అవే జిత్తులు.. ఏమార్చే ఎత్తులు
ABN , Publish Date - Jan 12 , 2024 | 04:56 AM
ప్రజలను ఒప్పించి, మెప్పించి ఎన్నికల్లో గెలిచే పరిస్థితులు లేకపోవడంతో వైసీపీ అడ్డదారులకు వ్యూహాలు పన్నుతోంది. ఓ వైపు ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కడం, రైతులు సంతృప్తిగా లేకపోవడం,

వైసీపీ విజయంలో దొంగ ఓట్లే కీలకం.. గత ఎన్నికల అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి
2019లో 30 చోట్ల ఆఖరున చేర్పులు.. నెల్లూరు సిటీలో కొత్తగా 47 వేల ఓట్లు జాబితాలోకి
గెలుస్తారనుకున్న నారాయణ కొద్ది తేడాతో ఓటమి.. నమ్మకమే పెట్టుకోని అనిల్‌కు అనుకోని విజయం
వైసీపీ కుట్రను నాడు పసిగట్టలేకపోయిన టీడీపీ.. అదే దొంగదారిలో ఇప్పుడూ జగన్ ప్రయత్నాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి) : ప్రజలను ఒప్పించి, మెప్పించి ఎన్నికల్లో గెలిచే పరిస్థితులు లేకపోవడంతో వైసీపీ అడ్డదారులకు వ్యూహాలు పన్నుతోంది. ఓ వైపు ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కడం, రైతులు సంతృప్తిగా లేకపోవడం, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమంలో వైసీపీ సర్కారు విఫలంగా కావడం, మైనారిటీలను పూర్తిగా వదిలేయడంతో, యువత, మహిళ, విద్యార్థులు జగన్ సర్కారుపై మండిపడుతున్నారు. ప్రభుత్వం, జగన్ పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్త జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ప్రజల వ్యతిరేకతను తగ్గించుకునే మార్గాలు అన్వేషించకుండా ఉద్యమాలను అణిచివేసే ధోరణిలో జగన్ సర్కారు వ్యవహరిస్తోంది. దీంతో అన్నీ వర్గాల ప్రజలు ప్రభుత్వంపై కసితో ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తే అప్పుడు ప్రభుత్వం అంతుచూడాలని ఎదురుచూస్తున్నారు. దీంతో గత ఎన్నికల్లో వేసిన ఎత్తులు, తొక్కిన దొంగదారుల్నే ఆశ్రయించాల్సిన పరిస్థితి! అప్పట్లో ఓటర్ల జాబితా ప్రక్రియలో తిమ్మినిబమ్మిని చేశారు. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేశారు. ఫారం-6,ఫారం-7పై దృష్టిపెట్టి జాబితాలో వైసీపీ సానుభూతిపరులను ఇబ్బడిముబ్బడిగా చేర్చగలిగారు. ఓటరు నమోదుపై ఇప్పుడుంత చైతన్యం, విపక్షాల్లో కనిపిస్తున్న అవగాహన లేకపోవడంతో జగన్ వేసిన ఎత్తు అప్పుడు పారింది.
30 నియోజకవర్గాల్లో ఓటర్ల తారుమారు
నెల్లూరు నగర నియోజకవర్గంలో గత ఎన్నికల ముందు సుమారు 47వేల ఓట్లు జాబితాలో నమోదయ్యాయి. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు కలిగిన ఓట్లే సుమారు 30 వేలకు పైగా ఉన్నాయి. ఈ ఓట్లన్నీ కేవలం వైసీపీ సానుభూతిపరులవే. ఆ ఎన్నికల్లో అందరూ అప్పటి మంత్రి నారాయణ గెలుస్తారని భావించినప్పటికీ స్వల్ప మెజారిటీతో ఆయన ప్రత్యర్థి అనీల్‌కుమార్ యాదవ్ గెలిచారు. ఓటర్ల జాబితాకు సంబంధించి వైసీపీ చేసిన కసరత్తుతోనే ఈ విజయం సాధ్యమైందని తాజా విశ్లేషణలో వెల్లడైంది. రాష్ట్రంలో సుమారు 30 నియోజకవర్గాల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యర్థి పార్టీల ఓటర్లను తొలగించడంలోనూ వైసీపీ నేతలు అప్పట్లో సఫలీకృతమయ్యారు.
