Share News

ఠారెత్తిస్తున్న ఎండలు.. వడగాడ్పులు

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:13 AM

రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. వడగాడ్పులు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఠారెత్తిస్తున్న ఎండలు.. వడగాడ్పులు

నందవరంలో 45.6, రాజాంలో 45.5 డిగ్రీల నమోదు

అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. వడగాడ్పులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో 43 డిగ్రీల కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ అంచనాకు మించి ఎక్కువ మండలాల్లో వడగాడ్పులు వీస్తున్నాయి. నంద్యాల జిల్లా నందవరంలో 45.6, విజయనగరం జిల్లా రాజాంలో 45.5, డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 102 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. మరో 72 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, జిల్లాల్లోని 56 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే శ్రీకాకుళం తిరుపతి వరకు, శ్రీ సత్యసాయి జిల్లాతో సహా 174 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు.. రాష్ట్రంలో వేసవి తీవ్రతతో సమానంగా విద్యుత్తు డిమాండ్‌ కూడా కొనసాగుతోంది. బుధవారం నాడు రాష్ట్రంలో 246.141 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు వాడకం నమోదైంది. బహిరంగ మార్కెట్లో 40.842 మిలియన్‌ యూనిట్లను సమీకరించింది. ఇందులో స్వల్పవ్యవధి కింద 36.042 మిలియన్‌ యూనిట్లను రూ.27.324 కోట్లతో కొనుగోలు చేశారు. రాష్ట్ర థర్మల్‌ విద్యుత్తు సంస్థలలో బొగ్గు నిల్వలు బొటాబొటీగానే ఉన్నాయి.

Updated Date - Apr 26 , 2024 | 07:26 AM