Share News

అన్నా అని పిలిపించుకున్నవాడే... హంతకులను రక్షిస్తున్నాడు

ABN , Publish Date - Mar 16 , 2024 | 02:52 AM

ఒకసారి అద్దం ముందు నిల్చొని హత్య చేసింది సునీత కుటుంబమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

అన్నా అని పిలిపించుకున్నవాడే... హంతకులను రక్షిస్తున్నాడు

పైగా బాధితురాలు సునీతపైనే అభాండాలు

‘సాక్షి’లో వివేకా వ్యక్తిత్వ హననానికి ప్రయత్నం

మీరు మనుషులేనా? మనస్సాక్షి లేదా మీకు?

అద్దం ఎదుట నిలబడి మిమ్మల్ని ప్రశ్నించుకోండి

అన్న జగన్‌ను ఉద్దేశించి షర్మిల తీవ్ర స్వరం

న్యాయం, నిజం పక్కన రాష్ట్ర ప్రజలు నిలబడాలి

అన్నా అని పిలిపించుకున్నవాడే..

కడప, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ‘‘ఒకసారి అద్దం ముందు నిల్చొని హత్య చేసింది సునీత కుటుంబమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అద్దం ఏం సమాధానం చెబుతుందో, మీ మనస్సాక్షి ఏం సమాధానం చెబుతుందో ఒక్కసారి మీ మనసు పెట్టి వినండి’’ అని సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆయన సోదరి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో శుక్రవారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో షర్మిల పాల్గొన్నారు. ‘‘హత్య జరిగిన రోజు.. హత్య ఫలానా వాళ్లు చేశారనిగానీ, ఫలానా వాళ్లు చేయించారనేదిగానీ తెలిసే పరిస్థితి లేదు. కానీ ఈరోజున హత్య చేసింది ఎవరో కాదు బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి’’ అని తెలిపారు. అయినా.. ఈరోజు వరకు కూడా చిన్నాన్న విషయంలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘చిన్నమ్మ సౌభాగ్యమ్మ, బిడ్డ సునీత... చిన్నాన్న చావుతో అందరికంటే ఎక్కువగా నష్టపోయారు. సౌభాగ్యమ్మ, సునీత బాధితులు. వారిపట్ల సానుభూతి లేకపోగా బాధితులకు భరోసా అనే ఆలోచన లేకపోగా, సునీత కుటుంబం హత్య చేసిందని ఆరోపిస్తున్నారు. ఇది మీ మనస్సాక్షి అయినా ఎలా ఒప్పుకొంటుంది?’’ అంటూ సోదరుడు జగన్‌ను ఉద్దేశించి తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ఇంకా షర్మిల ఏమన్నారంటే..

మీరు మనుషులేనా?

‘‘ఆఖరుకు ఇంతగా దిగజారతారని ఎవరూ ఊహించలేదు. ‘సాక్షి’లో పైన రాజశేఖర్‌రెడ్డి ఫొటో.. కింద రాజశేఖరరెడ్డి నమ్మిన, ఆయన కోసం పనిచేసిన తమ్ముడి వ్యక్తిత్వ హననం. ఇది న్యాయమేనా? మీ కోసం పనిచేసినపుడు కనిపించలేదా వివేకానందరెడ్డి కేరెక్టర్‌? ఆఖరి నిమిషం వరకు, చనిపోయే రోజు రాత్రి వరకు వైసీపీ కోసమే చిన్నాన్న క్యాంపెయిన్‌ చేశారు కదా! వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులను ఆయన అంగీకరించకపోయినా జగన్మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని నమ్మి అదే వైసీపీ కోసం క్యాంపెయిన్‌ చేశారు. అలాంటి వ్యక్తి హననానికి ‘సాక్షి’లో పూనుకొంటారా? మీరు మనుషులేనా? అంతటిదో ఆగారా! సోషల్‌ మీడియాలో ఎన్ని రకాలుగా బెదిరించారు, బూతులు తిట్టారు, తోడబుట్టిన చెల్లెలు అని చూడకుండా సునీతను అవమానించారు. అన్నిటిని తట్టుకుని, ఈరోజు నిలబడింది సునీత’’

అప్పుడే ఎందుకు అరెస్టు చేయలేదు?

‘‘ఇన్ని సంవత్సరాలలో న్యాయం జరగాలని, నిజానిజాలు తేలాలని, హంతకులకు శిక్షలు పడాలని సునీత తిరగని చోటు లేదు, తట్టని తలుపు లేదు. నిజంగా సునీత కుటుంబం ఈ హత్య చేసి ఉంటే ఈ కేసును ఇంతగా పట్టించుకోవాల్సిన అవసరం వారికి ఏమిటి? 2019లో మీరు అధికారంలోకి వచ్చారు కదా! కేసు మీ చేతుల్లోనే ఉంది కదా! అప్పుడు సునీతను ఎందుకు అరెస్టు చేయించలేదు? సునీత కుటుంబాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకంటే దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో మీకు తెలుసు కాబట్టి. మీ మనస్సాక్షికి అంతా తెలుసు.’’

సునీత పోరాటానికి బలమవుతా.. ఆయుధమవుతా...

‘‘సునీత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి బిడ్డ. రాజశేఖర్‌రెడ్డి తోబుట్టువులను ఎలా చూసుకున్నారో మీకు తెలియదా? మరి మీరు రాజశేఖర్‌రెడ్డి వారసులే కదా. మరి జగనన్నా! మీరు ఏం చేస్తున్నారు? సునీతకు మాటిస్తున్నా....చిన్నమ్మకు మాటిస్తున్నా.. ఎవరు నిలబడినా నిలబడకపోయినా రాజశేఖర్‌రెడ్డి బిడ్డ మీకు అండగా ఉంటుంది.. సునీత చేస్తున్న పోరాటంలో బలమవుతా... హత్య చేసినవారికి శిక్ష పడాలని సునీత చేస్తున్న న్యాయ, ధర్మ పోరాటంలో నేను ఒక ఆయుధం అవుతా. ఇది రాజకీయాల కోసమో, అధికారం కోసమో, వారసత్వం కోసమో చేస్తున్నది కాదు.. ఆస్తి కోసం చేస్తున్నది అంతకంటే కాదు.. ఈ సమరం చేస్తున్నది న్యాయం కోసం.. చిన్నాన్న ఆత్మశాంతి కోసం చేస్తున్నా. ఒక్క పులివెందుల ప్రజలే కాదు, జిల్లా ప్రజలే కాదు...యావత్‌ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరు ఒక నిర్ణయం తీసుకోవాలి. న్యాయం పక్షాన నిలబడాలి, నిజం పక్కన నిలబడాలి. హంతకులను కాపాడుతున్న వారికి గుణపాఠం చెప్పాలి’’ అని షర్మిల పిలుపునిచ్చారు.

Updated Date - Mar 16 , 2024 | 02:52 AM