అదే వైసీపీ దృష్టి...
వైసీపీ సర్కారు తొలినుంచీ ఫారం-7, ఫారం-6పైనే దృష్టిపెట్టింది. మూడేళ్లుగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఓట్లను కోసే పనిలోనే ఉంది. సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల సేవలను ఎన్నికల కోసమే ఉపయోగించుకుంటోంది. వీరు వేసే ఎత్తులను టీడీపీ వర్గాలు సత్వరం పసిగట్టలేకపోయాయి. అప్పటికీ టీడీపీ రాష్ట్ర స్థాయి టెక్నికల్ విభాగం... వైసీపీ జిమ్మిక్కులపై ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు ఇస్తూ అప్రమత్తం చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యకర్తలు... వైసీపీ ఎత్తుగడలను, జిమ్మిక్కులను ఎదుర్కొలేకపోతున్నారు. దీంతో ఇప్పటికీ గ్రామాల్లో ఓటర్ల జాబితా గందరగోళంగానే ఉంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ దొంగ ఓట్లను చేర్చేందుకు, ప్రత్యర్థి ఓటర్లను తొలగించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. వారి ఎత్తుగడలతో టీడీపీ కార్యకర్తలు ఓటర్ల జాబితాకు కాపలాదారులుగా మారిపోయారు.
రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో దొంగ ఐడీలను ఉపయోగించి ఓటర్ల జాబితాలోని ప్రత్యర్థి ఓట్ల తొలగింపునకు వైసీపీ నాయకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్నారు. అయితే చంద్రబాబు ఫిర్యాదు తర్వాత ఫారం-7 గంపగుత్త దరఖాస్తుల గురించి త్రీమెన్ కమిటీతో విచారణ చేపట్టాలని ఈసీ నిర్ణయించింది. ఆ తర్వాత నుంచి వైసీపీ కొత్త మార్గాన్ని అన్వేషించ సాగారు. గ్రామాల్లో పలువురు ఐడీలతో ఐదు ఓట్లలోపు తొలగింపుల కోసం ఫాం-7 దరఖాస్తు చేశారు. క్షేత్రస్థాయిలో ఈ దరఖాస్తులను పరిశీలించడానికి దరఖాస్తుదారులను వాకబు చేయగా, చాలాచోట్ల ఆ దరఖాస్తులు తాము పెట్టలేదని, తమకు తెలియదని చెప్పసాగారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సిబ్బంది...ఫిర్యాదుదారులను ట్రేస్ చేయలేక విచారణను మూసేస్తున్నారు. ఇలా ఏదో ఒక ఎత్తుగడతో ఎన్నికల సిబ్బందికి వైసీపీ నేతలు, కార్యకర్తలు నిద్ర లేకుండా చేస్తున్నారు. గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు అప్రమత్తంగా లేనిచోట వైసీపీ శ్రేణుల ఎత్తుగడలు ఫలించి ఓటర్ల జాబితా వారి ఇష్టానుసారంగా తయరవుతోంది.
ఎన్నికలకు సమయం ఉండటంతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా ముందస్తుగా కొంతమేర అప్రమత్తమైనా... నోటిఫికేషన్ తర్వాత ఎన్నికల ముందు చేర్చులు, తొలగింపులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓటర్ల చేర్పులకు సంబంధించి నామినేషన్లు దాఖలు ఆఖరితేదీ దాకా అవకాశం ఉంది. నోటిఫికేషన్ వేసిన తర్వాత మరో పది రోజుల వరకు తొలగింపులకు గంపగుత్తగా ఫారం-7 దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉంది. వాటి పరిశీలన మూడు వారాల్లో చేపడతారు. అంటే ఎన్నికల తేదీకి ఐదారు రోజుల ముందు ఓటర్ల జాబితాలో పలు ఓట్లు గల్లంతయ్యే అవకాశముంది. ఈ సమయంలోనే ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎత్తుగడలను పసిగట్టిన కొంత మంది సాప్ట్‌వేర్ నిపుణులు... వైసీపీ ఇప్పుడు కూడా పలు రకాల జిత్తులమారి ఎత్తుగడలు వేస్తోందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. టీడీపీ వర్గాలను చైతన్య పరిచేందుకు నిపుణుల బృందం...ఓటర్ల జాబితాకు సంబంధించి ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నాయో వివరిస్తున్నారు.