Share News

‘మూడేళ్ల ప్రాక్టీస్‌’ నిబంధన చట్టవిరుద్ధం

ABN , Publish Date - Feb 25 , 2024 | 03:23 AM

దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నియామక అర్హతకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కనీసం మూడేళ్లు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసి ఉండాలన్న నిబంధనను తప్పుపట్టింది.

‘మూడేళ్ల ప్రాక్టీస్‌’ నిబంధన చట్టవిరుద్ధం

ప్రభుత్వం రూపొందించే నిబంధనలు చట్టాలకు లోబడి ఉండాలి: హైకోర్టు

అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టుల భర్తీలో పిటిషనర్లను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం

అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నియామక అర్హతకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కనీసం మూడేళ్లు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసి ఉండాలన్న నిబంధనను తప్పుపట్టింది. ఆ నిబంధన చట్టవిరుద్ధమని ప్రకటించింది. అసిస్టెంట్‌ కమిషనర్‌గా నియమితులయ్యేవారు కనీసం మూడేళ్లు హైకోర్టు న్యాయవాదిగా ఉంటే సరిపోతుందని దేవదాయశాఖ చట్టంలోని సెక్షన్‌ 4(5)(ఏ) చెబుతోందని గుర్తు చేసింది. మూడేళ్లపాటు హైకోర్టులో ప్రాక్టీస్‌ చేసి ఉండాలన్న నిబంధన 3(5)(1).. దేవదాయశాఖ చట్టంలోని సెక్షన్‌ 4(5)(ఏ)కు విరుద్ధమని పేర్కొంది. పిటిషనర్లలో ప్రతిభావంతులను అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టులకు పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌. రఘునందనరావుతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దేవదాయశాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టుల భర్తీకి 2021లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి న్యాయ విద్యను అభ్యసించి ఉండాలని, హిందూ మతాన్ని ఆచరిస్తూ ఉండాలని అందులో పేర్కొన్నారు. అలాగే మూడేళ్లు ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసి ఉండాలని స్పష్టం చేశారు. కాగా, ఈ పరీక్షకు చీరాల బార్‌ అసోసియేషన్‌ సభ్యురాలు కె. రేఖ, గుంటూరు బార్‌ అసోసియేషన్‌ సభ్యురాలు కాకి లలిత, బెజవాడ బార్‌ అసోసియేషన్‌ సభ్యురాలు ఎం. మంజులాదేవి దరఖాస్తు చేశారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అయితే, మూడేళ్లు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేయనందున అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టుకు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వీరు హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది జీవీ శివాజీ, పి. దుర్గాప్రసాద్‌లు వాదనలు వినిపించారు. దేవదాయశాఖ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌. శ్రీరామ్‌ వాదించారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. దేవదాయశాఖ చట్టంలోని సెక్షన్‌ 153 ప్రకారం నిబంధనలు రూపొందించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, అవి చట్టానికి విరుద్ధంగా ఉండకూడదని పేర్కొంది. పిటిషనర్ల పేర్లను అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టుల భర్తీలో పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

Updated Date - Feb 25 , 2024 | 03:24 AM