AP News: కీలక నియోజకవర్గంలో అక్రమాల దందా.. చంద్రబాబు ఇంటిపై దాడితో మంత్రి పదవి గిఫ్ట్
ABN , Publish Date - Jan 29 , 2024 | 02:53 AM
ఆయన అధికార పార్టీలో కీలక మంత్రి. విపక్షాలపై నోరేసుకు పడడంలో స్టేట్ ఫస్ట్‌లో ఉన్న నేత కూడా. ఆయనే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బందరు సమీపంలో ఉన్న ఓ కీలక నియోజకవర్గం ఎమ్మెల్యే కమ్ మంత్రి కూడా! చిత్రం ఏంటంటే.. ఎవరైనా అవినీతి చేయాలంటే కొంత జంకుతారు. కానీ, ఈయన స్టయిల్ వేరు. ఏ పని కావాలన్నా
పత్రికల్లో వచ్చినా బేఖాతర్
కృష్ణా జిల్లా ఫైర్ బ్రాండ్ మంత్రి స్టయిల్
కీలక నియోజకవర్గంలో అక్రమాల దందా
పనేదైనా.. వ్యక్తులెవరైనా పైసలు దక్కాల్సిందే
చెరువు తవ్వకాల నుంచి మట్టి తోలకాల వరకు
పోస్టింగ్స్ నుంచి పేకాట శిబిరం దాకా ‘మామూలే’
వసూళ్ల దందాలో ‘తమ్ముడు తమ్ముడే’ స్టయిల్
స్వలాభమే ధ్యేయంగా అధికార పార్టీ మంత్రి
విపక్షాలపై నోరేసుకు పడడంలో స్టేట్ ఫస్ట్
బాబు ఇంటిపై దాడితో మంత్రి పదవి గిఫ్ట్
యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రస్తుత వైసీపీ మంత్రి.. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై కృష్ణాజిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికలకు వేరే చోట నుంచి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2019లో మళ్లీ పాత స్థానం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకుని.. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. అది కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపైకి తన మూకతో దాడికి యత్నించడం వల్ల లభించిన ప్రమోషన్‌గా వైసీపీలో ప్రచారం ఉండడం గమనార్హం.
మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేకు సంబంధించి కొంత భూమి వివాదంలో ఉంది. ఆ మాజీ ఎమ్మెల్యే కృత్తివెన్ను మండలంలో సుమారు 50 ఎకరాల్లో చెరువులు తవ్వారు. వాటిలో కొంత భూమి వివాదాస్పదమైంది. ఈ వివాదంలో జోక్యం చేసుకున్న మంత్రి.. సుమారు రూ.25 లక్షలు పిండేశారని టాక్.
ఎవరైనా అవినీతికి పాల్పడితే అది నాలుగు గోడల మధ్యే ఉండిపోవాలనుకుంటారు. నలుగురికీ తెలిస్తే.. నవ్వులపాలవుతామని భావిస్తారు. కానీ, కృష్ణా జిల్లా నుంచి మంత్రిగా ఉన్న ఓ ఫైర్ బ్రాండ్ మాత్రం అందుకు విరుద్ధం. పత్రికల్లో తన అవినీతిపై వచ్చే కథనాలను చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటారు. ఆయన తీసుకునే పర్సంటేజీలను తక్కువ చేసి చూపితే బాధపడిపోతారు. తన స్థాయిని మరీ తగ్గించేస్తున్నారని సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతారు.
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
ఆయన అధికార పార్టీలో కీలక మంత్రి. విపక్షాలపై నోరేసుకు పడడంలో స్టేట్ ఫస్ట్‌లో ఉన్న నేత కూడా. ఆయనే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బందరు సమీపంలో ఉన్న ఓ కీలక నియోజకవర్గం ఎమ్మెల్యే కమ్ మంత్రి కూడా! చిత్రం ఏంటంటే.. ఎవరైనా అవినీతి చేయాలంటే కొంత జంకుతారు. కానీ, ఈయన స్టయిల్ వేరు. ఏ పని కావాలన్నా దానికో రేటు ముందుగానే నిర్ణయించేశారు. ఆ రేటు చెల్లిస్తే పని ఆగమేఘాలపై అయిపోతుంది. చెరువు తవ్వుకోవాలన్నా.. నియోజకవర్గ పరిధిలో ఏదైనా పోస్టింగ్ కావాలన్నా.. చివరికి సొంత పార్టీ వారికి ఏదైనా నామినేటెడ్ పోస్టు వేయించాలన్నా తన, మన అనే బేధం లేకుండా ఆయన కలెక్షన్ చేసేస్తారు. ఎక్కడా రాజీ ధోరణి మచ్చుకు కూడా కనిపించదు.
