దక్షిణాన్ని ముంచెత్తే ‘ఈశాన్యం’
ABN , Publish Date - Oct 16 , 2024 | 04:35 AM
దేశం ఉత్తర ప్రాంతం చలికాలానికి సిద్ధమయ్యే తరుణంలో దక్షిణ భారతదేశంలోని తూర్పుతీరం మాత్రం తుఫాన్ హెచ్చరికలతో తల్లడిల్లుతూ ఉంటుంది.
చలికాలంలో తమిళనాడుకు వాన గండం!
భౌగోళిక పరిస్థితుల కారణంగా అక్టోబరు-డిసెంబరు మధ్య కుంభవృష్టి
1991 నుంచి 2023 వరకు 48 వాయుగుండాలు/తుఫాన్లు
ఏటా మునుగుతున్న చెన్నై మహానగరం
చెన్నై, విశాఖపట్నం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): దేశం ఉత్తర ప్రాంతం చలికాలానికి సిద్ధమయ్యే తరుణంలో దక్షిణ భారతదేశంలోని తూర్పుతీరం మాత్రం తుఫాన్ హెచ్చరికలతో తల్లడిల్లుతూ ఉంటుంది. అక్టోబర్ వచ్చిందంటే చాలు తీరప్రాంతంలోని ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతూ ఉంటారు. ఏ తుఫాన్ చుట్టేస్తుందో, ఎంత పెద్ద వరద ముంచేస్తుందోనని ప్రజలు భయపడుతూ ఉంటారు. ఇక ఏటా అక్టోబర్, డిసెంబర్ మధ్య చెన్నై నగరం కష్టాలు చెప్పనలవి కాదు. ఇంతకీ ఎందుకిలా..? అంటే.. ఈశాన్య రుతుపవనాలతో పాటు భౌగోళిక పరిస్థితులే కారణం. సాధారణంగా భారతదేశానికి నైరుతి రుతుపవనాలతో ఎక్కువ వర్షపాతం ఉంటుంది. ఇవి జూన్‌తో మొదలై అక్టోబర్ తొలి వారం వరకు పశ్చిమ-ఉత్తర రాష్ట్రాలకు విస్తరించి వర్షాలు కురిపిస్తాయి. పశ్చిమ కనుముల వల్ల నైరుతి రుతుపవనాలు తమిళనాడు తూర్పు తీరానికి విస్తరించలేవు. దేశం మొత్తం వర్షాలు కురిసే సమయంలో తమిళనాడు తూర్పు తీరంలో పొడి వాతావరణం ఉంటుంది. ఇక నైరుతి రుతుపవనాలు అక్టోబర్‌లో హిమాలయాలను తాకి వెనుదిరుగుతాయి. అప్పుడు వీటిని ఈశాన్య రుతుపవనాలు అని పిలుస్తారు.
ఆగ్నేయంలో బలపడి.. వాయవ్యంగా పయనించి
నైరుతి రుతుపవనాలు నిష్క్రమణతో దేశంలో కొనసాగే ఇంట్రా ట్రోఫికల్ కన్వర్జెన్సీ జోన్ (ఐటీసీజడ్) దక్షిణాది వైపు వచ్చేస్తుంది. దీంతో బంగాళాఖాతంలోని ఉత్తర ప్రాంతంలో వాతావరణం పొడిగా మారుతుంది. దీనికితోడు ఈశాన్య రుతుపవనాలు బంగాళాఖాతం మీదుగా పయనించేటప్పుడు ఉత్తర ప్రాంతంలో జలాలు చల్లగా మారతాయి. ఇంకా భూభ్రమణ దిశను అనుసరించి భూమధ్యరేఖకు 5 డిగ్రీల అక్షాంశంపైన అంటే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు బలపడి వాయవ్యంగా పయనించి ఏపీ కోస్తా, తమిళనాడు తీరం దిశగా వస్తుంటాయి. ఇంకా ఈ సీజన్‌లో సముద్రంలో ఏర్పడే మేఘాలు సమీకరణ అవుతాయి. అదే నైరుతి రుతుపవనాల సమయంలో మేఘాలు విచ్ఛిన్నానికి గురవుతుంటాయి. అందువల్ల ఈ సీజన్‌లో తుఫాన్‌లు/వాయుగుండాలు బలపడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని ఏయూ వాతావరణ విభాగం విశ్రాంత ఆచార్యుడు ఓ ఎ్‌సఆర్‌యూ భానుకుమార్ తెలిపారు.
హుద్ హుద్ కూడా ఇదే కాలంలో
భారత వాతావరణ శాఖ వివరాల మేరకు 1991 నుంచి 2023 వరకూ 48 వాయుగుండాలు/తుఫాన్‌లు/తీవ్ర తుఫాన్‌లు/పెనుతుఫాన్‌లు కోస్తాంధ్ర, తమిళనాడులో అక్టోబరు నుంచి డిసెంబరు వరకూ తీరం దాటాయి. వీటిలో ఒక్క అక్టోబరులోనే 13 ఉన్నాయి. వీటిలో విశాఖను కుదిపేసిన హుద్‌హుద్ పెనుతుఫాన్ కూడా ఉంది. 1891 నుంచి 1991 వరకూ చూస్తే సుమారు 150కుపైగా వాయుగుండాల నుంచి ప్రచండ తుఫాన్‌లు ఉన్నాయి. తూర్పుతీరంలో అత్యంత విషాదాన్ని మిగిల్చిన దివిసీమ తుఫాన్ 1977 అక్టోబరులోనే సంభవించింది. అటువంటి తుఫాన్‌లు తక్కువే అయినా మోస్తరు తుఫాన్‌లు పదుల సంఖ్యలో తూర్పుతీరాన్ని కుదిపేశాయి. దేశంలో మిగిలిన ప్రాంతాలతో పోల్చితే తుఫాన్‌ల వల్ల ఏపీ, తమిళనాడులే ఎక్కువగా నష్టపోయాయి.