలో షాపులు మాకు వదిలేయండి. అక్కడ మావాళ్లు దరఖాస్తు చేస్తున్నారు. ఇంకెక్కడైనా చూసుకోండి’... ఎన్టీఆర్‌ జిల్లాలో ఓ సీనియర్‌ నాయకుడి సున్నితమైన హెచ్చరిక ఇది.

‘దుకాణం’ మాదే!

మద్యం షాపులపై ఎమ్మెల్యేలు, నేతల పెత్తనం

అనుచరులు, సిండికేట్లతోనే దరఖాస్తులు

ఇతరులు వేయకుండా బెదిరింపులు

వేస్తే వ్యాపారం చేయలేరని హెచ్చరికలు

తీసుకోవద్దంటూ అధికారులపైనా ఒత్తిడి

కొన్నిచోట్ల ‘వాటా’ కండిషన్‌తో అనుమతి

లక్ష దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్‌ అంచనా

ఇప్పటి వరకూ వచ్చింది 20 వేలు మాత్రమే

నేతల ప్రమేయంతో సర్కారు ఆదాయానికి గండి

మరో 2 రోజులే దరఖాస్తులకు గడువు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘ఆ మండలంలో షాపులు మాకు వదిలేయండి. అక్కడ మావాళ్లు దరఖాస్తు చేస్తున్నారు. ఇంకెక్కడైనా చూసుకోండి’... ఎన్టీఆర్‌ జిల్లాలో ఓ సీనియర్‌ నాయకుడి సున్నితమైన హెచ్చరిక ఇది.

‘దరఖాస్తు పెట్టుకోండి. లాటరీలో లైసెన్స్‌ వస్తే వ్యాపారంలో 5 శాతం వాటా ఇవ్వాలి’.. నెల్లూరు జిల్లాలో ఓ నేత దందా ఇది.

ప్రైవేటు మద్యం షాపుల దరఖాస్తు ప్రక్రియలో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు సాగిస్తున్న బెదిరింపుల పర్వం ఇది. ఒత్తిళ్లు, బెదిరింపులతో చాలామంది వ్యాపారులు ‘మాకెందుకీ తలనొప్పని’ దరఖాస్తు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో ఎక్సైజ్‌ శాఖ అంచనా మేరకు దరఖాస్తులు రావడం లేదు. ఒక్కో షాపునకు సగటున 30 దరఖాస్తులు వస్తాయని అధికారులు భావించగా, చాలా చోట్ల సింగిల్‌ డిజిట్‌ దాటడం లేదు. 2017లో పాలసీ ప్రకటించినప్పుడు 75వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు దాదాపు లక్ష వస్తాయని ఎక్సైజ్‌ శాఖ అంచనా వేసింది. ఆ స్థాయిలో దరఖాస్తులు అందితే రూ.2 వేల కోట్ల ఆదాయం దరఖాస్తు రుసుముల రూపంలోనే వస్తుంది. ప్రస్తుతం 20 వేల దరఖాస్తులే వచ్చాయి. దీన్ని బట్టి ఎమ్మెల్యేలు, నేతల బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దరఖాస్తులకు మరో రెండు రోజుల గడువు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు, నాయకుల ప్రమేయం ఇలాగే కొనసాగితే అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వస్తాయా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశముంది.

సగటున 6 దరఖాస్తులు

మద్యం షాపులకు సోమవారం సాయంత్రానికి 20,310 దరఖాస్తులు వచ్చాయి. సగటున ఒక్కో షాపునకు 6 దరఖాస్తులు అందాయి. కాకినాడలో 155 షాపులుంటే 592 దరఖాస్తులే వచ్చాయి. అంటే సగటున 4 దరఖాస్తులు కూడా రాలేదు. తిరుపతి జిల్లాలో 227 షాపులకు 680.. ప్రకాశంలో 171 షాపులకు 622, నెల్లూరులో 182 షాపులకు 650 దరఖాస్తులు అందాయి. ఈ జిల్లాల్లో మరీ తక్కువ దరఖాస్తులు రావడంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఓ వైపు ఎమ్మెల్యేల ఒత్తిడి, మరోవైపు భారీగా పెంచిన దరఖాస్తు రుసుము.. రూ.2 లక్షలు కావడంతో దరఖాస్తుదారులు కొంత వెనకడుగు వేస్తున్నారు.