అంచనా పెంచి మరీ అవినీతి
ఫైర్‌బ్రాండ్ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని బంటుమిల్లి మండలంలో మల్లంపూడి వద్ద రోడ్డు కమ్ బ్రిడ్జి నిర్మిస్తే వేలాది మంది రైతులకు ఉపయోగపడుతుంది. ఈ వంతెన నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు సాక్షాత్తు స్థానిక ప్రజాప్రతినిధి భర్త ఒకరు మంత్రి పేరు చెప్పి వసూళ్లకు తెగబడ్డారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం స్థానిక రైతులు కొద్ది రోజుల కిందట వైసీపీ మాజీ మండల పార్టీ కన్వీనర్, డ్రైనేజీ ఏఈని కలిశారు. పనుల ఎస్టిమేషన్, భూసారపరీక్ష, అప్రూవల్ నిమిత్తం రూ.50 వేలు అడగటంతో ఆ మొత్తం ముట్టచెప్పారు. అయినా పనులు ముందుకు కదలకపోవడంతో కొద్ది మంది రైతులు మాజీ మండల పార్టీ కన్వీనర్‌ను కలవగా ఆయన మంత్రి వర్యులు రూ.40 లక్షలు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. అంత ఇచ్చుకోలేమని మొరపెట్టుకున్న రైతులు రూ.20 లక్షలు వరకు ఇచ్చుకోగలమని తెలిపారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తంగా మూడు విడతల్లో రూ.4.50 లక్షలు ఇచ్చినట్లు రైతులు వివరించారు. వాస్తవానికి మల్లంపూడి వంతెన నిర్మాణానికి రూ.కోటి సరిపోతోంది. కానీ, కమీషన్ల కోసం వంతెన ఎస్టిమేషన్లను మూడు రెట్లు పెంచేసి రూ.3 కోట్లు చేశారని స్థానికంగా చర్చ సాగుతోంది. సాక్షాత్తు మంత్రి సూచనల మేరకే ఇలా చేశామని వైసీపీ నాయకులు రైతులకు చెప్పడం గమనార్హం.
దశ మార్చిన దాడి!
మాజీ సీఎం చంద్రబాబు నివసిస్తున్న ఉండవల్లి కరకట్ట ఇంటిపై 2021, సెప్టెంబరు 17న వైసీపీ నాయకులు దాడికి యత్నించారు. వందల సంఖ్యలో కార్లలో తరలివచ్చి ఈ దాడికి సిద్ధమయ్యారు. ఈ దాడిలో సదరు మంత్రి, ఆయన అనుచరులు కీలకంగా వ్యవహరించారు. మంత్రి అనుచరులైన పాలడుగు దుర్గా ప్రసాద్(గుంటుపల్లికి చెందిన ఈయన ఎన్టీటీపీఎ్‌సలో సాధారణ కాంట్రాక్టర్. ఈయన భార్య ఇబ్రహీంపట్నం ఎంపీపీ. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సెటిల్‌మెంట్స్ ద్వారా అక్రమ సంపాదనకు తెరలేపారు), నల్లమోతు జాన్(మంత్రి తమ్ముడి అనుచరుడు), మధుపల్లి ఆనంద్‌కుమార్(చంద్రబాబు ఇంటిపై దాడిలో టీడీపీ నేతలను కొట్టిన వారిలో ఈయన ఉన్నారు)లతో కలిసి చంద్రబాబు ఇంటిపై దాడికి దిగారు. ఈ ఘటన తర్వాతే సదరు ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కిందని వైసీపీలోనే చర్చసాగుతోంది.
జడ్జి కుటుంబానికే ఎసరు!
మంత్రి వర్యుల నియోజకవర్గంలోని కొంకేపూడి గ్రామంలో జడ్జి తిరుమలరావుకు 5.30 ఎకరాల పొలం ఉంది. ఈయన 2021లో కొవిడ్‌తో మృతి చెందారు. తిరుమలరావుకు కొంకేపూడిలో ఉన్న 5.30 ఎకరాలను కౌలుకు ఇచ్చి దాని ద్వారా వచ్చే ఆదాయంపై ఆయన తల్లి వెంకటసుబ్బమ్మ జీవనం సాగించేవారు. తిరుమలరావు భార్యకు, తల్లికి ఈ భూమికి సంబంధించి వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి అనుచరుడైన పామర్తి సాంబశివరావు అలియాస్ డొకోమో సాంబ ఈ వివాదంలో జోక్యం చేసుకుని మొత్తం భూమిని తిరుమలరావు భార్య పరమయ్యేలా చూస్తానని, తనకు 1.30 ఎకరాలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందం మేరకు 2022 డిసెంబరులో 1.30 ఎకరాల భూమిని పామర్తి సాంబశివరావు తండ్రి అర్జునరావు పేరుతో రిజిస్టర్ కూడా చేయించుకున్నారు. మిగిలిన 4 ఎకరాల భూమిని మంత్రి అండతో బలవంతంగా కబ్జా చేసి తిరుమలరావు భార్యకు అప్పగించే ప్రయత్నం చేయడంతో 75 ఏళ్ల వృద్ధురాలైన తిరుమలరావు తల్లి పోలీసులను ఆశ్రయించారు. ఇక్కడ న్యాయం జరగకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.
