Share News

పొద్దుతిరుగుడు ధర ఢమాల్‌

ABN , Publish Date - Feb 19 , 2024 | 03:14 AM

రాష్ట్రంలో పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్‌) విత్తనాలకు కనీస మద్దతు ధర దక్కడం లేదు. 2023-24 ఖరీఫ్‌ సీజన్‌లో క్వింటాకు రూ.6,760గా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. కానీ కర్నూలు, ఆదోని వంటి మార్కెట్లలో సగం ధర కూడా రావట్లేదని రైతులు

పొద్దుతిరుగుడు ధర ఢమాల్‌

ప్రభుత్వ ‘మద్దతు’ క్వింటా 6,760

వ్యాపారుల కొనుగోలు ధర 3,200

అమరావతి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్‌) విత్తనాలకు కనీస మద్దతు ధర దక్కడం లేదు. 2023-24 ఖరీఫ్‌ సీజన్‌లో క్వింటాకు రూ.6,760గా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. కానీ కర్నూలు, ఆదోని వంటి మార్కెట్లలో సగం ధర కూడా రావట్లేదని రైతులు వాపోతున్నారు. గత నవంబరులో రూ.4,700 దాకా ఉన్న ధర ఇప్పుడు రూ.3,200లోపే పలుకుతోంది. మూడు నెలల్లోనే క్వింటాకు రూ.1,500దాకా తగ్గింది. సాధారణంగా పొద్దుతిరుగుడు పంట రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువగా సాగవుతుంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం కారణంగా పంట సాగు తగ్గింది. ఖరీఫ్‌ సీజన్‌లో 13 వేల ఎకరాల్లో వేయాల్సిన పొద్దుతిరుగుడు పంట కేవలం ఏడున్నర వేల ఎకరాల్లో సాగైంది. రబీలో 25 వేల ఎకరాల్లో వేయాల్సిన పొద్దుతిరుగుడు 5 వేల ఎకరాల్లోనే సాగైంది. ఈ ఏడాది సాగు, ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దేశవ్యాప్త డిమాండ్‌ దృష్ట్యా దుకాణాల్లో లీటర్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.200పైనే పలుకుతోంది. కానీ రాష్ట్రంలో పొద్దుతిరుగుడు విత్తనాలకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు. దీంతో గిట్టబాటుకావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర కంటే తక్కువకు రైతులు అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు... మార్కెట్‌ జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి, ధరల స్థిరీకరణ నిధి కింద రైతులకు చెల్లింపులు జరుపుతామని జగన్‌ సర్కార్‌ ప్రగల్భాలు పలికింది. కానీ పొద్దుతిరుగు పంట విషయంలో ప్రభుత్వం చోద్యం చూస్తోందని రైతులు మండిపడుతున్నారు.

Updated Date - Feb 19 , 2024 | 03:14 AM