Share News

అవే అబద్ధాలు..

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:59 AM

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ సోమవారం చేసిన బడ్జెట్‌ ప్రసంగంలో అంకెల ఆర్భాటాలు, అబద్ధాలు తప్ప వాస్తవాలు లేవని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 3

అవే అబద్ధాలు..

గవర్నరు నోట అసత్యాలు పలికించిన సర్కార్‌ బడ్జెట్‌ ప్రసంగం నిండా అంకెల ఆర్భాటమేనవరత్నాల డబ్బాతో నిండిన ప్రసంగ ప్రతి

విద్యాకానుక, వసతిదీవెనపై తప్పుడు లెక్కలు

సీఎం సొంత జిల్లాలోనే తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు

కానీ, కోటలుదాటిన జల్‌జీవన్‌ మిషన్‌ లెక్కలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ సోమవారం చేసిన బడ్జెట్‌ ప్రసంగంలో అంకెల ఆర్భాటాలు, అబద్ధాలు తప్ప వాస్తవాలు లేవని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 34 పేజీల పుస్తకాన్ని గవర్నర్‌తో చదివించిన ప్రభుత్వం, అందులో చెప్పినవన్నీ లెక్కల ఆడంబరాలనీ, క్షేత్రస్థాయిలో జగన్‌ ప్రభుత్వం తీరుపై జనాలు సంతృప్తిగా లేరని చెబుతున్నారు. ప్రతి బడ్జెట్‌ ప్రసంగంలోనూ నవరత్నాల డప్పా మోగిస్తూనే ఉన్నారు. పైగా ఈసారి మానవవనరుల అభివృద్ధి, విద్యాభివృద్ధి నినాదం తెచ్చినట్టు గవర్నర్‌ నోట చెప్పించడం గమనార్హం. అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్కపైసా కేటాయించకుండా మానవాభివృద్ధి సాధించామంటూ సర్కారు వల్లించడం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. అమ్మఒడి ద్వారా తల్లుల ఖాతాల్లో జమ చేసేది రూ. 13 వేలు. పాఠశాల నిర్వహణ వ్యయం కోసమని రెండు వేలు కోత పెడుతున్నారు. కానీ, ప్రభుత్వం తన బడ్జెట్‌ ప్రసంగంలో మాత్రం రూ.15 వేలు అమ్మల ఖాతాల్లో వేస్తున్నట్టు చెప్పుకొంది. జగనన్న విద్యాకానుక ద్వారా లక్షల మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చామని చెప్పుకొన్నారు. కానీ, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎగ్గొట్టిన విషయం, ఇప్పటికే ఇంజనీరింగ్‌ విద్యార్థులకు నాలుగు విడతలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయకుండా మొండిచేయి చూపిన విషయం బడ్జెట్‌ ప్రసంగంలోకి రాకుండా జాగ్రత్తపడ్డారు. జగనన్న వసతి దీవెన పథకం అమల్లోకి తెచ్చిన సర్కారు, నాలుగన్నరేళ్లుగా విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.90 వేలు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.30 వేలు మాత్రమే మూడు దఫాలు చెల్లించి చేతులు దులుపుకొన్న వైనమూ దాచేశారు. దీనికి భిన్నంగా విద్యాదీవెన అంశాన్ని బడ్జెట్‌ ప్రసంగంలో గొప్పగా చెప్పుకొన్నారు. ఏపీలో ఇంగ్లీషు మీడియం గతంలో ఎన్నడూ లేనట్లు, జగన్‌ సర్కార్‌ వచ్చిన తర్వాత అమల్లోకి తెచ్చినట్లు బడ్జెట్‌ ప్రసంగంలో సర్కారు డబ్బాలు కొట్టుకుంది. అయితే, సర్కార్‌ రాష్ట్రంలో ఏ పాఠశాలలో అయినా ఇంగ్లీషు బోధించే వాతావరణాన్ని కల్పించిందా అని పలువురు నిలదీస్తున్నారు. నాయీ బ్రాహ్మణులకు స్వయం ఉపాధి రుణాలు ఎగ్గొట్టి ‘చేదోడు’ను జగన్‌ ప్రభుత్వం తెచ్చింది. వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ప్రభుత్వం ఇస్తోంది. అదే సమయంలో చలానాలు, జరిమానాల రూపంలో అంతకంటే ఎక్కువగా వారిని బాదేస్తోంది.

‘జగనన్న తోడు పథకం’లో ఎడాపెడా పేర్లు చేర్చినా.. అసలు లబ్ధిదారులకు ఈ ఫలాలు అందడం లేదు. ఇప్పటికే రుణాలు పొందుతున్న డ్వాక్రా గ్రూపులే ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారేతప్ప వీధి వ్యాపారులకు ఈ పథకం అమలు కావడం లేదని సర్వత్రా ఆరోపణలున్నాయి. వైఎ్‌సఆర్‌ కల్యాణమస్తు, వైఎ్‌సఆర్‌ షాదీ తోఫా పథకాలు మూడేళ్ల తర్వాత అమల్లోకి తెచ్చి లబ్ధిదారుల సంఖ్యను అమాంతం తగ్గించేందుకు నిబంధనలు అమల్లోకి తెచ్చారు. గతంలో ఉన్న విదేశీ విద్యను రద్దు చేసి కొత్తగా మూడేళ్ల తర్వాత అమల్లోకి తెచ్చిన సర్కారు, రకరకాల నిబంధనలతో లబ్ధిదారుల సంఖ్యను కుదించింది. ఇప్పుడు ఆ ఊసే బడ్జెట్‌లో పేర్కొనలేకపోయింది. కేంద్ర పథకం జల్‌జీవన్‌ మిషన్‌ పథకాన్ని వినియోగించుకోవాల్సిన సర్కార్‌, రాష్ట్ర వాటా అందించకపోవడంతో ఆ నిధులు మురిగిపోయిన విషయం బడ్జెట్‌ ప్రసంగంలో కనిపించకుండా దాచేశారు. తాగునీటి ఇక్కట్లతో దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ జిల్లాల్లో తాగునీటి సరఫరా కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించకపోవడంతో ధర్నాలు కూడా చేశారు. అయినా జల్‌జీవన్‌ మిషన్‌ పనుల లెక్కలు మాత్రం కోటలు దాటాయి. తాగునీటి ప్రాజెక్టులను గురించి గొప్పలు చెప్పించిన సర్కార్‌, ముఖ్యమంత్రి సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు పరిస్థితిని బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం.

Updated Date - Feb 06 , 2024 | 03:59 AM