వందల ఎకరాల్లో పట్టాలు
కృత్తివెన్ను మండలం పోడు గ్రామంలో 80 ఎకరాల వరకు బీఫారం పట్టా భూములను చాల తక్కువ రేట్లకు కొనుగోలు చేసి, మంత్రి భినామీల పేరిట చెరువులు తవ్వారు. కృత్తివెన్ను గుడిదిబ్బ గ్రామంలో తగదాల్లో ఉన్న 35 ఎకరాలను అతి తక్కువ ధరకు అనుచరులు దక్కించుకున్నారు. గరిశపూడి గ్రామ సమీపంలో 300 ఎకరాల బీఫారం భూములకు త్వరలో పట్టాలు ఇప్పిస్తామని చెప్పి, వారికి ఏడాదికి రూ.5 వేలు, రూ.10 వేలు చొప్పున లీజుకు రాయించుకున్నారు. అలా తీసుకొన్న భూములను చెరువులుగా మార్చి ఏడాదికి రూ.70 వేల నుంచి రూ.లక్ష లీజుకు వేరే వ్యక్తులకు కట్టబెట్టారు. బ్రహ్మాపురంలో ని 22వ వార్డులో 3 ఎకరాల భూమిని బినామీల పేరిట కొనుగోలు చేసి, రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నారు. ఇక, ఈ మంత్రికి తన సొంత నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాలపై దృష్టిపడింది. అప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యేకు ఎదురే లేకుండా ఉండేది. ఎప్పుడైతే మంత్రి వర్గం ఇక్కడ అడుగు పెట్టిందో అప్పటి నుంచి రెండు వర్గాలు ఎదురుదాడికి దిగాయి. మంత్రి అయున తర్వాత గ్రావెల్ తవ్వకాల ద్వారా సుమారు రూ.50 కోట్లు ఆర్జించినట్లు పార్టీ నేతల్లో చర్చగా ఉంది.
కాపు సారాతో రూ.కోట్లు
కాపుసారా మత్తులో కృష్ణా జిల్లా సముద్రతీరం ఊగుతోంది. మడ అడవులు, చేపల చెరువులు, కాల్వ గట్లు, మల్లె తోటలు, చిక్కటి పొదలు ఇవే కాపుసారా బట్టీలకు నెలవుగా మారాయి. మంత్రి నియోజకవర్గంలోని మండలాల్లో కాపుసారా కాచే వారికి ఆయన అండదండలు పుష్కలంగా ఉన్నాయని అంటారు. అనుచరులే అన్నీ చూసుకుంటున్నారు. కాపుసారా ద్వారా నెలకు రూ.10 కోట్ల పైచిలుకు అక్రమ సంపాదన పోగవుతున్నట్టు సమాచారం.
అమాత్యుడి అక్రమాల రేట్లు!
నియోజకవర్గంలో చెరువు తవ్వాలంటే ప్రతి ఎకరాకు రూ.20 వేలు కప్పం కట్టాలి.
మట్టి తోలకాలకు ఏడాదికి రూ.కోటి చెల్లించక తప్పదు.
పాస్‌పుస్తకానికో రేటు, సర్వేకో రేటు, తగదాల్లోనున్న భూ సమస్యల పరిష్కారానికి మరో రేటు.
బంటుమిల్లి మండలంలో పేదలైన 129 మందికి పట్టాలు ఇచ్చేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు నుంచి రూ.లక్ష గుంజారు.
నడుపూరు-కొత్తపల్లి రోడ్డుకు రూ.52 కోట్లు విడుదలైనా పనులు మొదలు కాలేదు. దీనికి మంత్రి కమీషన్ రూ.కోటి కావడమే కారణం.
నియోజకవర్గంలో పేకాట శిబిరాల నుంచి మంత్రికి మామూళ్లు ఠంచనుగా ముడుతున్నాయి.
పార్టీ పెద్దలకు సైతం నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నా మంత్రి అడిగినంత చెల్లించాల్సిందే.
అధికారుల ట్రాన్స్‌ఫర్‌లు జరగాలన్నా.. కొత్త అధికారులు రావాలన్న ముడుపు మామూలే.