పర్మిట్‌రూమ్‌ ప్రభావం

మద్యం షాపు పక్కనే మందు తాగేందుకు గతంలో పర్మిట్‌ రూమ్‌ అనే విధానం ఉండేది. నూతన పాలసీలో పర్మిట్‌ రూమ్‌కు అనుమతి ఇవ్వలేదు. పర్మిట్‌ రూమ్‌కు అవకాశం ఇచ్చి ఉంటే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చేది. పర్మిట్‌ రూమ్‌ కోసం అదనంగా రూ.5 లక్షలు చెల్లించాలి. అవకాశం ఇస్తే ప్రతి షాపులో ఇది ఏర్పాటు చేస్తారు. దీనివల్ల అమ్మకాలు పెరుగుతాయి. అలాగే పర్మిట్‌ రూమ్‌లో వాటర్‌ ప్యాకెట్లు, గ్లాసులు, ఇతరత్రా తినుబండారాలు విక్రయించడం ద్వారా లైసెన్సీకి అదనపు ఆదాయం వచ్చేది. పర్మిట్‌ రూమ్‌లకు అవకాశం ఇచ్చి ఉంటే దరఖాస్తుల సంఖ్య పెరిగేదన్న వాదన వినిపిస్తోంది.

పెట్టుబడులకు ఆసక్తి ఉన్నా...

ఐదేళ్ల తర్వాత ప్రైవేటు మద్యం పాలసీ ప్రకటనతో వ్యాపారులతో పాటు పెట్టుబడి పెట్టగలిగే సాధారణ వ్యక్తుల్లోనూ షాపులపై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ స్థానిక రాజకీయాలు, సిండికేట్ల వ్యవహారంతో వెనకడుగు వేస్తున్నారు. అదృష్టం బాగుండి లైసెన్స్‌ వచ్చినా స్థానిక నేతలు, సిండికేట్లను కాదని వ్యాపారం చేయగలమా? అనే సందిగ్ధంలో పడ్డారు.

నూతన మద్యం పాలసీని పారదర్శకంగా అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. దోపిడీ, అక్రమాలకు తావు లేకుండా విధి విధానాలు రూపొందించింది. ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేటు షాపులకు దరఖాస్తులు ఆహ్వానించింది. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు దరఖాస్తుల ప్రక్రియను అవకాశంగా తీసుకుని దందాలు చేస్తున్నారు.

చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, నేతలు తమ అనుచరులు, బినామీలకే మద్యం షాపులు దక్కేలా చక్రం తిప్పుతున్నారు. తమ వారిని సిండికేట్‌గా చేసి, ఇతరులు ఎవరూ దరఖాస్తు చేయకుండా బెదిరిస్తున్నారు. మరోవైపు దరఖాస్తులు తీసుకోవద్దంటూ అధికారులపైనా ఒత్తిడి చేస్తున్నారు. మరికొన్ని చోట్ల వాటాలు మాట్లాడుకుంటున్నారు. దీంతో దరఖాస్తు చేయడానికి వ్యాపారులు భయపడుతున్నారు. నేతల తీరుతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడే పరిస్థితి కనిపిస్తోంది.

నేడు, రేపు దరఖాస్తులు

సోమవారం ఒక్కరోజే దాదా పు 12 వేల దరఖాస్తులు రావడంతో మంగళ, బుధవారాల్లో దరఖాస్తుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా మద్యం పాలసీల్లో ఎప్పుడూ చివరి రోజు ట్రెండ్‌ ఉంటుంది. ఎక్కడ ఎన్ని దరఖాస్తులు వచ్చాయని లెక్కలు బేరీజు వేసుకుని పోటీ తక్కువగా ఉన్న చోట్ల దరఖాస్తు వేయాలని వ్యాపారులు భావిస్తుంటారు. చివరి రెండు రోజుల వరకు వేచిచూసి ఒకేసారి అందరూ దరఖాస్తు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోందని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే రాజకీయ ప్రమేయం లేకపోతే ఈ పాటికే ఇంకా ఎక్కువ దరఖాస్తులు వచ్చేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బెదిరింపుల పర్వం

ఎన్టీఆర్‌ జిల్లాలో ఓ ఎమ్మెల్యే 20 మందిని సిండికేట్‌ చేసి వారితోనే దరఖాస్తులు వేయిస్తున్నారు. ఇతరులు వేయకుండా బెదిరిస్తున్నారు.

