ధరలకు కళ్లెం!
ABN , Publish Date - Oct 27 , 2024 | 04:06 AM
రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసరాల ధరలను అదుపు చేసేందుకు సర్కారు నడుంబిగించింది.
సామాన్యులకు ఊరట కల్పించేలా ధరల నియంత్రణకు సర్కారు సిద్ధం
మంత్రివర్గ ఉపసంఘం నియామకం.. చైర్మన్‌గా మంత్రి నాదెండ్ల
అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసరాల ధరలను అదుపు చేసేందుకు సర్కారు నడుంబిగించింది. ధరలను నియంత్రించేందుకు అనుసరించాల్సిన విధానాలు, పర్యవేక్షణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చైర్మన్‌గా, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, వాణిజ్య పన్నులశాఖల మంత్రి పయ్యావుల కేశవ్‌లను సభ్యులుగా నియమించింది. ఈ బృందాన్ని సమన్వయం చేసేందుకు పౌరసరఫరాలశాఖ కమిషనర్ జి. వీరపాండియన్‌ను సభ్యకార్యదర్శిగా నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
బృందం ఏం చేస్తుంది?
నిత్యావసర సరుకుల ధరల ధరల స్థిరీకరణకు మంత్రి వర్గ ఉపసంఘం కృషి చేస్తుంది. వినియోదారులకు ఆయా సరుకులను సరసమైన, సహేతుకమైన ధరలకు అందించేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది.
ఏయే సరుకులకు ఎంతెంత సబ్సిడీ ఇవ్వాలో క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయిస్తుంది.మార్కెట్ జోక్యాన్ని ఏ స్థాయిలో నియంత్రించాలో వెల్లడిస్తుంది. శాశ్వత ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుపై సిఫారులు చేస్తుంది. వ్యవసాయ, ఇతర వస్తువుల ధరలలో పెరుగుదలను అంచనా వేసి, కారణాలను విశ్లేషిస్తుంది.
ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం సులువుగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా సమగ్రమైన డేటా బేస్‌ను మంత్రివర్గ ఉపసంఘం రూపొందిస్తుంది. ఆహార పంటల పర్యవేక్షణ, నిత్యావసర వస్తువుల ఉత్పత్తిని పెంచడంపైనా సూచనలు చేస్తుంది.
ఏడాది పొడవునా నిత్యావసరాల సరఫరాలో స్వయం సమృద్ధిని సాధించడానికి అవసరమైన మార్గాలను అన్వేషిస్తుంది. సరుకుల నిల్వలు పెంచడం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి సంబంధించిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేస్తుంది.
రైతు సంఘాలు, మిల్లర్స్ అసోసియేషన్, చాంబర్ ఆఫ్ కామర్స్, ఆహార ధాన్యాలు, పప్పుదినుసులు, ఆయిల్ డీలర్లు, ఎగుమతి, దిగుమతిదారులు, వ్యాపారులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరపనుంది.
‘ఉచిత గ్యాస్’పై జీవో విడుదల.. ఎల్లుండి నుంచి బుకింగ్
అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 29 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించిన నేపథ్యంలో ఆ మేరకు విధివిధానాలను వివరిస్తూ ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది. మేనిఫెస్టోలో ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీల్లో భాగంగా రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేయనున్నారు. 31న దీపావళిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు జీవోలో పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న లబ్ధిదారులకు సబ్సిడీ నిధులను ఆధార్‌తో లింకైన బ్యాంకు ఖాతాలో నేరుగా జమచేస్తారు.