నివేదికలో ప్రాథమిక నిర్ధారణలు...
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:23 AM
దహన తీవ్రతను బట్టి మంటలు వేగంగా వ్యాపించడానికి రసాయనాలు ఉపయోగించినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం కాదని నిర్ధారణ అయింది.
ప్రాథమికంగా ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనిపించడం లేదు.
సీసీ కెమెరాల మరమ్మతులు చేయకపోవడం, విలువైన రికార్డులు ఉంచిన కార్యాలయంలో దోమల కాయిల్స్ కాల్చడానికి అనుమతించడం, కార్యాలయంలో ఇంజన్ ఆయిల్ ఉంచడానికి సీనియర్ అసిస్టెంట్‌కు అనుమతి ఇవ్వడం వంటివి సంబంధిత అధికారుల పూర్తి నిర్లక్ష్యానికి, కర్తవ్య ఉల్లంఘనకు నిదర్శనం.
దహన తీవ్రతను బట్టి మంటలు వేగంగా వ్యాపించడానికి రసాయనాలు ఉపయోగించినట్లు తెలుస్తోంది.
కార్యాలయంలో భూమికి సంబంధించిన ఫైళ్ల ప్రాసెసింగ్‌లో భారీ అవకతవకలు జరిగాయి. చుక్కల భూములు, డి-పట్టా భూములు, 22ఏ(ఐ) డీనోటిఫికేషన్‌కు సంబంధించి పలు ప్రతిపాదనలు అక్రమంగా ప్రాసెస్ అయినట్లు తెలుస్తోంది.
సాక్ష్యాలను నాశనం చేయడానికే భూ సంబంధిత రికార్డులను ఉద్దేశపూర్వకంగా ప్రణాళిక ప్రకారం తగులబెట్టినట్లు తెలుస్తోంది.
మాజీ ఆర్డీవో మురళి, తుకారాం (పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పీఏ), మాధవరెడ్డి (పెద్దిరెడ్డికి సన్నిహితుడు, అనుచరుడు) అదేశాల మేరకు గౌతమ్ ఈ పని చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే దీన్ని సీఐడీ అధికారులు పక్కా ఆధారాలతో రుజువు చేయాల్సిన అవసరం ఉంది.
మాజీ ఆర్డీవో మురళి తప్పుడు నివేదికలు సృష్టించడం, ఫోర్జరీ సంతకాలు చేయడం, 22ఏ కింద పెద్దమొత్తంలో భూములు మళ్లించడం, డి-పట్టా భూములను ఫ్రీహోల్డ్ చేయడం, ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా చుక్కల భూములను క్రమబద్ధీకరించడం వంటి నేరపూరిత కుట్రలకు పాల్పడ్డారు.
ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్... నేరపూరిత నిర్లక్ష్యం, భూ వ్యవహారాల్లో అవినీతి, చిత్తశుద్ధి లోపించడం, కిందిస్థాయి అధికారులపై పర్యవేక్షణ కొరవడటం వంటి నేరాలకు పాల్పడ్డారు.
గౌతమ్ నేరపూరిత కుట్ర, నకిలీ రికార్డులు సృష్టించడం వంటి నేరాలకు పాల్పడ్డారు.
తీసుకోవాల్సిన చర్యలు
మొత్తం 700 ఫైళ్లను పరిశీలించి, అవకతవకలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలి.
ఎమ్మార్వోలు, కలెక్టర్ కార్యాలయం నుంచి వివరాలు తీసుకొని మిగిలిన ఫైళ్లను మళ్లీ తయారు చేయాలి.
సీనియర్ అసిస్టెంట్ గౌతమ్, మాజీ ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్‌ను సస్పెండ్ చేయాలి. వారిపై ఉన్న క్రిమినల్ కేసుతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.
డివిజన్‌లో ఫ్రీహోల్డ్‌గా ఉన్న భూములన్నింటినీ క్షుణ్ణంగా పునఃపరిశీలన చేయాలి.