కృష్ణా జిల్లాలో ఓ యువ ఎమ్మెల్యే కొత్తవారు ఎవరైనా దరఖాస్తులు వేస్తే పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారు. షాపు వచ్చినా వ్యాపారం చేయడం కష్టమని హెచ్చరిస్తున్నారు.

విజయవాడను ఆనుకుని ఉండే ఓ నియోజకవర్గంలో లైసెన్స్‌ వచ్చినా వదులుకుని వెళ్లక తప్పదని బెదిరిస్తున్నారు. దీంతో ఈ తలనొప్పి ఎందుకని వ్యాపారులు ముందుకు రావట్లేదు.

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మండలాల వారీగా సిండికేట్‌ అయి ఇతరుల దరఖాస్తులు తీసుకోవద్దని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు.

తాడిపత్రి, గుంతకల్లు, అనంతపురం అర్బన్‌ నియోజకవర్గాల్లో నేతల బెదిరింపులు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారులను గెస్ట్‌హౌ్‌సకు పిలిచి మరీ బెదిరించినట్లు తెలిసింది.

తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి సమీపంలోని ఓ నియోజకవర్గంలో ఓ అనధికార ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. గతంలోనూ ఆయన స్థానిక ఎమ్మెల్యేతో కలిసి లిక్కర్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు.

శ్రీకాళహస్తిలో ఓ నేత బెదిరింపులతో దరఖాస్తులు తగ్గాయి. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తులు తీసుకోవద్దని ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు వస్తే తామేం చేయగలమని అధికారులు బదులివ్వగా... ఆ వెబ్‌సైట్‌ మీ పరిధిలోనే ఉంటుంది కదా అంటున్నారు.

రాజమండ్రిలో టీడీపీ, జనసేన నేతల అనుచరులు, ఓ విద్యా సంస్థ యజమాని సోదరుడు మద్యం షాపుల కోసం చక్రం తిప్పుతున్నారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ నేత అనుచరుడు చెప్పిన వారే దరఖాస్తులు చేస్తున్నారు. మంత్రాలయంలో ఇద్దరు నేతల మధ్య పంపకాల చర్చలు కొనసాగుతున్నాయి. ‘60:40 నిష్పత్తిలో పంచుకుందాం. ఆ లెక్క తేలాకే దరఖాస్తులు వేద్దాం’ అని కర్నూలులో ఇద్దరు నేతలు పట్టుబట్టడంతో వ్యాపారులు దరఖాస్తులు ఆపేశారు.

విశాఖలో మొత్తం ఓ ఎమ్మెల్యేనే చక్రం తిప్పున్నారు. ఇప్పటికే అధికారుల పోస్టింగ్‌ల విషయంలో హవా నడిపించిన ఆయన షాపులపైనా తనదే పెత్తనమని పట్టుబడుతున్నారు.

రంగంలోకి ఎక్సైజ్‌ శాఖ

ఎమ్మెల్యేలు, నేతల ఒత్తిళ్లను ఎక్సైజ్‌ శాఖ సీరియ్‌సగా తీసుకుంది. స్వేచ్ఛగా దరఖాస్తులు సమర్పించే వాతావరణం కల్పించాలని, వ్యాపారానికి అవరోధాలు ఉండవనే భరోసా దరఖాస్తుదారులకు కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో అధికారులు జిల్లాల్లో ఎక్సైజ్‌ స్టేషన్లను సందర్శించి దరఖాస్తులకు అడ్డంకులు లేకుండా చూడాలని సూచించారు. దరఖాస్తుదారులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు ఎక్సైజ్‌ శాఖ రుసుము చెల్లింపు విధానాల్లో మార్పులు చేసింది. సీఎ్‌ఫఎంఎ్‌సలో సిటిజన్‌ చలాన్‌ ఫెసిలిటీ ద్వారా ఏ బ్యాంకు ద్వారా అయినా దరఖాస్తు రుసుము చెల్లించే అవకాశం కల్పించింది. గ్రామీణ బ్యాంకుల్లోనూ డీడీలు తీయొచ్చని పేర్కొంది.

Updated Date - Oct 08 , 2024 | 05:00 AM