Share News

టీడీపీ సభ్యులను అడ్డుకున్న పోలీసులు

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:53 AM

అసెంబ్లీ సమావేశాల తొలిరోజు సభకు ప్రదర్శనగా బయలుదేరిన టీడీపీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు.

టీడీపీ సభ్యులను అడ్డుకున్న పోలీసులు

నినాదాలు, ప్లకార్డులు లేకుండా వెళ్లాలంటూ హుకుం

ఖాకీల తీరుపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మండిపాటు

అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాల తొలిరోజు సభకు ప్రదర్శనగా బయలుదేరిన టీడీపీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. నినాదాలు చేయకుండా, ప్లకార్డులు లేకుండా వెళ్లాలంటూ బ్యారికేడ్లు అడ్డుపెట్టడంపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. సోమవారం రాజధానిలోని వెంకటపాలెం గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలేసి, నివాళులర్పించిన టీడీపీ సభ్యులంతా కలసికట్టుగా అసెంబ్లీకి బయలుదేరారు. వెలగపూడిలోని ఫైర్‌ స్టేషన్‌ దగ్గర నుంచి ‘ధరలు ఆకాశంలో... పేదలు పాతాళంలో..!’ అనే బ్యానర్‌, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ పలు ప్లకార్డులను పట్టుకుని, బె ౖబై జగన్‌ అంటూ నినాదాలు చేస్తూ టీడీపీ సభ్యులు అసెంబ్లీకి బయలుదేరారు. ఆ మార్గంలో బ్యారికేడ్లు అడ్డు పెట్టిన పోలీసులు వారిని నిలువరించారు. ఆ క్రమంలో పోలీసులకు... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. టీడీపీ నేతల ప్రదర్శనను కవర్‌ చేస్తున్న మీడియానూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వస్తుంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలనే అడ్డుకుంటారా? అంటూ మండిపడ్డారు. ప్లకార్డులు తీసేయాలని, నినాదాలు చేయకుండా వెళ్లాలని ఓ పోలీస్‌ అధికారి ఆదేశించడంపై టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమేనా? ప్రజాప్రతినాధుల హక్కులనూ కలారాస్తారా? అంటూ మండిపడ్డారు. గొడవ పెద్దది అవుతుండడంతో పోలీస్‌ ఉన్నతాధికారుల సూచన మేరకు టీడీపీ సభ్యులను వదిలారు. ఎమ్మెల్యేలు రాకపోకలు సాగించే అసెంబ్లీ గేటు వద్ద మరో పోలీస్‌ బృందం వారిని మళ్లీ అడ్డుకుంది. దీంతో పోలీసులపై టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో మీడియాను అడ్డుకొని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోపలికి వెళ్లాలని పోలీస్‌ అధికారులు కోరారు.

Updated Date - Feb 06 , 2024 | 03:53 AM